రైతు ఆందోళనలు: నేషనల్ హైవే అథారిటీకి వేల కోట్ల నష్టం

రైతు ఆందోళనలు: నేషనల్ హైవే అథారిటీకి వేల కోట్ల నష్టం

న్యూఢిల్లీ: గతేడాది అక్టోబరులో మొదలైన రైతు ఆందోళనల వల్ల నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI)కి భారీ నష్టం వచ్చిందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. రాజ్యసభలో ఓ ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ.. అన్నదాతల ఆందోళనల వల్ల టోల్ ఛార్జీలు సరిగ్గా వసూలు కాలేదని చెప్పారు. దీంతో NHAIకి దాదాపు రూ.2,731 కోట్ల మేర నష్టం కలిగిందన్నారు. పంజాబ్, హరియాణా, రాజస్థాన్ లో రైతులు చేసిన రాస్తారోకోలతో వాహనాల రాకపోకలకు వీలు కాలేదని, టోల్ చార్జీలు వసూలు చేయలేకపోయామని పేర్కొన్నారు.  

వాహనదారులు టోల్ గేట్ వరకు రాకుండా వేరే మార్గాల్లో వెళ్లడంతో NHAIకి నష్టం వాటిల్లిందని గడ్కరీ అన్నారు. తొలుత రాజస్థాన్ లో జాతీయ రహదారులపై టోల్ గేట్ల నిర్వహణను సరిగ్గా చేయలేకపోయామన్నారు. పక్క రాష్ట్రాలైన హరియాణా, పంజాబ్ లోనూ ఇబ్బందికరంగా మారిందన్నారు. దాదాపు 65 టోల్ ప్లాజాల్లో ఛార్జీలు వసూలు చేయలేదన్నారు. రాజ్యసభలో మరో ప్రశ్నకు సమాధానం చెబుతూ.. 2021 ఆర్థిక సంవత్సరంలో మరో 12 వేల కిలో మీటర్ల జాతీయ రహదారి నిర్మాణం దిశగా పని చేస్తున్నామని గడ్కరీ పేర్కొన్నారు.