ఆధారే ఆధారం..!: మహిళ మర్డర్​ కేసులో ఇన్వెస్టిగేషన్​ స్పీడప్​

ఆధారే ఆధారం..!: మహిళ మర్డర్​ కేసులో ఇన్వెస్టిగేషన్​ స్పీడప్​

మహిళ మర్డర్​ కేసులో ఆధారం ఆధార్ డేటానే
ఫింగర్​ప్రింట్స్​తో మహిళ వివరాలివ్వాలని కోరిన పోలీసులు
తంగడపల్లి మహిళ హత్యకేసులో ఇన్వెస్టిగేషన్​ స్పీడప్​

హైదరాబాద్,వెలుగు: చేవెళ్ళ సమీపంలోని తంగడపల్లిలో మహిళ మర్డర్ కేసు ఛేదించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే సీసీ ఫుటేజ్,సెల్ ఫోన్ టవర్ లొకేషన్​ డేటా తీసుకున్నారు. మంగళవారం రాత్రి 12 గంటల నుంచి తెల్లారి 4గంటల వరకు హైదరాబాద్ నుంచి  వికారాబాద్ రూట్లో ప్రయాణించిన కార్ల నంబర్ల సీసీ ఫుటేజ్ డేటాను సేకరించారు. ఇప్పటికే ఎనిమిదికి పైగా కార్లను గుర్తించి యజమానులను విచారించినట్లు తెలిసింది. సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఆధ్వర్యంలో శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి నేతృత్వంలో 4 స్పెషల్ టీమ్స్ తో పాటు ఐటీ వింగ్ పోలీసులు ఎవిడెన్స్​కలెక్ట్​ చేస్తున్నారు. ముందుగా ఆ మహిళ ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా ఆధార్ అధికారులకు రిక్వెస్ట్ పంపించారు.

నిందితుల మాస్టర్​మైండ్​

హత్య చేసిన తరువాత ఎవిడెన్స్​ దొరక్కుండా నిందితులు జాగ్రత్తలు తీసుకున్నారని పోలీసులు చెబుతున్నారు. మహిళ ఒంటిపై బట్టలు ఉంటే ఏదైనా క్లూ దొరుకుతుందనే ఉద్దేశంతో డెడ్​బాడీని నగ్నంగా పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ముఖం కనబడకుండా చేయడం కూడా ఇందులో భాగమే అని చెబుతున్నారు. డెడ్ బాడీని తెల్లవారుజామున 2 నుంచి 3 గంటల మధ్య సమయంలో తీసుకువచ్చినట్టు అనుమానిస్తున్న పోలీసులు టవర్ లొకేషన్ తో ఫోన్ నంబర్స్ ను గుర్తించాలని ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే అర్ధరాత్రి టైంలో ఆ దారిలో మొబైల్స్​ వినియోగించే వారి సంఖ్య అతి తక్కువగా ఉంటుంది. అయితే డెడ్ బాడీని వదిలిన అండర్ పాస్  బ్రిడ్జి పరిసర ప్రాంతాల్లో ఫోన్లను యూజ్ చేయకపోయినా, ఫోన్లను తీసుకురాకపోయినా పరిశోధనలో తేలేది ఏమీ ఉండదు. దీంతో మిగతా క్లూస్​పై ఆధారపడాల్సి ఉంటుంది.

ఫ్రింగర్ ప్రింట్స్ తో ఆధార్ అడ్రస్​ కోసం

ముందుగా మృతురాలు ఎవరనేది తెలిస్తే వచ్చే సమాచారంతో ఇన్వెస్టిగేషన్​ చేయడం ఈజీ అవుతుంది. ఇందుకోసం పోలీసులు ఎంచుకున్న మార్గం ఫింగర్ ప్రింట్స్ తో  ఆధార్ నంబర్ కనుక్కోవడం. దీనికోసం ఆ శాఖ అధికారులకు పోలీసులు రిక్వెస్ట్ లెటర్ పంపారు. మృతురాలి ఒంటిపై బంగారు నగలు అలాగే ఉన్నాయి కాబట్టి దొంగలు  చేసిన పని కాదని గుర్తించిన పోలీసులు ఇతర అంశాలపై దృష్టి పెట్టారు.

బంగారు ఆభరణాలతో క్లూస్​

మృతురాలి చేతికి ఉన్న రింగుపై కేడీఎం హాల్‌మార్క్ తో పాటు బంగారంపై ఉన్న డి2093 కెడీఎం.21, బి2 అనే కోడ్ ఆధారంగా బంగారం ఎక్కడ కొనుగోలు చేశారో వివరాలు తీసుకుంటున్నారు. ఆభరణాల డిజైన్​ఆధారంగా మృతురాలు నార్త్ ఇండియాకు చెందిన మహిళగా
అనుమానిస్తున్నారు.

గొంతు నులిమి చంపారా?

చేవెళ్ళ గవర్నమెంట్​హాస్పిటల్​లో పోస్ట్​మార్టం చేసిన తర్వాత ప్రైమరీ రిపోర్ట్​ను రెడీ చేసినట్టు సమాచారం. దీని ప్రకారం మహిళను 35 నుంచి 40 ఏండ్లున్న వివాహితగా గుర్తించినట్టు తెలిసింది. ఆమెకు సిజేరియన్ అయిందని, చేతులతో గొంతు నులిమి ఊపిరి ఆడకుండా చేసినట్లు డాక్టర్లు గుర్తించినట్టు చెబుతున్నారు. మహిళ తల, ఎడమ కంటిపై కమిలిన గాయం తప్ప బాడీపై ఇతర గాయలు లేవని, అత్యాచారం జరిగిన ఆనవాళ్ళు లేవని తెలిసింది. మృతి చెందిన మహిళకు పొగతాగే అలవాటు ఉన్నట్లు ప్రిలిమినరీ రిపోర్టులో పేర్కొన్నట్లు తెలిసింది. దీంతో పాటు విశ్రా పరీక్షల కోసం బ్లడ్ శాంపుల్స్ ఉస్మానియా ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపారు.