హున్సాలో పిడిగుద్దుల ఆట!

హున్సాలో పిడిగుద్దుల ఆట!

నిజామాబాద్​ జిల్లా సాలూర మండలం హున్సాలో నిర్వహించిన గ్రామస్తులు 

బోధన్​, వెలుగు : వందేండ్ల నుంచి ఆచారంగా వస్తున్న పిడిగుద్దుల ఆటను నిజామాబాద్​జిల్లా సాలూర మండలం హున్సాలో గ్రామస్తులు మంగళవారం నిర్వహించారు. ప్రతియేటా హోలీ సందర్భంగా ఈ ఆట నిర్వహిస్తారు. లేకపోతే గ్రామానికి అరిష్టమని నమ్ముతారు. ముందుగా గ్రామంలోని ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయారు. ఊరి మధ్యలో ఉన్న చావిడి దగ్గర ఉన్న ఖాళీ స్థలంలో రెండు వైపులా కట్టెలు పాతారు. ఈ కట్టెల మధ్య దొడ్డుతాడు కట్టి, తాడుకు ఇరువైపులా నిలబడిన గ్రామస్తులు కొట్టుకోవడానికి సిద్ధమయ్యారు.

అంతకుముందు గ్రామదేవతలకు పూజలు చేసి గ్రామ పెద్ద మనుషులు, పటేల్, పట్వారీలను డప్పులు, బాజాలతో పిడి గుద్దుల ఆట నిర్వహించే స్థలం వద్దకు తీసుకువచ్చారు. తర్వాత ఆట మొదలుకాగానే ఒక వర్గంపై మరో వర్గం పిడిగుద్దులతో విరుచుకుపడింది. సుమారు 30 నిమిషాల పాటు ఈ ఆట కొనసాగింది. రక్తం కారినా లెక్క చేయకుండా ఒకరిపై మరొకరు పిడిగుద్దుల వర్షం కురిపించారు. ఆట ముగిసిన ఒకరినొకరు కౌగిలించుకున్నారు. గాయాలైన చోట తెల్ల సున్నం పెట్టుకున్నారు. ఆట స్థలం నుంచి డప్పులు బాజాలతో కేకలు వేస్తూ  గ్రామంలో గల్లీ గల్లీ తిరిగారు. ఈ క్రమంలో గ్రామంలో రెండు రోజుల నుంచి జాతర నిర్వహించనున్నారు.  

కుస్తీల పోటీలు కూడా...

పిడిగుద్దుల ఆటకు ముందు కుస్తీ పోటీలు నిర్వహించారు. దీనికి మహారాష్ట్ర నుంచి మల్లయోధులు తరలివచ్చారు. పోటీలను చూడడానికి బోధన్, నిజామాబాద్​ చుట్టు పక్కల ప్రాంతాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి జనాలు తరలివచ్చారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బోధన్​రూరల్​సీఐ శ్రీనివాస్​రాజ్​ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు.