ట్విట్టర్​కు పోటీ కూత!: ‘ఆత్మనిర్భర్​ భారత్​’లో సరికొత్త లోకల్​ యాప్​

ట్విట్టర్​కు పోటీ కూత!: ‘ఆత్మనిర్భర్​ భారత్​’లో సరికొత్త లోకల్​ యాప్​

పోయినేడాదే ప్రారంభించిన బాంబినేట్​ టెక్నాలజీస్​
‘కూ’కు మారినట్టు ఆ యాప్​లోనే ప్రకటించిన పీయూష్​ గోయల్​
ప్రముఖులతో పాటు మైగవ్​, ఇండియా పోస్ట్​, నీతి ఆయోగ్​ వంటి శాఖలకూ అకౌంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ఇన్నాళ్లూ సోషల్​ మీడియా ప్రపంచంలో అడ్డేలేకుండా దూసుకుపోతున్న ట్విట్టర్​కు పోటీ ‘కూ’త మొదలైపోయింది. సోషల్​ మీడియా లోకంలోకి లోకల్​ యాప్​ ‘కూ’ వచ్చేసింది. అది ఎంట్రీ ఇచ్చి ఏడాది అవుతున్నా.. ఇప్పుడే అందరి నోళ్లలో పడిపోయింది. పది లక్షల మంది మునివేళ్ల కిందకు వచ్చి చేరింది. పీయూష్​ గోయల్​, రవిశంకర్​ ప్రసాద్​ వంటి కేంద్ర మంత్రులు, తేజస్వీ సూర్య వంటి యువ ఎంపీలు, మరికొందరు రాజకీయ నాయకులు, మైగవ్​, నీతి ఆయోగ్​, ఇండియాపోస్ట్​ వంటి ప్రభుత్వ శాఖలు, అనిల్​ కుంబ్లే, జవగల్​ ​శ్రీనాథ్​ వంటి ఫేమస్​ క్రికెటర్లు, బాలీవుడ్​ సింగర్లు, రచయితలు అకౌంట్లు తెరిచేశారు. కొద్ది రోజుల కిందట మన్​ కీ బాత్​ ప్రోగ్రామ్​లో ప్రధాని నరేంద్ర మోడీ కూడా దాని గురించి ప్రస్తావించారు. ఈ యాప్​కు బాంబినేట్​ టెక్నాలజీస్​ అనే సంస్థ రూపునిచ్చింది. అప్రమేయ రాధాకృష్ణ, మయాంక్​ బిద్వాత్కాలు ఓనర్లు.

న్యూఢిల్లీ: ఆత్మనిర్భర్​ భారత్​.. ఇప్పుడు దేశమంతా మార్మోగిపోతున్న నినాదం. గల్వాన్​ గొడవ తర్వాత టిక్​టాక్​, పబ్​జీ వంటి చైనా యాప్​లన్నింటినీ కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. తర్వాత మనమే వాటికి పోటీగా లోకల్‌‌ యాప్​లు ఎందుకు తయారు చేయకూడదంటూ యువతలో స్ఫూర్తి రగిలించింది. పోటీలు కూడా పెట్టింది. ఆ క్రమంలోనే టిక్​టాక్​కు దేశీ వెర్షన్​ ‘చింగారీ’, ‘జోహో’లు వచ్చాయి. ఇప్పుడు సోషల్​మీడియాలో పెద్దన్న అయిన ట్విట్టర్​కూ పోటీగా ‘కూ’త స్టార్ట్​ అయిపోయింది. ఆత్మనిర్భర్​ భారత్​ నినాదమే కావొచ్చు.. మన చట్టాలను ట్విట్టర్​ పట్టించుకోకపోవడమూ అయి ఉండొచ్చు.. కారణాలేవైనా దేశంలో ఇప్పుడు హాట్​ హాట్​గా వినిపిస్తున్న యాప్​ ‘కూ’!!

ఎవరు తయారు చేశారు?

ఈ యాప్​ నిజానికి 2020 ప్రారంభంలోనే మొదలైంది. కానీ, అప్పటికి దాని గురించి ఎవరికీ పెద్దగా తెలియలేదు. అయితే, కేంద్ర ప్రభుత్వం పెట్టిన ఆత్మనిర్భర్​ భారత్​ యాప్​ ఇన్నోవేషన్​ చాలెంజ్​తో దానికి మంచి పేరు వచ్చింది. ఓ సారి మన్​కీ బాత్​లో ప్రధాని నరేంద్ర మోడీ ఆత్మనిర్భర్​ భారత్​ గురించి మాట్లాడుతూ ‘కూ’ గురించి చెప్పుకొచ్చారు. ఈ యాప్​ను అప్రమేయ రాధాకృష్ణ, మయాంక్​ బిద్వాత్కా అనే ఇద్దరు ఎంట్రప్రెన్యూర్​లు కలిసి ‘కూ’ యాప్​కు రూపమిచ్చారు. బాంబినేట్​ టెక్నాలజీస్​ ప్రైవేట్​ లిమిటెడ్​ అనే సంస్థ ద్వారా యాప్​ను నడిపిస్తున్నారు. కోరాకు ఇండియన్​ వెర్షన్​ అయిన ‘వోకల్​’ కూడా బాంబినేట్​ కంపెనీ నుంచే వచ్చింది. వీటి కన్నా ముందు యాప్​ కో ఓనర్​ రాధాకృష్ణ.. ‘ట్యాక్సీ ఫర్​ ష్యూర్​’ అనే ఆన్​లైన్​ క్యాబ్​ సర్వీస్​ను స్టార్ట్​ చేశారు. తర్వాత దానిని ఓలా కొనేసింది.

పెట్టుబడులూ బాగానే వచ్చినయ్​

‘కూ’ యాప్​ కోసం 2018 నుంచే నిధుల సమీకరణ చేపట్టింది బాంబినేట్​. చాలా పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. బ్లూమ్​ వెంచర్స్​, కళారీ క్యాపిటల్​, యాక్సెల్​ పార్ట్​నర్స్​ ఇండియా వంటి సంస్థలు డబ్బు సమకూర్చాయి. ఈ నెలలోనూ మరికొన్ని కంపెనీలు ఫండింగ్​ చేశాయి. ఇన్ఫోసిస్​ మాజీ సీఎఫ్​వో టీవీ మోహన్​దాస్​​కు చెందిన 3వన్​4 క్యాపిటల్​ కూడా పెట్టుబడులు పెట్టింది.

వేగంగా వృద్ధి

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆత్మనిర్భర్​ భారత్​ నినాదం ఇటు ప్రజల్లోకి, అటు ఎంట్రప్రెన్యూర్స్​మెదళ్లలో బాగానే నాటుకుపోయింది. ఇప్పటికే 30 లక్షల మందికిపైగా కూ యాప్​ను డౌన్​లోడ్​చేసుకున్నట్టు యాప్​ కో ఫౌండర్​ మయాంక్​ బిద్వాత్కా చెప్పారు. ఆరు నెలల్లోనే 4 రెట్ల మేర వృద్ధి సాధించిందన్నారు. నెలకు సగటున 10 లక్షల మంది యూజర్లు కూలో యాక్టివ్​గా ఉంటున్నారన్నారు. ఇక నుంచి ఆ వృద్ధి మరింత ఎక్కువగా ఉంటుందని ఆయన అన్నారు. స్థానికులతో రాజకీయ నాయకులుగానీ, స్పోర్ట్స్​పర్సన్​గానీ ఈజీగా మమేకమయ్యేందుకు స్థానిక భాషలనూ యాప్​లో అందుబాటులో ఉంచామన్నారు. యూజర్లు తమకు నచ్చిన లోకల్​ లాంగ్వేజ్​లో పోస్ట్​లు పెట్టొచ్చని చెప్పారు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ, ఇంగ్లిష్​ వంటి భాషలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని చెప్పారు. మరిన్ని భాషల్లో త్వరలోనే ఈ యాప్‌‌ను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.

ట్విట్టర్తో గొడవ వల్లేనా?

నిజానికి డేటా ప్రైవసీ, కొన్ని ట్వీట్ల విషయంలో ట్విట్టర్​తో కేంద్రానికి కొద్ది రోజులుగా పడట్లేదు. ఈ మధ్య కొందరు ప్రధాని మోడీ పేరిట ‘రైతు హత్యలకు కుట్ర’ అంటూ హాష్​ట్యాగ్​లు క్రియేట్​ చేశారు. ఆ అకౌంట్లతో పాటు ఖలిస్థానీ గ్రూపులతో సంబంధాలున్న వెయ్యికి పైగా అకౌంట్లను బ్లాక్​ చేయాల్సిందిగా ట్విట్టర్​ను కేంద్రం ఆదేశించింది. తప్పుడు సమాచారాన్ని పోస్ట్​ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. దానికి సంబంధించి ట్విట్టర్​ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. పైగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు.. దేశ చట్టాలతో సంబంధం లేకుండా ఉన్నాయంటూ కామెంట్​ చేసింది. ఈ నేపథ్యంలోనే పీయూష్​ గోయల్​ తాను ‘కూ’కు మారినట్టు వెల్లడించారు. నెటిజన్లకూ దానిని రిఫర్​ చేశారు.

మంత్రులు, ఎంపీలు, సింగర్లు, క్రికెటర్లకు అకౌంట్లు

కూ యాప్​లో ఇప్పుడు పెద్ద పెద్దోళ్లు చేరుతున్నారు. రాజకీయ నాయ కులు, క్రీడాకారులు, బాలీవుడ్​ సింగ ర్లు కూకు యూజర్లు అయిపోయారు. ముఖ్యంగా ఐటీ మంత్రి రవి శంకర్​ ప్రసాద్​, రైల్వే మంత్రి పీయూష్​ గోయల్​, ఎంపీలు తేజస్వీ సూర్య, శోభా కరాంద్లాజే, కర్నాటక ముఖ్యమంత్రి బీఎస్​ యడియూరప్ప, ఇషా ఫౌండేషన్​ యోగి జగ్గీ వాసుదేవ్​, ప్రముఖ క్రికెటర్లు అనిల్​ కుంబ్లే, జవగల్‌‌‌‌​ శ్రీనాథ్​, రెజ్లర్​ పవన్​ కుమార్​ బాలీవుడ్​ యాక్టర్​ అశుతోష్​ రాణా, సింగర్లు జస్వీందర్​ సింగ్​, రచయిత అమీశ్​ త్రిపాఠీ, కాలమిస్ట్​ సుహేల్​ సేఠ్​ వంటి ప్రముఖులు అందులో చేరారు. ఈమధ్య పీయూష్​ గోయల్​ స్వయంగా కూ యాప్​కు మారినట్టు ఆ యాప్​లోనే ఓ మెసేజ్​నూ పోస్ట్​ చేయడం విశేషం.

ప్రభుత్వ శాఖలు కూడా..

సెలబ్రిటీలే కాదు.. కేంద్ర ప్రభుత్వ సంస్థలకూ ఇప్పుడు ‘కూ’లో అకౌంట్లున్నాయి. మైగవ్​, నీతి ఆయోగ్​, మినిస్ట్రీ ఆఫ్​ ఎలక్ట్రానిక్స్​ అండ్​ ఇన్ఫర్మేషన్​ టెక్నాలజీ, ఇండియా పోస్ట్​, నేషనల్​ ఇన్ఫర్మేటిక్స్​ సెంటర్​, డిజిటల్​ ఇండియా, సెంట్రల్​ బోర్డ్​ ఆఫ్​ ఇన్​డైరెక్ట్​ ట్యాక్సెస్​వంటి పెద్ద పెద్ద శాఖలు కూలో ఖాతాలను కలిగి ఉన్నాయి.