
గత బడ్జెట్‌లో రూ.1,104.85 కోట్లు
ఈ సారి రూ.871.24 కోట్లు
నిర్వహణ పద్దు రూ.8,727.72 కోట్లు
హైదరాబాద్,వెలుగు : రాష్ట్ర బడ్జెట్‌లో హోంశాఖకు నిధుల కేటాయింపు స్వల్పంగా పెరిగింది. అయితే, నిర్వహణ పద్దును పెంచి.. ప్రగతి పద్దులో కోత విధించారు. ఈ రెండింటికీ కలిపి మొత్తం రూ. 9,599 కోట్లు వార్షిక బడ్జెట్‌గా నిర్ణయించారు. గత బడ్జెట్ తో పోల్చితే ఈ ఏడాది నిర్వహణ పద్దు కింద ఎక్కువ నిధులు కేటాయించారు. మొత్తం రూ.8,727.72 కోట్లు కేటాయించారు. ప్రగతి పద్దు కింద రూ.871.24 కోట్లు ప్రతిపాదించారు. గత ఏడాది రూ.1104.85 కోట్లు అలాట్ చేశారు. పోలీస్ ఉద్యోగాలు పెరగడంతో సాలరీలు, ఇతర ఖర్చులు భారీగా పెరిగాయి. దీంతో మెయింటనెన్స్‌కు ఎక్కువగా కేటాయింపులు చేశారు. బంజారాహిల్స్‌లో నిర్మించిన కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌కు రూ.కోటి కేటాయించారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన పోలీస్ స్టేషన్స్, ఇతర నిర్మాణాలు పూర్తి కావడంతో ప్రగతి పద్దుకు నిధుల కేటాయింపును తగ్గించారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్ డీజీపీ ఖాతాకు నిర్వహణ పద్దు నిధులు రూ. 4,145.35 కోట్ల నుంచి రూ.4,789.30 కోట్లకు పెంచారు.
ఫైర్, సైబర్, నార్కొటిక్స్ బ్యూరోలకు
అగ్నిప్రమాదాల సంఖ్య పెరిగిపోవడంతో ఫైర్ సర్వీసెస్‌కు ఎక్కువ నిధులు కేటాయించారు. గతేడాది బడ్జెట్‌లో రూ.16.12 కోట్లు ఉన్న ప్రగతి పద్దును రూ.32.14 కోట్లకు పెంచారు. గ్రేటర్ పరిధిలోని మూడు సహా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కమిషనరేట్ల నిర్వహణ పద్దును పెంచారు. ఈ క్రమంలోనే ప్రగతి పద్దులో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. గతేడాది కేటాయింపులనే కంటిన్యూ చేశారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ భవనానికి రూ.10 కోట్లు కేటాయించారు. సైబర్ నేరాలు, డ్రగ్స్‌ను కంట్రోల్ చేసేందుకు ఏర్పాటు చేసిన టీఎస్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కోసం రూ.35.50 కోట్లు, టీఎస్ స్టేట్ నార్కోటిక్స్ బ్యూరో కోసం రూ.8.50 కోట్లు కేటాయించారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పోలీస్ స్టేషన్స్, భవనాల నిర్మాణానికి రూ.100 కోట్లు, జిల్లాల పోలీస్ హెడ్‌క్వార్టర్స్ భవన నిర్మాణాల కోసం రూ.100 కోట్లు, పోలీస్ స్టేషన్లలో మహిళల టాయిలెట్ల నిర్మాణానికి రూ.3 కోట్ల చొప్పున కేటాయించారు. ఐజీపీ హోంగార్డ్స్‌కి అతి తక్కువగా ప్రగతి పద్దును కేటాయించారు.