
పాలకుర్తి, వెలుగు: అకాల వర్షానికి తడిసిన వడ్లను ప్రభుత్వమే కొనాలని డిమాండ్ చేస్తూ సోమవారం జనగామ జిల్లా పాలకుర్తి – తొర్రూరు మెయిన్ రోడ్డుపై రైతులు రాస్తారోకో చేశారు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు దొంగరి మహేందర్ రైతులకు మద్దతు తెలిపి మాట్లాడారు. వడ్ల కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్లే అకాల వర్షానికి తడిసిపోయిందన్నారు. క్వాలిటీ పేరుతో రైతులను మోసం చేస్తుంటే ఆఫీసర్లు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వానికి ప్లీనరీ, ఆత్మీయ సమ్మేళనాల మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద లేదన్నారు. మంత్రి దయాకర్‌రావు స్పందించి రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కమ్మగాని శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి మారం రవికుమార్, నాయకులు ఐర్నెని రామారావు, మామిండ్ల వెంకన్న, నజీర్, మహేందర్, సోమేశ్ పాల్గొన్నారు.