న్యూఢిల్లీ: క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా జరిపే చిన్న సైజ్ పేమెంట్ ట్రాన్సాక్షన్లపై జీఎస్‌టీ వేయాలని జీఎస్‌టీ కౌన్సిల్ చూస్తోంది. ఈ నెల 9 న జరిగే 54 వ జీఎస్‌టీ కౌన్సిల్ మీటింగ్‌లో ఈ అంశంపై చర్చించనున్నారు. ఇప్పటివరకు రూ.2 వేల లోపు విలువుండే పేమెంట్ ట్రాన్సాక్షన్లపై జీఎస్‌టీ లేదు. ఇక నుంచి పేమెంట్ అగ్రిగేటర్ల ఫీజులపై 18 శాతం ట్యాక్స్ వేయాలని జీఎస్‌టీ కౌన్సిల్ ఆలోచిస్తోందని సీఎన్‌బీసీ టీవీ 18 రిపోర్ట్ చేసింది. ప్రస్తుతం కార్డ్ ట్రాన్సాక్షన్లపై 0.5 శాతం నుంచి 2 శాతం వరకు గేట్‌వే ఫీజులను పేమెంట్ గేట్‌వేస్ వేస్తున్నాయి.
సాధారణంగా ఒక శాతం ఫీజు వేస్తున్నాయి. ఈ ఫీజులపై 18 శాతం జీఎస్‌టీ పడే ఛాన్స్ కనిపిస్తోంది. అదే జరిగితే పేమెంట్ గేట్‌వే కంపెనీలు ఈ భారాన్ని వ్యాపారులకు షిఫ్ట్ చేస్తాయి. చిన్న ట్రాన్సాక్షన్లపై జీఎస్‌టీ పడితే స్మాల్ బిజినెస్‌లు ఎక్కువగా నష్టపోతారని, ఎందుకంటే ఈ భారాన్ని మర్చంట్లపై పేమెంట్ అగ్రిగేటర్లు మోపుతాయని ఎనలిస్టులు చెబుతున్నారు.
ఉదాహరణకు డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా రూ. వెయ్యి ట్రాన్సాక్షన్ జరిగిందని అనుకుందాం. ఒక శాతం పేమెంట్ గేట్‌వే ఫీజు అంటే మర్చంట్ రూ.10 చెల్లించాలి. తాజా జీఎస్‌టీ ప్రపోజల్ అమల్లోకి వస్తే ఈ ఫీజుపై 18 శాతం ట్యాక్స్ పడుతుంది. అప్పుడు మర్చంట్ 11.80 రూపాయిలను ఫీజుగా చెల్లించాలి. తక్కువగా అనిపించినా, ఎక్కువ ట్రాన్సాక్షన్లపై ఈ భారం పేరుకుపోతుంది. ఇదే జరిగితే మర్చంట్లు ఈ భారాన్ని కస్టమర్లపై మోపొచ్చు.
యూపీఐ ట్రాన్సాక్షన్లపై లేనట్టే
యూపీఐ ట్రాన్సాక్షన్లపై ఎటువంటి మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) వేయడం లేదు కాబట్టి జీఎస్‌టీ కౌన్సిల్ విధించే 18 శాతం ట్యాక్స్ రేట్ ప్రభావం వీటిపై ఉండదు. అంటే రూ.2,000 వరకు యూపీఐ ద్వారా జరిపే ట్రాన్సాక్షన్లపై ఎటువంటి ఫీజు ఉండదు. కస్టమర్లు, మర్చంట్లకు ఈ పేమెంట్ విధానం మరింత ఆకర్షణీయంగా మారనుంది. ప్రస్తుతం 80 శాతం రిటైల్ డిజిటల్ పేమెంట్లు యూపీఐ ద్వారా జరుగుతున్నాయి. కిందటి ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 13,100 కోట్ల ట్రాన్సాక్షన్లు జరిగాయి. చిన్న సైజ్ డెబిట్, క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్ష న్లపై జీఎస్‌టీ పడితే ,యూపీఐ మరింత ఆకర్షణీయంగా మారే అవకాశం ఉంది.