నాన్​కానా గురుద్వారాను టచ్​ చేయలే

నాన్​కానా గురుద్వారాను టచ్​ చేయలే

దాడి జరిగిందనే ప్రచారం అబద్ధం: పాక్

ఇస్లామాబాద్, చండీగఢ్, న్యూఢిల్లీ: లాహోర్​లోని గురుద్వారా నాన్​కానా సాహెబ్​పై దాడి జరిగిందనే వార్తల్లో నిజంలేదని పాక్​ ప్రభుత్వం శనివారం వివరణ ఇచ్చింది. గురుద్వారాను ఎవరూ టచ్​ చేయలేదని, దానికి ఎలాంటి నష్టం జరగలేదని పేర్కొంది. రెండు గ్రూపుల మధ్య చిన్న తగాదా చోటుచేసుకోవడంతో అధికారులు వెంటనే రియాక్ట్ అయి​ వారిని అదుపులోకి తీసుకున్నారని పాక్​ విదేశాంగ శాఖ ఒక ప్రకటన రిలీజ్​చేసింది. ఈ గొడవకు మతం రంగు పులిమే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించింది. ఈమేరకు గురుద్వారాపై దాడి జరిగిందంటూ శనివారం మన మీడియాలో వార్తలు రావడంతో పాక్​ విదేశాంగ శాఖ ఈ ప్రకటన విడుదల చేసింది. దేశంలోని మైనారిటీల సెక్యూరిటీకి వచ్చిన ముప్పేమీ లేదని పేర్కొంది. మైనారిటీల రక్షణకు పాక్​ సర్కారు కట్టుబడి ఉందని, కర్తార్​పూర్​ కారిడార్​ ఏర్పాటే దీనికి నిదర్శనమని వివరించింది.

తీవ్రంగా ఖండించిన మన విదేశాంగ శాఖ

సిక్కుల పవిత్ర స్థలాల్లో ఒకటైన నాన్​కానా సాహెబ్​పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మన విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది. గురుద్వారా వద్ద శాంతిభద్రతలు నెలకొల్పేందుకు తగిన చర్యలు తీసుకోవాలని పాక్​ ప్రభుత్వాన్ని కోరింది. గురుద్వారాతో పాటు దేశంలోని సిక్కులకు తగిన సెక్యూరిటీ కల్పించాలని పాక్​ను ఉద్దేశించి ఓ ప్రకటన విడుదల చేసింది. నాన్​కానా సాహెబ్​పై దాడికి పాల్పడ్డ వారిని గుర్తించి, కఠినంగా శిక్షించాలని విజ్ఞప్తి చేసింది. గురుద్వారాపై దాడి ఘటనను పంజాబ్​ సీఎం అమరీందర్​ సింగ్​ ఖండించారు. నాన్​కానా సాహెబ్​లో చిక్కుకుపోయిన భక్తులను మూకదాడి నుంచి రక్షించాలని పాక్​ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​ను కోరారు. ఈ ఇష్యూను పాక్​ ప్రధాని ఇమ్రాన్​తో చర్చించాలంటూ శిరోమణి అకాలీదళ్​ చీఫ్​ సుఖ్​బీర్​ సింగ్​ బాదల్​ప్రధాని నరేంద్ర మోడీని కోరారు.

సిక్కులపై మూకదాడి విచారకరమని శిరోమణి గురుద్వారా ప్రబంధక్​ కమిటీ(ఎస్ జీపీసీ) పేర్కొంది. దాడి నేపథ్యంలో నాన్​కానా సాహెబ్​ వద్ద పరిస్థితిని పరిశీలించేందుకు నలుగురు సభ్యులతో కూడిన కమిటీని పాకిస్తాన్​కు పంపించనున్నట్లు ప్రకటించింది. దాడి ఘటనపై ఈ టీమ్​ పంజాబ్​(పాక్) గవర్నర్​తో పాటు సీఎంతో సమావేశమై చర్చిస్తుందని తెలిపింది. నాన్​కానా సాహెబ్​ మేనేజ్​మెంట్​ కమిటీతో ఇప్పటికే ఫోన్​లో మాట్లాడామని, ప్రస్తుతం పరిస్థితులు నార్మల్​గానే ఉన్నాయని వారు చెప్పారని వివరించింది. ఈ దాడికి నిరసనగా ఢిల్లీలోని పాక్​ ఎంబసీ ముందు యూత్​ కాంగ్రెస్​ ఆందోళన చేసింది. పాక్​ సర్కారుకు వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేశారు. ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్​మెంట్​ కమిటీ, శిరోమణి అకాలీదళ్ సభ్యులు కూడా పాక్​ ఎంబసీ ముందు ఆందోళనలు చేశారు.

అసలేం జరిగింది?

పాక్​ పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం.. జగ్జీత్ కౌర్‌‌‌‌‌‌‌‌ అనే సిక్కు యువతి, మహ్మద్ హుస్సేన్ అనే ముస్లిం యువకుడు పెళ్లి చేసుకున్నారు. ఈ విషయంలో రెండు కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి. తమ కుమార్తెను బలవంతంగా ఎత్తుకెళ్లి, మతం మార్చి పెళ్లి చేసుకున్నాడని ఆరోపిస్తున్నారు. హుస్సేన్​ కుటుంబం మాత్రం ఈ వాదనను కొట్టిపారేసింది. జగ్జీత్​ కౌర్​ ఇష్టపూర్వకంగా, తనే మతం మార్చుకుని తమ కొడుకును పెళ్లి చేసుకుందని చెబుతోంది. దీనిపై జగ్జీత్​ కౌర్​ పేరెంట్స్​పోలీసులను ఆశ్రయించారు. తమ కుమార్తెను కిడ్నాప్​ చేశాడంటూ హుస్సేన్​పై ఫిర్యాదు చేశారు. ఈ కంప్లైంట్​ ఆధారంగా పోలీసులు హుస్సేన్​ను అరెస్ట్​ చేశారు. పోలీసుల రాకతో హుస్సేన్​ తల్లిదండ్రులు మండిపడ్డారు. కొంతమంది బంధువులతో కలిసి నాన్​కానా సాహెబ్​ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. గురుద్వారాకు వచ్చిన భక్తులపై రాళ్లు విసిరారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఏమిటీ నాన్​కానా సాహెబ్..

సిక్కుల తొలి గురువు గురు నానక్​ పుట్టిన స్థలమే ఈ గురుద్వారా నాన్​కానా సాహెబ్. దీనినే గురుద్వారా జనమ్​ ఆస్థాన్ అని కూడా పిలుస్తారు. సిక్కులు అత్యంత పవిత్రంగా భావించే స్థలాల్లో ఇదొకటి.

ఇంతకన్నా ఇంకేం కావాలి

పాకిస్తాన్​లో మైనారిటీల పరిస్థితికి నాన్​కానా సాహెబ్​పై దాడి ఘటనే నిదర్శనమని కేంద్ర మంత్రి హర్​దీప్​ సింగ్​ పూరి చెప్పారు. సిటిజన్​షిప్​ అమెండ్​మెంట్​ యాక్ట్(సీఏఏ)కు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న వారు ఇప్పటికైనా కళ్లు తెరవాలని
కోరారు.

పాక్​ నిజస్వరూపం బయటపడింది

ఈ ఘటనతో పాక్​ నిజస్వరూపం బయటపడింది. ముందేమో సిక్కు యువతిని కిడ్నాప్ చేశారు. తర్వాత ఆమెకు బలవంతంగా పెళ్లి చేశారు. ఇదంతా చాలదన్నట్లు పవిత్రమైన గురుద్వారా ముందే ఆ యువతి కుటుంబంపై దాడి జరిగింది. పాక్​ సర్కారు ఈ దారుణాలను ఆపేసేలా, అక్కడి సిక్కులకు భద్రత కల్పించేలా ఒత్తిడి తీసుకురావాలని ప్రధాని నరేంద్ర మోడీ, విదేశాంగ మంత్రి జయశంకర్​లను కోరుతున్నా.

– ట్విట్టర్​లో హరిసిమ్రత్​ కౌర్​ బాదల్,
కేంద్ర మంత్రి