
ట్యాంక్ బండ్ వద్ద శనివారం జరిగిన ఇండియన్ రేసింగ్ లీగ్‌కు ఆదరణ కరువైంది. ఈసారి కూడా 7 వేల మంది ప్రేక్షకుల కోసం ఏర్పాట్లు చేసినప్పటికీ 500 మంది కూడా రాలేదు. దీంతో కుర్చీలు ఖాళీగా కనిపించాయి. గత నెలలో రేసింగ్‌ను సరిగా నిర్వహించలేకపోవడం, టికెట్ ధర రూ.700కుపైగా ఉండటంతో ప్రేక్షకులు ఆసక్తి చూపలేదు. ఉదయం 8 గంటలకు మొదలవ్వాల్సిన రేసింగ్ సాయంత్రం 4 గంటలకు స్టార్ట్ అయ్యింది. ప్రాక్టీస్ రేసింగ్ లేకుండా డైరెక్టుగా క్వాలిఫై రేసింగ్‌ను నిర్వహించారు. దీంతో వచ్చిన కొంతమంది కూడా అసహనానికి గురయ్యారు.
వెయిట్ చేయలేక కొందరు మధ్యాహ్నమే వెళ్లిపోయారు. అయితే లాస్ట్ టైమ్ వీఐపీ గ్యాలరీలు కిక్కిరిసిపోవడంతో ఈసారి జాగ్రత్తలు తీసుకున్నారు. గ్యాలరీల్లోకి తక్కువ మంది వచ్చేలా చర్యలు తీసుకున్నారు. ఈ లీగ్‌తో ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్, తెలుగుతల్లి ఫ్లై ఓవర్ కింద రాకపోకలు నిలిపివేయడంతో వాహనదారులు ఇబ్బందిపడ్డారు.
- వెలుగు, హైదరాబాద్