ఫోకస్ అంతా అప్గాన్ పైనే

ఫోకస్ అంతా అప్గాన్ పైనే

టీ 20  వరల్డ్ కప్ లో.. సెమీస్  రేసు కోసం  టీమిండియా పోరు  కొనసాగుతోంది. స్కాట్లాండ్ పై  భారీ విజయం  సాధించిన భారత్.. ఎల్లుండి  నమీబియాతో తలపడనుంది. అయితే  అప్ఘాన్ టీమ్  కివీస్ ను  ఓడిస్తేనే  భారత్ సెమీస్ కు  వెళ్లేందుకు  రూట్ క్లియర్  కానుంది. అందుకే  ఇప్పుడు భారత అభిమానుల  ఫోకస్  అంతా  అప్గానిస్థాన్ పైనే  ఉంది.  తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో టీమిండియా అదరగొట్టింది.  స్కాట్లాండ్ పై 8 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది కోహ్లీసేన. తొలుత బ్యాటింగ్  చేసిన స్కాట్లాండ్  85 పరుగులకే కుప్పకూలగా.. భారత్  రెండు వికెట్ల నష్టానికి 6.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ 18 బంతుల్లోనే ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లతో హాఫ్ సెంచరీ చేశాడు. రోహిత్ శర్మ ఐదు ఫోర్లు, ఒక సిక్సర్ తో ధాటిగా ఆడారు. తొలి వికెట్ కు 70 పరుగులు జోడించారు. అయితే విజయానికి ఇంకో 16 పరుగులు అవసరమైన సమయంలో రోహిత్, నాలుగు పరుగులు చేయాల్సిన టైంలో కేఎల్ రాహుల్ ఔట్ అయ్యారు. తర్వాత క్రీజ్ లోకి వచ్చిన విరాట్ కోహ్లీ , సూర్యకుమార్ మిగిలిన రన్స్ కొట్టి మ్యాచ్ ను గెలిపించారు. భారత బౌలర్ల ధాటికి స్కాట్లాండ్ 17.4 ఓవర్లలో 85 పరుగులకే కుప్పకూలింది. స్కాట్లాండ్ బ్యాట్స్ మెన్లలో జార్జ్  మున్సీ 24, లీస్క్ 21 రన్స్ కాస్త ఫర్వాలేదనిపించినా.. మిగిలిన బ్యాట్స్ మెన్లు విఫలమయ్యారు. ముగ్గురు బ్యాట్స్ మెన్ డకౌట్ గా వెనుదిరిగారు. రిచీ బెరింగ్ టన్,  షరిఫ్,  ఈవన్స్ పరుగులేమీ చేయకుండా ఔటయ్యారు. కీలకమైన మ్యాచ్ లో భారత బౌలర్లు చెలరేగిపోయారు. షమీ 3, జడేజా 3.. బుమ్రా 2, అశ్విన్  ఒక వికెట్ పడగొట్టారు. నెట్ రన్ రేట్ లో కివీస్ ను అధిగమించాలంటే 8.5 ఓవర్లలో.. అఫ్ఘాన్ ను వెనక్కి నెట్టాలంటే 7.1 ఓవర్లలోనే భారత్ 86 పరుగుల ఛేదించాల్సి ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొనే భారత ఓపెనర్లు రాహుల్, రోహిత్  ఆరంభం నుంచే బ్యాట్లకు పనిచెప్పారు. రెండో ఓవర్ లో వరుసగా మూడు ఫోర్లు, మూడో ఓవర్ లో ఒక ఫోర్, ఒక సిక్సు బాదేయడంతో స్కోరు రాకెట్ లా దూసుకెళ్లింది. ఆ తర్వాత రోహిత్ శర్మ నాలుగో ఓవర్ లో వరుసగా ఒక సిక్సు, రెండు ఫోర్లతో 14 రన్స్ రాబట్టాడు. ఇలా స్కాట్లాండ్ పెట్టిన టార్గెట్ ను 6.3 ఓవర్లలోనే చేధించి కాస్త నెట్ రన్ రేటును పెంచుకోగలిగింది టీమిండియా.

ఇక భారత్ సెమీస్ ఆశలపై ఉత్కంఠ కొనసాగుతోంది. అందుకే ఇప్పుడు కోట్లాది మంది భారత అభిమానులు కోరుకునేది ఒక్కటే. న్యూజిలాండ్ పై అఫ్గానిస్థాన్ గెలవాలి. అఫ్గానిస్థాన్ .. న్యూజిలాండ్ ను ఓడిస్తేనే భారత్ సెమీస్ చేరేందుకు మార్గం ఈజీ అవుతుంది. అప్ఘానిస్థాన్ టీమ్ కూడా సెమీస్ రేసులో ఉంది. దాంతో అఫ్గాన్ విజయం భారత్ కు ఎంత ముఖ్యమో.. అప్గాన్ టీమ్ కు కూడా అంతే అవసరం. గ్రూప్-2 నుంచి పాకిస్థాన్ ఇప్పటికే సెమీస్ చేరుకుంది. మరో స్థానం కోసం భారత్ తో పాటు న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్  పోటీపడుతున్నాయి. నాలుగు మ్యాచుల్లో మూడు గెలిచిన కివీస్.. ఆరు పాయింట్లతో రెండోస్థానంలో ఉంది. నాలుగు మ్యాచుల్లో రెండేసి విజయాలు సాధించిన భారత్, అఫ్గానిస్థాన్  చెరో 4 పాయింట్లతో వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. దాంతో అప్గాన్ టీమ్ కూడా కివీస్ పై విజయం కోసం ఆరాటపడుతోంది.

సెమీస్ కు చేరే అవకాశాలు కివీస్ కే ఎక్కువగా ఉన్నాయి. న్యూజిలాండ్ జట్టు తన చివరి గ్రూపు మ్యాచ్ లో ఆదివారం అఫ్గానిస్థాన్ తో తలపడుతుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తే మిగతా ఈక్వేషన్స్ తో సంబంధం లేకుండా న్యూజిలాండ్ సెమీస్ కు వెళ్తుంది. ఒకవేళ ఆఖరి మ్యాచ్ లో అఫ్గాన్ గెలిస్తే న్యూజిలాండ్ రేసు నుంచి తప్పుకుంటుంది. ఎందుకంటే ప్రస్తుతం కివీస్ కంటే అఫ్గాన్ రన్ రేట్ మెరుగ్గా ఉంది.  ఇప్పుడు భారత అభిమానుల ఫోకస్ అంతా అప్గానిస్థాన్ పైనే ఉంది. అప్ఘాన్ టీమ్ కివీస్ ను ఓడిస్తే భారత్ సెమీస్ కు వెళ్లేందుకు రూట్ క్లియర్ కానుంది. ఆదివారం జరిగే మ్యాచ్ లో న్యూజిలాండ్ పై అఫ్గానిస్థాన్ గెలిస్తే, సోమవారం నమీబియాను కోహ్లీసేన చిత్తుచేస్తే భారత్ సెమీస్ కు వెళ్లనుంది.