
రెండేండ్లుగా ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కుర్చీ ఖాళీ
హెచ్చార్సీదీ అదే పరిస్థితి
ఆర్టీఐ కమిషన్‌లో ఐదుగురు కమిషనర్లు రిటైర్
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో వివిధ కమిషన్లు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. కోర్టు నుంచి ఆదేశాలు, వస్తే తప్పా అటువైపు కన్నెత్తి చూడటం లేదు. దీనికితోడు పలు కమిషన్లలో ఏండ్ల తరబడి ఖాళీగా ఉన్న పోస్టులను కూడా భర్తీ చేయడం లేదు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి పరిస్థితి ఇలాగే ఉంది. దీంతో బాధితులకు న్యాయం జరగడం లేదు. సమస్యల పరిష్కారం కోసం ఏండ్ల తరబడి ఎదురుచూడాల్సి వస్తున్నది. రెండేండ్లుగా ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయట్లేదు. ఇటీవల సమాచార కమిషన్‌లోని (ఆర్టీఐ) కమిషనర్లందరి పదవీ కాలం ముగిసింది. ఇప్పటి దాకా ఆ ప్లేస్‌లో ఎవర్నీ నియమించలేదు. హ్యుమన్ రైట్స్ కమిషన్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది.
ఎస్సీ, ఎస్టీ కమిషన్‌పై ప్రభుత్వానికి నోటీసులు
గతంలో కమిషన్ల ఏర్పాటు విషయంలో పిటిషన్ దాఖలు చేస్తే హైకోర్టు ఆదేశాల తర్వాతే ప్రభుత్వం స్పందించింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, బీసీ కమిషన్, మహిళా కమిషన్, రుణ విమోచన కమిషన్ (డెట్ రిలీఫ్) విషయంలో కోర్టు మొట్టికాయలు వేశాకే సర్కార్‌లో కదలిక వచ్చింది. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ కమిషన్‌పై కూడా కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు కొన్ని రోజుల కిందే నోటీసులు జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీకి వేర్వేరుగా కమిషన్లు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉందని ఆఫీసర్లు చెబుతున్నారు. అయితే, దానికి ఇంకా ప్రపోజల్స్ రెడీ చేయలేదు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఆఫీస్‌కు డెయిలీ పదుల సంఖ్యలో పిటిషన్లు వస్తుంటాయి. వాటిపై ఎంక్వైరీ చేసి సమస్యను పరిష్కరించాల్సి ఉంటుంది. కానీ, కమిషన్‌లో చైర్మన్, సభ్యులు లేకపోవడంతో అవన్నీ పెండింగ్‌లో పడుతున్నాయి. 2021, ఫిబ్రవరి చివర్లో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్, మెంబర్ల పదవీ కాలం ముగిసింది. అప్పటి నుంచి ఈ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. రెండేండ్లు అవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ టైంలో కమిషన్ ఆఫీస్‌కు వేల సంఖ్యలో కంప్లైంట్లు వచ్చాయి. వాటిని ఆఫీసర్లకు పంపిస్తున్నా.. నత్తనడకనే కదులుతున్నాయి.
ప్రభుత్వ ప్రకటనలకు భిన్నంగా వాస్తవ పరిస్థితి
రాష్ట్రంలో దళితులు, గిరిజనులకు అన్యాయం జరిగితే.. విచారణ జరిపి చర్యలు తీసుకునే అధికారం ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఉంటుంది. రాష్ట్రంలో దళితులకు మంచిస్థానం ఇస్తున్నామని ప్రభుత్వం ప్రకటనలు చేస్తున్నా.. వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉంటున్నాయి. చైర్మన్, సభ్యులు ఉన్నప్పుడు రోజుకు సగటున 100 పిటిషన్లు వచ్చేవి. కమిషన్ 14వేల కేసులను పరిష్కరించి బాధితులకు న్యాయం చేసింది. 2021 నుంచి పోస్టులు ఖాళీగా ఉండటంతో వేల సంఖ్యలో పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయి.
ఇక స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్లోనూ ఇటీవల ఐదుగురు కమిషనర్లు ఒకేసారి రిటైరయ్యారు. కమిషన్ పూర్తి స్థాయిలో పనిచేసే టైంలోనే వేల సంఖ్యలో అప్పీల్స్ పెండింగ్‌లో ఉన్నాయి.