తెలుగు జాతికి వరం ‘సురవరం ప్రతాప రెడ్డి’

తెలుగు జాతికి వరం ‘సురవరం ప్రతాప రెడ్డి’

హైదరాబాద్ సంస్థానంలో ఉర్దూ మాట్లాడే వాళ్లు 12% మంది మాత్రమే. అత్యధిక సంఖ్యలో ఉన్న జనం మాట్లాడే తెలుగును కాదని నిజాం పాలకులు ఉర్దూనే ప్రధాన భాషగా చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో, న్యాయస్థానాల్లో ఉర్దూనే అధికార భాష. ప్రాథమిక స్థాయి నుంచి విశ్వవిద్యాలయ స్థాయి దాకా ఉర్దూనే బోధనా భాష. తెలుగు ప్రజలకు పౌరసత్వపు హక్కులు, సమావేశాలు సభలు జరుపుకునే హక్కులు లేవు. ప్రతిదానికీ ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. తెలుగు పత్రిక స్థాపించాలంటే తెలుగు, ఆంధ్ర పదాలుండకూడదనే ఆంక్షలుండేవి.

ఈ చిమ్మచీకట్లలో గోలకొండ పత్రిక అనే చిరుదివ్వెను వెలిగించి తన బహుముఖ ప్రజ్ఞతో సంస్థల్ని, ఉద్యమాల్ని నిర్మించి ప్రజా చైతన్యాన్ని తట్టి లేపిన వారు సురవరం. ఆయన  జీవితాన్ని అధ్యయనం చేయటం అంటే 19-20ల నాటి తెలుగువారి సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక చరిత్రను తెలుసుకోవటమే అంటాడు ‘సురవరం ప్రతాప రెడ్డి’ అనే గ్రంథాన్ని రాసిన డా॥ కె.యస్. రమణ.1896 మే 28న జన్మించిన సురవరం హేతువాది. రాహుకాలం, యమగండం, తిథి వార నక్షత్రాలపైన ఎన్నడూ విశ్వాసం చూపలేదు. పత్రికలు ప్రారంభించే సమయంలో ముహూర్తాన్ని లగ్నాన్ని చూడలేదు. వర్షం కురవటానికి చేసే యజ్ఞ యాగాలను విమర్శించే వారు.

సురవరం ప్రతాపరెడ్డి శుద్ధ ఖద్దరు ధోవతి కట్టి, తలకు తెల్లని పాగా చుట్టేవారు. పొడుగైన జుబ్బా ధరించేవారు. అచ్చమైన గ్రామీణ రైతు రూపాన్ని జ్ఞప్తికి తెస్తూ స్పష్టమైన తెలుగులో మాట్లాడుతూ సామాన్యులలో సామాన్యుడిగా నిరాడంబరంగా కన్పించేవారు. అసామాన్య వ్యక్తిత్వంతో తెలుగు వెలుగై నిలిచిన ఆ అద్భుతమూర్తి భావితరాలకు తరగని స్ఫూర్తి.ఎందరో ప్రముఖులు ఆయనకు స్నేహితులు. పోలీస్ కమీషనర్ రాజాబహద్దూర్ వెంకట్రామా రెడ్డి స్నేహం వీరి జీవితంలో ముఖ్యమైన మలుపులకు కారణమయ్యింది. న్యాయవాదిగా ఉన్న తనకు 1918లో ఆయన నిర్మించిన రెడ్డిజన హాస్టల్ నిర్వహణ బాధ్యతను అప్పగించారు.

ప్రతాపరెడ్డి విద్యార్థుల్లో క్రమశిక్షణను కొత్త పద్ధతుల ద్వారా తీసుకొచ్చారు. విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగేలా, హైదరాబాద్​లో ఇలాంటి హాస్టల్​ మరొకటి లేదనే పేరు వచ్చేలా, ఇందులో సీటు లభిస్తే తమ పిల్లలు ఆదర్శవంతులు అవుతారని అందరూ విశ్వసించే స్థాయికి ఎదిగేలా హాస్టల్​ని తీర్చిదిద్దారు. దానికి దశాబ్దం పాటు సేవ చేశారు. ఈనాటి హాస్టళ్ల నిర్వాహకులు తెలుసుకోదగిన మెలకువలు కొన్ని ఈ పుస్తకంలో ఉన్నాయి.తరువాత వెంకట్రామా రెడ్డి గోలకొండ పత్రిక బాధ్యతను అప్పజెప్పడంతో, నిద్రాణమైన తెలంగాణ సాంస్కృతిక వాతావరణంలో జనచైతన్య భేరిని మోగించే అవకాశం ప్రతాపరెడ్డికి వచ్చింది. ఆ పత్రిక తెలంగాణనే వెలిగించే అఖండ జ్యోతిగా నిల్చింది. స్త్రీలు తమ వాదనలను స్వేచ్ఛగా, నిర్భయంగా ప్రకటించడానికి పత్రికలో చర్చావేదిక ప్రారంభించారు. తెలంగాణలో కవులు లేరన్నవారికి ‘గోలకొండ కవుల సంచిక’(1935)లో దీటుగా బదులిచ్చారు. ఇందులో 183 మంది పూర్వ కవుల, 354 మంది ఆధునిక కవుల రచనలున్నాయి. ఆయన రేకెత్తించిన సాహిత్య చైతన్యంతో ఎంతోమంది తెలుగు కవులు, రచయితలు వెలుగు చూశారు.సురవరం వారు కవిత్వము, నవలలు, నాటకాలు, కథలు, కథానికలు ఎన్నో రాశారు. రాసిన వ్యాసాలు, సంపాదకీయాలు సహస్రాధికం. ఆయన పరిశోధక రచనల్లో ప్రధానమైనవి నాలుగు. 
ఆంధ్రుల సాంఘిక చరిత్ర, హిందువుల పండుగలు, రామాయణ విశేషములు, హిందూస్థాన చరిత్ర. ఆయన ఏది రాసినా అందులో నవ్యత, శాస్త్రీయత, మానవత ఉంటాయని కె.యస్. రమణ ఈ గ్రంథం ద్వారా నిరూపించారు.

ప్రతాపరెడ్డికి ఆంధ్ర మహాసభ, విజ్ఞానవర్ధిని పరిషత్తు, ఆంధ్ర సారస్వత పరిషత్, ఆయుర్వేద సంఘం, శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం, స్వాతంత్ర్యోద్యమం, సంఘ సంస్కరణోద్యమం మొదలగు వాటితో గల అనుబంధాన్నీ ఈ గ్రంథం ద్వారా తెలుసుకోవచ్చు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1952లో మహబూబ్​నగర్ జిల్లా వనపర్తి నియోజకవర్గం నుండి శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. 1953 ఆగస్టు 25న కన్నుమూశారు.పత్రికా రచయిత, పరిశోధకుడు, విమర్శకుడు, కవి, వక్త, తెలుగువారు గర్వపడే సాహిత్య మూర్తిగా తెలుగు జాతికి వరంగా సురవరం ప్రతాపరెడ్డి విశ్వరూపాన్ని ఈ చిన్న పుస్తకంలో డా॥ కె.యస్. రమణ చూపించిన తీరు అభినందనీయం.(మే, 28 సురవరం ప్రతాపరెడ్డి జయంతి సందర్భంగా)
- ఎ. గజేందర్ రెడ్డి
9848894086