టీఎస్‌‌‌‌‌‌‌‌పీఎస్సీ సభ్యులను ఏ అర్హతతో నియమించిన్రు : హైకోర్టు

టీఎస్‌‌‌‌‌‌‌‌పీఎస్సీ సభ్యులను ఏ అర్హతతో నియమించిన్రు : హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ పబ్లిక్‌‌‌‌‌‌‌‌ సర్వీస్‌‌‌‌‌‌‌‌ కమిషన్‌‌‌‌‌‌‌‌ సభ్యులను ఏ అర్హతతో నియమించారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. టీఎస్ పీఎస్సీ సభ్యుల నియామకాల్లో ఉద్యమకారులకు ఏమన్నా రిజర్వేషన్లు కల్పించారా అని నిలదీసింది. అనర్హులను టీఎస్ పీఎస్సీ సభ్యులుగా నియమించారని ఆరోపిస్తూ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు చెందిన ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌ వినాయక్‌‌‌‌‌‌‌‌ రెడ్డి 2021లో హైకోర్టులో పిల్‌‌‌‌‌‌‌‌ దాఖలు చేశారు. ఈ పిల్ పై హైకోర్టు గురువారం విచారణ జరిపింది. ఈ పిల్‌‌‌‌‌‌‌‌లో జడ్జిమెంట్‌‌‌‌‌‌‌‌ను రిజర్వు చేసింది. జడ్జిమెంట్‌‌‌‌‌‌‌‌ను వాయిదా వేస్తున్నామని హైకోర్టు చీఫ్‌‌‌‌‌‌‌‌ జస్టిస్‌‌‌‌‌‌‌‌ ఉజ్జల్‌‌‌‌‌‌‌‌ భూయాన్, జస్టిస్‌‌‌‌‌‌‌‌ సీవీ భాస్కర్‌‌‌‌‌‌‌‌రెడ్డితో కూడిన బెంచ్‌‌‌‌‌‌‌‌  వెల్లడించింది. పిల్‌‌‌‌‌‌‌‌ విచారణ సందర్భంగా హైకోర్టు పలు కీలక ప్రశ్నలను ప్రభుత్వం ముందుంచింది. ‘‘తెలంగాణ కొత్త రాష్ట్రం. ఆశావహులు చాలా మంది ఉంటారు. సర్వీస్‌‌‌‌‌‌‌‌ కమిషన్‌‌‌‌‌‌‌‌ మెంబర్స్‌‌‌‌‌‌‌‌ వంటి పోస్టుల భర్తీ పారదర్శకంగా జరగాలి. అందరికీ అవకాశం కల్పించేలా మెంబర్ల భర్తీ విధానం ఉండాలి. అప్లికేషన్లు పెట్టుకునే అవకాశం అర్హులకు కల్పించాలి కదా” అని రాష్ట్ర సర్కార్‌‌‌‌‌‌‌‌ను హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం తరఫున ఏజీ బీఎస్‌‌‌‌‌‌‌‌ ప్రసాద్‌‌‌‌‌‌‌‌ స్పందిస్తూ.. తెలంగాణ, ఇతర ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్లనే టీఎస్‌‌‌‌‌‌‌‌పీఎస్సీ మెంబర్లుగా ప్రభుత్వం నియమించిందని చెప్పారు.

హైకోర్టు కల్పించుకుని.. అస్సోం ఉద్యమంలో పాల్గొని నష్టపోయిన వాళ్లకు ప్రపుల్ల కుమార్‌‌‌‌‌‌‌‌ మహంతి సీఎంగా ఉండగా ప్రత్యేక రిజర్వేషన్లను కల్పించారని, తెలంగాణలో కూడా ఆ తరహా రిజర్వేషన్లు ఉన్నాయా అని ప్రశ్నించింది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్లకు ప్రత్యేక రిజర్వేషన్లు ఏమీ లేవని, ఇతర రిజర్వేషన్లు మాత్రమే ఉన్నాయని ఏజీ చెప్పారు. నచ్చిన వాళ్లను నియమించారా లేక ఏదైనా విధానాన్ని అనుసరించారా అని హైకోర్టు  ప్రశ్నించింది. ‘‘సర్వీస్‌‌‌‌‌‌‌‌ కమిషన్‌‌‌‌‌‌‌‌ మెంబర్‌‌‌‌‌‌‌‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆశావహులు తెలుసుకుని ఆఫీసుకు వచ్చి అప్లికేషన్స్‌‌‌‌‌‌‌‌ పెట్టుకున్నారా లేక అప్లికేషన్లు అమ్మే పాన్‌‌‌‌‌‌‌‌ షాపు దగ్గర తెలుసుకుని అప్లికేషన్స్‌‌‌‌‌‌‌‌ పెట్టుకున్నారా? అసలు మెంబర్‌‌‌‌‌‌‌‌ పోస్టుల ఖాళీల గురించి నియమితులైన వాళ్లకు ఎలా తెలిసింది? భర్తీ ప్రక్రియ ఎలా జరిగింది?” అని హైకోర్టు నిలదీసింది. హైకోర్టు/సుప్రీంకోర్టు జడ్జిల పోస్టుల భర్తీకే కొలీజియం ఉందని, ఇదే విధంగా పబ్లిక్‌‌‌‌‌‌‌‌ సర్వీస్‌‌‌‌‌‌‌‌ కమిషన్‌‌‌‌‌‌‌‌లోనూ ఒక కమిటీ ఉంటే సరిపోయేది కాదా అని వ్యాఖ్యానించింది.