
అంట్వెర్ప్ (బెల్జియం): ఎఫ్‌ఐహెచ్ ప్రో హాకీ లీగ్‌లో ఇండియా మెన్స్ టీమ్ దుమ్మురేపింది. శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఇండియా షూటౌట్‌లో 5–4తో ఒలింపిక్ చాంపియన్ బెల్జియంపై విజయం సాధించింది. నిర్ణీత సమయంలో ఇరుజట్లు 3–3 స్కోరు చేయడంతో షూటౌట్ నిర్వహించారు. ఇందులో ఇండియా తరఫున హర్మన్‌ప్రీత్, అభిషేక్, లలిత్ కుమార్, షంషేర్ సింగ్, అక్షదీప్ సింగ్ గోల్స్ చేశారు. బొకార్డో, కొస్నాస్, సిమోన్, డీ ఆర్థర్.. బెల్జియంకు గోల్స్ అందించారు. అంతకుముందు ఆట స్టార్టింగ్ నుంచే ఇరుజట్లు గోల్స్ కోసం తీవ్రంగా పోరాడాయి. షంషేర్ (17వ ని.), హర్మన్‌ప్రీత్ (51వ ని.), జర్మన్‌ప్రీత్ (57వ ని.) ఇండియాకు గోల్స్ అందించగా కెడ్రిక్ (20వ ని.), గోనార్డ్ సిమెన్ (35వ ని.), కెర్పెల్ (50వ ని.) బెల్జియం తరఫున గోల్స్ చేశారు. ఇక విమెన్స్ కేటగిరీలో ఇండియా 1–2తో బెల్జియం చేతిలో ఓడింది. ఇండియా తరఫున లాల్రెమ్సియామి (47వ ని.) ఏకైక గోల్ చేయగా, నీలెన్ బార్బరా (3వ ని.), బాలెంగిన్ ఆంబ్రే (34వ ని.) బెల్జియంకు రెండు గోల్స్ అందించారు. కాగా, ఈ పోరుతో ఇండియా కెప్టెన్ రాణి రాంపాల్ 250 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల క్లబ్లో చేరింది.