కవిత నిజాలు చెప్తలే

కవిత నిజాలు చెప్తలే
  • ఆమెకు బెయిల్​ ఇవ్వొద్దు.. ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తరు
  • కోర్టు దృష్టికి తెచ్చిన సీబీఐ.. తీర్పు మే 2కు రిజర్వ్​
  • ఈడీ కేసులోనూ కొనసాగిన వాదనలు 
  • కవితను టెర్రరిస్టుగా ట్రీట్​ చేస్తున్నారన్న ఆమె తరఫు అడ్వకేట్
  • కావాలనే ఫోన్లను ఆమె ఫార్మాట్​ చేశారన్న ఈడీ

న్యూఢిల్లీ, వెలుగు: లిక్కర్ స్కామ్​ కేసులో బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కింగ్ పిన్  అని, విచారణలో నిజాలు చెప్పడం లేదని సీబీఐ పేర్కొంది. ఆమెకు బెయిల్​ ఇస్తే సాక్షులను, దర్యాప్తును ప్రభావితం చేస్తారని.. బెయిల్​ ఇవ్వొద్దని కోర్టు దృష్టికి తెచ్చింది. బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్​గా ఉన్న  తనకు సీబీఐ కేసులో బెయిల్ మంజూరు చేయాలంటూ కవిత దాఖలు చేసిన పిటిషన్​పై ఢిల్లీ రౌస్ ఎవెన్యూలోని సీబీఐ స్పెషల్​ కోర్టులో సోమవారం వాదనలు నడిచాయి.

ఈడీ అరెస్ట్​ను సవాల్ చేస్తూ ఆమె పెట్టుకున్న బెయిల్​ పిటిషన్​ పైనా వాదనలు కొనసాగాయి. ఈ రెండు పిటిషన్లపై జడ్జి కావేరి బవేజా విచారణ జరిపారు. ఉదయం సీబీఐ కేసులోని బెయిల్ పిటిషన్​పై వాదనలు కొనసాగగా.. కవిత తరఫున అడ్వకేట్లు విక్రమ్ చౌదరి, నితీష్ రాణా, మోహిత్ రావు, సీబీఐ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పంకజ్ గుప్తా హాజరయ్యారు. తొలుత కవిత అడ్వకేట్​ విక్రమ్ చౌదరి వాదనలు వినిపిస్తూ.. మహిళగా కవిత పీఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారం బెయిల్‌‌కు అర్హురాలని తెలిపారు.

ఎలాంటి ఆధారాలు లేకుండానే ఆమెను సీబీఐ అరెస్ట్​చేసిందన్నారు. ఇదే కేసుకు సంబంధించి ఈడీ కస్టడీలో ఉండగానే.. సీబీఐ అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని ఆయన వాదించారు. లోక్​సభ ఎన్నికల కోసం బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన స్టార్ క్యాంపెయినర్లలో కవిత ఒకరని, అందువల్ల ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరారు. బెయిల్ ఇవ్వాలన్న కవిత అడ్వకేట్​ వాదనలపై సీబీఐ తరపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పంకజ్ గుప్తా అభ్యంతరం తెలిపారు. లిక్కర్ కేసులో కవిత కింగ్ పిన్​గా ఉన్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

ఈ కేసుకు సంబంధించి చాలా విషయాలు కవితకు తెలుసని.. ఇతరులు ఇచ్చిన స్టేట్​మెంట్స్, ఆధారాలపై ఆమెను విచారించినా నిజాలు చెప్పడం లేదని అన్నారు. హైపొలిటికల్ పవర్ ఉన్న కవిత ఈ కేసు దర్యాప్తును ప్రభావితం చేయగలరని, అందువల్ల ఆమెకు బెయిల్ నిరాకరించాలని కోర్టును కోరారు. ఇరువైపుల వాదనలు విన్న జడ్జి కావేరి బవేజా.. ఈ పిటిషన్​పై వాదనలు ముగిస్తున్నట్లు స్పష్టం చేశారు. తీర్పును మే 2కు రిజర్వ్ చేశారు. 

ఈడీ కేసులో విచారణ నేటికి వాయిదా

ఈడీ కేసులో తనకు బెయిల్​ ఇవ్వాలంటూ కవిత పెట్టుకున్న పిటిషన్​పైనా సోమవారం వాదనలు కొన సాగాయి. ఆమె తరఫు సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మనుసింఘ్వీ వాదనలు వినిపించారు. దాదాపు ఐదారు గంటలు విచారణకు హాజరైనా.. ఆమెను ఒక టెర్రరిస్టు, కరుడుగట్టిన నేరస్తులను ట్రీట్ చేసినట్లు దర్యాప్తు సంస్థలు చూస్తున్నాయని అన్నారు. ఈడీ అధికారులు మార్చి 15న కవితను ఇల్లీగల్ గా అరెస్ట్ చేశారని ఆయన పేర్కొన్నారు. కవితకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవన్నారు. అనుమానితురాలిగా కూడా లేని కవితను నిందితురాలిగా మార్చారని ఆయన తెలిపారు.

ఈడీ ఆరోపిస్తున్నట్లు కవిత ఎలాంటి ఆధారాలను ధ్వంసం చేయలేదని సింఘ్వీ అన్నారు. వాడిన ఫోన్లను ఆమె తన సిబ్బంది కి ఇచ్చారని, ఎవరైనా ఫోన్లు వాడేముందు ఫార్మాట్ చేస్తారని కోర్టు దృష్టికి సింఘ్వీ తీసుకొచ్చారు. అయితే, ఈ వాదనలపై ఈడీ తరఫు అడ్వకేట్​ జోహెబ్ హుస్సేన్, అడిషనల్ డైరెక్టర్ భానుప్రియ అభ్యంతరం తెలిపారు. కావాలనే కవిత తన ఫోన్లను ఫార్మాట్ చేశారని కోర్టుకు తెలిపారు.

2023 మార్చి లోనే తాము తయారు చేసిన కేసు ఫైల్​లో ఈ అంశాన్ని మెన్షన్ చేశామని వివరించారు. మంగళవారం వాదనలు వినిపించేందుకు సిద్ధమా? అని కోర్టు ఇరువర్గాలను ప్రశ్నించగా.. ఇరువర్గాలు ఓకే చెప్పాయి. దీంతో విచారణను మంగళవారం మధ్యాహ్నం లంచ్ టైం తర్వాత చేపడతామని జడ్జి కావేరి బవేజా వెల్లడించారు. 

నేడు కోర్టు ముందుకు కవిత  

ఈడీ, సీబీఐ కేసులో కవితకు విధించిన జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో మంగళవారం ఆమెను పోలీసులు కోర్టు ముందు హాజరుపరుచనున్నారు. ఈడీ కేసులో ఈ నెల 9న కోర్టు 14 రోజులు కస్టడీ పొడిగించగా.. సీబీఐ కేసులో ఈ నెల 15న ఎనిమిది రోజుల కస్టడీ విధిస్తున్నట్లు ఉత్తర్వుల్లో కోర్టు పేర్కొంది. అయితే కవిత దాఖలు చేసిన రెండు బెయిల్ పిటిషన్లలో సీబీఐ కేసులో తీర్పు మే 2 కు రిజర్వ్ చేయగా.. ఈడీ కేసులో విచారణ మంగళవారం జరగనుంది. ఈ సందర్భంలో ఆమె జ్యుడీషియల్ కస్టడీని మరిన్ని రోజులు పొడించే అవకాశం ఉన్నట్లు న్యాయ నిపుణులు చెప్తున్నారు. కాగా, జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా ప్రస్తుతం కవిత తీహార్ జైలులో ఉన్నారు.