భర్తను చంపించిన కేసు.. భార్య, ప్రియుడు, మరొకరి అరెస్ట్‌‌

భర్తను చంపించిన కేసు.. భార్య, ప్రియుడు, మరొకరి అరెస్ట్‌‌

గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గంగానగర్ ఏరియాలో ఈ నెల 19న సింగరేణి కార్మికుడు కొరకొప్పుల రాజేందర్ (30) హత్య కేసులో పోలీసులు అతడి భార్య రవళి, ప్రియుడు రాజు, అతని ఫ్రెండ్​ సయ్యద్‌‌ను సోమవారం అరెస్ట్‌‌ చేశారు. వారి నుంచి తుపాకీ, 9 బుల్లెట్లు, మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను గోదావరిఖని ఏసీపీ గిరిప్రసాద్‌‌తో కలిసి పెద్దపల్లి డీసీపీ సీహెచ్‌‌ రూపేష్‌‌ మీడియా సమావేశంలో వెల్లడించారు.

మంచిర్యాల జిల్లా చెన్నూర్‌‌ మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన రవళికి గోదావరిఖని గంగానగర్‌‌కు చెందిన మేనబావ కొరకొప్పుల రాజేందర్‌‌తో ఏడేండ్ల క్రితం పెండ్లయింది. వీరికి ఇద్దరు కొడుకులు. కిష్టంపేట గ్రామానికి చెందిన బండం రాజు, రవళి కలిసి పదో తరగతి వరకు చదువుకున్నారు. 8 నెలల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌‌లో రాజుతో మరోసారి రవళికి పరిచయం ఏర్పడింది. రాజు గ్రామంలో కిరాణా షాప్‌‌ నిర్వహించేవాడు. రవళిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆమె భర్త రాజేందర్‌‌ను చంపితే తమ పని సులువవుతుందని విషయాన్ని రవళికి చెప్పాడు. అందుకు ఆమె కూడా ఒప్పుకొంది. సింగరేణి శ్రీరాంపూర్‌‌ డివిజన్‌‌లోని ఆర్‌‌కె 7 మైన్‌‌లో జనరల్‌‌ మజ్దూర్‌‌గా పనిచేసే రాజేందర్‌‌ డ్యూటీ టైమింగ్స్‌‌ తెలుసుకుని అతన్ని చంపడానికి స్కెచ్‌‌ వేశారు. 

ఐదుసార్లు ఫెయిల్‌‌.. 

రాజేందర్‌‌ను చంపేందుకు 8 నెలల్లో బండం రాజు ఆరుసార్లు హత్యాయత్నం చేశాడు. మొదటిసారి నైట్‌‌ డ్యూటీకి వెళుతుండగా వెనక నుంచి రాజేందర్‌‌ తలపై బండరాయితో కొట్టి చంపాలనుకోగా అది ఫెయిలైంది. రెండోసారి కిష్టంపేటకు చెందిన రాజు ఫ్రెండ్​సయ్యద్‌‌ గులాంతో కలిసి గోదావరిఖనిలో ఉన్న రాజేందర్‌‌ ఇంటి గేటుకు కరెంట్‌‌ షాక్‌‌ పెట్టి అతన్ని చంపే ప్రయత్నం చేశారు. మూడో ప్రయత్నంగా శ్రీరాంపూర్‌‌కు చెందిన వాజిద్‌‌, ఇమ్రాన్‌‌ అనే ఫ్రెండ్స్​తో కలిసి రాజేందర్‌‌ డ్యూటీకి వెళ్లే సమయంలో అడ్డగించి రాడుతో తల పగలకొట్టాలనుకున్నారు. అతని వెహికల్‌‌ను కాలుతో తన్నగా రాజేందర్​తప్పించుకున్నాడు. నాలుగోసారి రాజేందర్‌‌ను లిఫ్ట్​అడిగి అతన్ని వెనక నుంచి తలపై కొట్టి చంపడానికి ప్రయత్నించగా వెహికల్‌‌ పక్కన పడేసి పరారయ్యాడు. ఐదోసారి ఇందారం చెక్‌‌పోస్ట్‌‌ వద్ద కారుతో రాజేందర్‌‌ బైక్​ను ఢీకొట్టి చంపాలనుకోగా చిన్న గాయాలతో బయటపడ్డాడు.

చివరకు శ్రీరాంపూర్‌‌ ఏరియాకు చెందిన మాజీ నేరస్తుడు జాడి శ్రీనుతో కలిసి బీహార్‌ వెళ్లిన రాజు రూ.1.5 లక్షలకు పిస్టల్‌‌ కొన్నాడు. ఈ నెల 19న అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటలకు సయ్యద్‌‌ గులాంతో కలిసి బైక్​పై గోదావరిఖనిలోని రాజేందర్‌‌కు ఇంటికి చేరుకున్నాడు. రవళికి ఫోన్‌‌ చేయడంతో ఆమె తలుపు తీసింది. రాజు, సయ్యద్​ గులాం ఇద్దరూ ఇంటిలోకి వెళ్లి గాఢ నిద్రలో ఉన్న రాజేందర్‌‌ కణతపై పిస్టల్‌‌ పెట్టి రెండు రౌండ్లు కాల్చడంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు. తాను వాష్‌‌రూమ్‌‌కు వెళ్లిన సమయంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి భర్తను చంపారని రవళి కట్టుకథ అల్లింది. కేసు విచారించిన పోలీసులు రాజు, సయ్యద్​ గులాం, రవళిని సోమవారం గోదావరినది బ్రిడ్జి వద్ద అరెస్ట్‌‌ చేశారు. కేసులో ఇన్వాల్వ్‌‌ అయిన ఇమ్రాన్‌‌, వాజిద్‌‌, జాడి శ్రీను పరారీలో ఉన్నారు. చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకున్న సిబ్బందిని డీసీపీ అభినందించి నగదు రివార్డు అందజేశారు.