పార్లమెంట్​లో స్మోక్ అటాక్ కేసు.. మాస్టర్​మైండ్ అరెస్ట్

పార్లమెంట్​లో స్మోక్ అటాక్ కేసు.. మాస్టర్​మైండ్ అరెస్ట్
  • పార్లమెంట్​లో స్మోక్ అటాక్ కేసు.. మాస్టర్​మైండ్ అరెస్ట్
  • ఢిల్లీ పోలీసులకు సరెండర్ అయిన లలిత్ ఝా  
  • నలుగురు నిందితులకు ఏడు రోజుల పోలీసు కస్టడీ
  • నలుగురు నిందితులకు 7 రోజుల పోలీసు కస్టడీ 
  • కొన్ని నెలల కిందటే ప్లాన్రెక్కీ విజిట్ కూడా చేసిన నిందితులు 
  •  బయటే ఉండి వీడియోలు రికార్డు చేసి.. పరారైన లలిత్ 

న్యూఢిల్లీ : పార్లమెంట్ లో స్మోక్ అటాక్ కేసులో మాస్టర్ మైండ్ లలిత్ ఝాను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం లోక్ సభలో స్మోక్ అటాక్ చేసిన ఇద్దరిని, బయట స్మోక్ క్యాన్ లతో పొగలు రిలీజ్ చేస్తూ ఆందోళన చేసిన మరో ఇద్దరిని, వారికి ఇంట్లో ఆశ్రయం ఇచ్చిన వ్యక్తినీ పోలీసులు అరెస్ట్ చేయగా.. ఈ దాడి వెనక సూత్రధారి అయిన లలిత్ ఝా కూడా గురువారం పోలీసులకు లొంగిపోయాడు. గురువారం రాత్రి ఢిల్లీలోని కర్తవ్యపథ్ పోలీస్ స్టేషన్ కు వచ్చి లలిత్ లొంగిపోగా, పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. లోక్ సభలోకి వెళ్లి స్మోక్ అటాక్ చేసిన సాగర్ శర్మ, మనోరంజన్ లతోపాటు పార్లమెంట్ బయట రచ్చ చేసిన నీలమ్ దేవి, అమోల్ షిండేలను పోలీసులు కోర్టు ముందు హాజరుపర్చగా, వారిని 7 రోజుల కస్టడీకి అప్పగించింది.

వీరికి గుర్గావ్ లోని తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చిన విక్కీ శర్మ, అతని భార్యను పోలీసులు విడుదల చేశారు. లోక్‌‌‌‌సభ లోపల, బయట దాడిలో నలుగురు నిందితులకు లలిత్ ఝానే సూచనలు ఇచ్చినట్లు పోలీసులు చెప్పారు. కొన్ని నెలల కిందటే ఈ దాడికి ప్లాన్ చేశారని, గతంలో పార్లమెంటులో రెక్కీ విజిట్‌‌‌‌ కూడా చేశారని విచారణలో వెల్లడైంది. నిందితులపై చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద కేసు నమోదు చేశారు. అయితే, ఈ ఘటనతో ఏ టెర్రర్ గ్రూపులకూ సంబంధంలేదని తేలింది.

దాడికి ముందు అందరూ సమావేశమై..

కోల్‌‌‌‌కతా‌‌‌‌కు చెందిన లలిత్ ఝా టీచర్‌‌‌‌‌‌‌‌గా పని చేస్తున్నాడు. స్వాతంత్ర్య సమరయోధుడు భగత్‌‌‌‌ సింగ్‌‌‌‌ ను స్ఫూర్తిగా తీసుకున్నాడు. దేశవ్యాప్తంగా సంచలనం రేపాలని భావించాడు. గురుగ్రామ్‌‌‌‌లోని విక్కీ శర్మ ఇంటికి సాగర్ శర్మ (లక్నో ), డి.మనోరంజన్ (మైసూరు), నీలమ్ ఆజాద్ (హిసార్), అమోల్ షిండే (లాతూర్)లను లలిత్ రప్పించాడు. బుధవారం ఉదయం మాట్లాడుకున్నారు. ఆరుగురూ లోపలికి వెళ్లి.. పొగ స్ప్రే చేయాలని భావించారు. కానీ ఇద్దరికే ఎంట్రీ దొరకడంతో విజిటర్ పాస్‌‌‌‌లతో సాగర్ శర్మ, డి.మనోరంజన్.. లోక్‌‌‌‌సభలోకి వెళ్లారు. పార్లమెంటు బయట నీలమ్, అమోల్ షిండేలు పొగ స్ప్రే చేయగా.. లలిత్ ఝా వీడియో రికార్డు చేశాడు. అక్కడి నుంచి పారిపోవడానికి ముందే సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. మీడియాలో కవర్ అయ్యేలా చూసుకోవాలని ఓ ఎన్జీవోకు వీడియో క్లిప్‌‌‌‌ పంపాడు. దాడికి ముందే నలుగురి ఫోన్లను లలిత్ తీసుకున్నాడు” అని పోలీసులు తెలిపారు. నిరుద్యోగం, మణిపూర్‌‌‌‌‌‌‌‌లో హింసకు నిరసనగానే ఈ దాడి చేశామని నిందితులు చెప్పినట్లు సమాచారం.

8 మంది భద్రతా సిబ్బందిపై వేటు

పార్లమెంటుపై దాడి ఘటనలో భద్రతా వైఫల్యం నేపథ్యంలో 8 మంది సెక్యూరిటీ సిబ్బందిపై ప్రభుత్వం వేటు వేసింది. పార్లమెంటు ఎంట్రీ గేటు, హౌస్ ఎంట్రీ ఏరియా తదితర ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న వారిని సస్పెండ్ చేసింది.