ఆర్టికల్ 370 రద్దు.. కశ్మీర్ కు కలిగే ప్రయోజనాలు

ఆర్టికల్ 370 రద్దు.. కశ్మీర్ కు కలిగే ప్రయోజనాలు

మోడీ సర్కార్ ఆర్టికల్370 ను రద్దు చేయడంపై దేశవ్యాప్తంగా చర్చసాగుతోంది. పలు జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఈ బిల్లుకు మద్దతిస్తుండగా, కొన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. అసలు ఈ అర్టికల్ 370 అంటే ఏంటి? ఆ ఆర్టికల్ వల్ల జమ్మూ కశ్మీర్‌కు ఇచ్చిన వెసులుబాట్లు ఏంటి? ప్రస్తుతం ఈ ఆర్టికల్ ను రద్దు చేయడంతో కశ్మీరీలకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి.?

ఏంటి ఈ ఆర్టికల్ 370?

ఆర్టికల్ 370 భారత దేశ ప్రజలకు మన దేశ ప్రథమ ప్రధాని ఇచ్చిన చేదు మాత్ర. అప్పటి జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫిరెన్స్ నేత షేక్ అబ్దుల్లా, భారత ప్రధాని నెహ్రూ మధ్య కుదిరిన చీకటి ఒప్పందమే ఈ ఆర్టికల్ 370. భారత దేశంలో ఏ రాష్ట్రానికి లేనటువంటి ప్రత్యేక ప్రతిపత్తి జమ్మూ కాశ్మీర్ కు ఈ ఆర్టికల్ 370 కల్పిస్తుంది. భారతదేశంలో అందరికీ ఒక పౌరసౌత్వం వుంటే…జమ్మూ కాశ్మీర్ ప్రజలకు ఈ ఆర్టికల్ 370 ద్వారా రెండు పౌరసౌత్వాలు కల్పించబడ్డాయి. ఈ ఆర్టికల్ తో జమ్మూ కాశ్మీర్ ప్రజలకు సెపరేట్ అజెండానే కాదు జెండా కూడా వుంది. దేశంలో అన్ని రాష్ట్రాలకు 5 సంవత్సారాలకు ఎన్నికలు జరిగితే…ఇక్కడ ఆరు సంవత్సారాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి.

ఆ వెసులుబాట్లు ఇవే

ఆర్టికల్ 370 మూలంగా జమ్మూ కాశ్మీర్ ప్రజలు భారత దేశ సార్వభౌమాదికారాన్ని, జాతీయ పతాకాన్ని, జాతీయ చిహ్నాలను అవమానించినా ఎటువంటి నేరము కాదు. సుప్రీంకోర్టు తీర్పులు ఈ రాష్ట్రంలో పనిచేయవు.పార్లమెంటు చేసిన చట్టాలు ఇక్కడ కొన్ని ఏరియాలకే పరిమితం. జమ్మూ కాశ్మీర్ లో వుండే కాశ్మీరీ యువతి దేశంలో వేరే రాష్ట్ర పౌరుడిని పెళ్లి చేసుకుంటే ఆమెకు కాశ్మీరీ పౌరసత్వం రద్దవుతుంది. అదే పాకిస్థాన్ యువకుడిని పెళ్లిచేసుకుంటే మాత్రం పెళ్లి చేసుకున్న భర్తకు కాశ్మీరి పౌరసత్వం లభిస్తుంది.

ఆర్టికల్ 370 మూలంగా RTI చట్టాలు ఇక్కడ పనిచేయవు. RTE ఇక్కడ అప్లై చేయబడదు. కాగ్ కు ఇక్కడ తనిఖీలు చేసే అధికారం లేదు.

రద్దుతో మారిన నిబంధనలు

సోమవారం కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్టికల్ 370, 35ఏ ని రద్దు చేసి.. జమ్ము కశ్మీర్ ను రెండుగా విభజించింది. జమ్మూ కశ్మీర్‌ నుంచి లడక్‌ను విడదీసి కేంద్రపాలిత ప్రాంతంగా మార్చేసింది. జమ్మూ కశ్మీర్‌ను కూడా అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించింది. ఆర్టికల్ 370 రద్దు వల్ల జమ్మూ కశ్మీర్‌కు కల్పించిన స్వయం ప్రతిపత్తిని రద్దు చేసినట్లైంది.

ఆర్టికల్ 370 రద్దు కారణంగా జమ్మూ కశ్మీర్ భారత్‌లో పూర్తి భాగమైనట్టే. ఈ ఆర్టికల్ రద్దుతో ఇతర ప్రాంతాల ప్రజలకూ అక్కడ ఆస్తులను కొనుగోలు చేసే అవకాశం ఏర్పడుతుంది. పరిశ్రమల స్థాపనకు మార్గం సుగమం అవుతుంది. ఇప్పటి వరకూ రక్షణ, విదేశీ వ్యవహారాలు, ఆర్థిక, సమాచార శాఖల వ్యవహారాలు మాత్రమే కేంద్రం పరిధిలో ఉండగా.. కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడంతో.. ఇక మీదట ప్రతీది మోదీ సర్కారు కనుసన్నల్లోనే జరుగుతుంది. జమ్మూ కశ్మీర్ ప్రజలకున్న ద్వంద్వ పౌరసత్వం రద్దువుతుంది. ఆటోమెటిగ్గా జమ్మూ కశ్మీర్‌కున్న ప్రత్యేక రాజ్యాంగం, ప్రత్యేక పీనల్ కోడ్ రద్దవుతాయి.

అర్టికల్ రద్దు చేయడం వల్ల కలిగే ఉపయోగాలు

ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ కారణంగా ఇప్పటి వరకూ దేశంలోని మిగతా ప్రాంతాలు, జమ్మూ కశ్మీర్ మధ్య ఓ విభజన రేఖ ఉంది. ఇప్పుడు అది తొలగడంతో.. ఇక్కడి ఆస్తులను వేరే వ్యక్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. దీంతో పరిశ్రమల స్థాపనకు వీలవుతుంది. ఇతర రాష్ట్రాలకు చెందినవారు ఇక్కడ స్థిరపడేందుకు అవకాశం కలుగుతుంది.అక్కడి ఉద్యోగాల్లో బయటి వారు చేరడానికి కూడా వీలవుతుంది. స్థానికులకు కూడా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. దీని వల్ల హింస తగ్గుముఖం పట్టి, రాష్ట్రం ప్రగతి పథంలో ముందుకెళ్లే అవకాశం ఉంది.
1965, 1971 యుద్ధాల సమయంలో పాకిస్థాన్‌ నుంచి వలస వచ్చిన వారికి ఇప్పటి వరకూ కశ్మీర్ పౌరసత్వం దక్కలేదు. ఇక మీదట వీరి కష్టాలు తీరినట్టే.

ఆర్టికల్ 370 రద్దు వల్ల కశ్మీర్లో కొన్నేళ్లపాటు సంఘర్షణ తలెత్తినప్పటికీ.. పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి అవకాశాలు పెరగడంతో.. కశ్మీరీ యువత ఆర్థికంగా బలపడే అవకాశం ఉంది. క్రమంగా ఘర్షణలకు దూరం కావడంతో కశ్మీర్ లోయలో శాంతియుత వాతావరణం ఏర్పడొచ్చు. అదే జరిగితే కశ్మీర్ మళ్లీ పర్యాటకుల స్వర్గంగా మారుతుంది. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక జెండా, అజెండా లాంటివేం ఉండబోవు. అక్కడ జాతీయ జెండాను అవమానించడం ఇక మీదట కుదరదు. సుప్రీం తీర్పులు, దేశంలోని మిగతా ప్రాంతాలకు వర్తించిన చట్టాలు కశ్మీర్‌కు కూడా వర్తిస్తాయి.