జనగామ ఎపిసోడ్ లో మరో ట్విస్ట్ : పల్లా అనుచరులు డబ్బులు పంచుతున్నారంటూ ముత్తిరెడ్డి వర్గీయుల ఆరోపణ

జనగామ ఎపిసోడ్ లో మరో ట్విస్ట్ : పల్లా అనుచరులు డబ్బులు పంచుతున్నారంటూ ముత్తిరెడ్డి వర్గీయుల ఆరోపణ

జనగామ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిల ఎపిసోడ్ కొనసాగుతోంది. తాజాగా మరో న్యూస్ చర్చనీయాంశంగా మారింది. జనగామలో బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులకు పల్లా అనుచరులు డబ్బులు పంచుతున్నారని ముత్తిరెడ్డి వర్గీయులు ఆరోపిస్తున్నారు. 

తరిగొప్పుల మండలం మరియపురం గ్రామంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి తరపున సర్పంచులకు డబ్బులు ఎందుకు పంచుతున్నారని సర్పంచుల మండల ఫోరం అధ్యక్షులు జార్జిరెడ్డిని ముత్తిరెడ్డి వర్గీయులు నిలదీశారు. డబ్బుల విషయంపై జార్జిరెడ్డిని తరిగొప్పుల బీఆర్ఎస్ మండల నాయకులు ప్రశ్నించారు. సర్పంచుల ఫోరమ్ మండల అధ్యక్షుడిగా చేసిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని ఎలా మోసం చేస్తావంటూ జార్జిరెడ్డిని నిలదీశారు. డబ్బులు పంచడానికి జనగామ జెడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి ఎవరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ముత్తిరెడ్డి వర్గీయులు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం జరిగింది. 

జనగామ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పాగాల సంపత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని నర్మెట మండలం జెడ్పీటీసీ, ఎంపీపీ ( ముత్తిరెడ్డి వర్గీయులు) డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి తొత్తుగా మారి డబ్బులు పంచుతూ నాయకుల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. పార్టీ అధిష్టానం జనగామ బీఆర్ఎస్ టికెట్ ఖరారు చేయకముందే నాయకులు, కార్యకర్తలను అయోమయానికి గురి చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాగాల సంపత్ రెడ్డి తన తీరు మార్చుకోకపోతే జనగామ జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును ముట్టడిస్తామని హెచ్చరించారు ముత్తిరెడ్డి వర్గీయులు.