చంద్రయాన్​ 3 కౌంట్ డౌన్ ప్రారంభం..నింగిలోకి దూసుకెళ్లనున్న ఎల్ వీఎం 3

చంద్రయాన్​ 3 కౌంట్ డౌన్ ప్రారంభం..నింగిలోకి దూసుకెళ్లనున్న ఎల్ వీఎం 3

24 గంటల కౌంట్​డౌన్ గురువారం ప్రారంభించిన ఇస్రో

మెగా ప్రయోగంపై ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రపంచ దేశాలు

ఇప్పటిదాకా ఎవరూ అడుగుపెట్టని చంద్రుడి దక్షిణ ధ్రువంపై ఫోకస్ సూళ్లూరుపేటలో ఇస్రో చీఫ్ సోమనాథ్ పూజలు 

చంద్రయాన్–3 మోడల్ తో తిరుమలకు సైంటిస్ట్​ల టీమ్ 

శ్రీహరికోట (ఏపీ) :  దేశ ప్రజలతో పాటు ప్రపంచమంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న చంద్రయాన్–3 ప్రయోగానికి గురువారం కౌంట్​డౌన్ ప్రారంభమైంది. శ్రీహరికోటలోని సతీశ్‌‌ ధావన్‌‌ స్పేస్‌‌ సెంటర్‌‌ (షార్‌‌) వేదికగా జరిగే ఈ ప్రయోగం కోసం ఇస్రో సైంటిస్ట్​లు అన్ని ఏర్పాట్లు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 2.35 గంటలకు బాహుబలి రాకెట్‌‌గా పిలుచుకునే ఎల్​వీఎం-3–ఎం4 ద్వారా చంద్రయాన్–3 నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ రాకెట్ ప్రయోగానికి ఇస్రో సైంటిస్ట్​లు గురువారం మధ్యాహ్నం 1.05 గంటలకు కౌంట్‌‌డౌన్‌‌ ప్రారంభించారు. రాకెట్​లో ఫ్యూయెల్ నింపే ప్రక్రియను కూడా ప్రారంభించారు. శుక్రవారం మధ్యాహ్నం 2:35:13 గంటలకు రెండో లాంచ్ ప్యాడ్ నుంచి ‘ఫ్యాట్​బాయ్’ రాకెట్‌‌ చందమామ వైపు పరుగులుపెడ్తుంది. చంద్రుడిపై ఇప్పటి వరకు ఎవరూ వెళ్లని దక్షిణ ధ్రువానికి వెళ్తుండటంతో ఇండియా చేపట్టే చంద్రయాన్–3 ప్రయోగం చూసేందుకు ప్రపంచ దేశాలన్నీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. అయితే, 2019 జులైలో చంద్రయాన్–2 ల్యాండింగ్ విఫలమైంది. ఈసారి ఎలాంటి లోపం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.

ఈ సారి ఆర్బిటర్ లేకుండానే..

చంద్రయాన్-–2లో ఉన్నట్టే చంద్రయాన్​–3లో కూడా ఒక రోవర్, ఒక ల్యాండర్‌‌ను పంపిస్తారు. కానీ, ఇందులో ఆర్బిటర్ ఉండదు. దానికి బదులు ప్రొపల్షన్ మాడ్యూల్ ఏర్పాటు చేశారు. ఇది రిలే ఉపగ్రహం లాగా పనిచేస్తుంది. ఈ ప్రొపల్షన్  మాడ్యూల్ చంద్రుని చుట్టూ 100 కిలో మీటర్ల కక్ష్య వరకు ల్యాండర్ ను, రోవర్‌‌ను తీసుకెళ్తుంది. ఇస్రో డెవలప్ చేసిన బాహుబలి రాకెట్ అత్యంత శక్తివంతమైంది. ఈ రాకెట్ బరువు 640 టన్నులు ఉంటుంది. 4 వేల కిలోల పేలోడ్ ను సైతం ఇది మోసుకెళ్తుంది.

చంద్రయాన్​–3 ఖర్చు రూ. 615 కోట్లు 

చంద్రయాన్-–3 మిషన్ కు రూ.615 కోట్ల వ్యయం కానుంది. చంద్రయాన్-–2తో పోలిస్తే ఇది చాలా తక్కువ. చంద్రయాన్-–2 బడ్జెట్ రూ.978 కోట్లు. చంద్రయాన్-–3 తక్కువ ఖర్చుకు ప్రధాన కారణం.. ఆర్బిటర్‌‌ను ఉపయోగించకపోవడమే. ఇక చంద్రయాన్–1కు ఇస్రో రూ.380 కోట్లు ఖర్చు చేసింది.  
 

చరిత్ర తిరగరాస్తం: సోమనాథ్   

ఇస్రో చీఫ్ సోమనాథ్ గురువారం సూళ్లూరుపేటలోని చెంగాలమ్మ ఆలయంలో పూజలు నిర్వహించారు. మిషన్ సక్సెస్ కావాలని మొక్కుకున్నట్లు చెప్పారు. ఈ మిషన్ తో స్పేస్​లో రంగంలో చరిత్ర తిరగరాస్తామన్నారు. మిషన్ మొత్తం అనుకున్నవిధంగానే పూర్తవుతుందని భావిస్తున్నట్టు తెలిపారు. అలాగే చంద్రయాన్–3 నమూనాతో ఐదుగురు సైంటిస్ట్​ల టీమ్ తిరుమలలో ప్రత్యేక పూజలు నిర్వహించింది.  

ప్రయోగం జరిగేదిలా..

* ఎల్​వీఎం 3 జర్నీ.. 207 టన్నుల ప్రొపెల్లెంట్​ను మోసుకెళ్లే ఎస్200 అని పిలిచే రెండు సాలిడ్ బూస్టర్లు ఒకేసారి మండటంతో ప్రారంభమవుతుంది. ఈ బూస్టర్​లు 127 సెకన్ల పాటు మండుతాయి. సగటున 3,578.2 కిలో న్యూటన్​ల థ్రస్ట్ ను ప్రొడ్యూస్ చేస్తాయి. గరిష్టంగా ఒక్కో థ్రస్ట్ 5,150 కిలో న్యూటన్​లను ఉత్పత్తి చేస్తుంది. ఈ థ్రస్ట్ రాకెట్​ను ఆకాశం వైపు దూసుకెళ్లేలా చేస్తుంది. దీంతో ప్రయోగం మొదటి దశ పూర్తవుతుంది.

* లాంచ్ వెహికల్ నుంచి సాలిడ్ బూస్టర్స్ సెపరేట్ అయిన తర్వాత రెండో దశ ప్రారంభం అవుతుంది. ​ఈదశలో ఎల్​110 లిక్విడ్ స్టేజ్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 110 మెట్రిక్ టన్నుల ఫ్యూయెల్​ను కలిగి ఉండే లిక్విడ్ ఫ్యూయెల్ ఇంజిన్. ఇది రెండు వికాస్ ఇంజిన్​ల ద్వారా శక్తి పొందుతుంది. ఒక్కోటి 766 కిలో న్యూటన్​ల థ్రస్ట్​ను ఉత్పత్తి చేస్తుంది. మొత్తం 1,532 కిలో న్యూటన్‌‌ల థ్రస్ట్‌‌ని ఇస్తుంది.

* ఎల్110 కోర్ స్టేజ్ లిఫ్టాఫ్​ తర్వాత 10‌‌‌‌8 సెకన్లలో మండటం ప్రారంభమవుతుంది. 203 సెకన్ల పాటు బర్న్ కావడంతో వెహికల్ వేగం పుంజుకుంటుంది.

* లిక్విడ్ స్టేజ్ సెపరేషన్​తో మూడో దశ ముగుస్తుంది. ఈ దశలో సీఈ25 క్రయోజెనిక్ స్టేజ్ యాక్టివేషన్ జరుగుతుంది. సీ25 క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్ 4 మీటర్ల వ్యాసంతో, 13.5 మీటర్ల పొడవుతో ఉంటుంది. అదేవిధంగా, 28 మెట్రిక్ టన్నుల ప్రొపెల్లెంట్ ఎల్​వోఎక్స్, ఎల్​హెచ్2లను కలిగి ఉంటుంది. ఇది 200 కిలో న్యూటన్ థ్రస్ట్​ను ప్రొడ్యూస్ చేసే సీఈ20‌‌‌‌ ఇంజిన్​తో శక్తిని పొందుతుంది. 

* మొత్తం 48 రోజుల ప్రయాణం తర్వాత ఆగస్టు 23 లేదా 24వ తేదీల్లో చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్ కావచ్చని ఇస్రో సైంటిస్ట్​లు అంచనా వేస్తున్నారు. 

చంద్రయాన్ 1

ఇది ఇస్రో చేపట్టిన తొలి మూన్ మిషన్. ఈ మిషన్ లో లూనార్ ఆర్బిటర్, ఇంపాక్టర్ ఉన్నాయి. ఇందుకోసం పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ సీ-11ను ఉపయోగించింది. ఈ రాకెట్ 44 మీటర్ల పొడవు, 316 టన్నుల బరువు ఉన్నది. ఈ ప్రాజెక్ట్​కు చీఫ్​గా మైల్‌‌స్వామి అన్నాదురైను ఇస్రో నియమించింది. ఇస్రోకు చెందిన ఐదు పేలోడ్లు, ఇతర దేశాలకు చెందిన ఆరు పేలోడ్లను  సీ11 మోసుకెళ్లింది. 2008, అక్టోబర్ 22న ఉదయం 6.22 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. చంద్రయాన్ -1 జీవితకాలం 312 రోజులు. ఆగస్టు 29, 2009 నాటికి చంద్రుడిని 3,400 సార్లు చుట్టేసింది. 2008, నవంబర్ 8న చంద్రయాన్ -1ను అనుకున్న కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. చంద్రయాన్ -1 నీటి ఆనవాళ్లను ఉత్తర ధ్రువం ప్రాంతంలో గుర్తించింది. చంద్రుడిపై మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్‌‌ వంటి ఖనిజాలనూ గుర్తించింది. దీంతో పాటు చంద్రుడి ఫొటోలు తీసి భూమికి పంపింది.

చంద్రయాన్ 2

చంద్రునిపై ల్యాండింగ్, అన్వేషణను దృష్టిలో ఉంచుకుని చంద్రయాన్-2 ప్రాజెక్ట్‌‌ అమలు చేయాలని ఇస్రో నిర్ణయించింది. ఇందుకోసం చంద్రయాన్-2 అంతరిక్ష నౌకను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసింది. చంద్రయాన్ -2ని 2019,  జులై 22న ప్రయోగించింది. జీఎస్ఎల్వీ మార్క్ 3 రాకెట్ ద్వారా చంద్రయాన్-2ను ఇస్రో సైంటిస్ట్​లు ప్రయోగించారు. చంద్రయాన్-2లోని ల్యాండర్ విక్రమ్ గంటకు 6వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి.. చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగడానికి ముందు 15 నిమిషాల వ్యవధిలో తన వేగాన్ని క్రమంగా తగ్గించుకుంటుందని భావించారు. సాఫ్ట్ ల్యాండింగ్ కోసం సెప్టెంబరు 6 అర్ధరాత్రి ల్యాండర్‌‌లోని థ్రస్టర్ ఇంజిన్లు మండించి, ల్యాండర్‌‌ గమనానికి వ్యతిరేక దిశలో వాహక నౌక వేగాన్ని తగ్గించారు. కానీ, చంద్రుడి ఉపరితలానికి 500 మీటర్ల దూరంలో అది నియంత్రణ తప్పి క్రాష్ ల్యాండ్ కావడంతో ప్రయోగం విఫలమైంది. అంతరిక్ష నౌకలోని ఆర్బిటర్ విజయవంతంగా చంద్ర కక్ష్యలోకి చేరింది.

చంద్రయాన్ 3

చంద్రయాన్ –3 ప్రయోగాన్ని ఇస్రో ఒక సవాల్​గా తీసుకుంది. ముఖ్యంగా సైంటిస్ట్​లు చంద్రయాన్– 2 మాదిరిగా సాంకేతిక లోపం తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా టెస్ట్ రన్లు నిర్వహించారు. చంద్రయాన్-3 మిషన్ మూడు ప్రధాన భాగాలను కలిగి ఉంటుంది. ప్రొపల్షన్, ల్యాండర్, రోవర్. ప్రొపల్షన్ స్పేస్‌‌ క్రాఫ్ట్‌‌లోని రోవర్, ల్యాండర్‌‌ను చంద్రునికి 100 కిలో మీటర్ల దూరం వరకు తీసుకెళ్తుంది. సీఈ20 క్రయోజెనిక్ ఇంజిన్ టెస్టింగ్ ఫిబ్రవరిలో విజయవంతమైంది. గత వైఫల్యాలు అధిగమించేలా ఫెయిల్యూర్‌‌ బేస్డ్‌‌ డిజైన్‌‌తో చంద్రయాన్‌‌-3ని ఇస్రో రూపొందించింది. ఎలాంటి సమస్యలు వచ్చినా ల్యాండర్‌‌.. సక్సెస్​ఫుల్​గా చంద్రుడిపై దిగేలా సాంకేతికను జోడించింది. ఈసారి ల్యాండింగ్​కు దక్షిణ ధ్రువంలోని విశాలమైన ప్రదేశాన్ని ఎంపిక చేసింది. ఫ్యూయెల్ కెపాసిటీని కూడా పెంచింది. పరిస్థితులను బట్టి వేరే చోట ల్యాండింగ్ చేసేందుకు కూడా రెడీ అయింది.