పాయిఖానాల మీద టీఆర్ఎస్​ ప్రచారమా?

పాయిఖానాల మీద టీఆర్ఎస్​ ప్రచారమా?

హైదరాబాద్, వెలుగు: గవర్నమెంట్, సర్కారు భాగస్వామ్యం ఉన్న సంస్థల ఆస్తులపై ప్రభుత్వ పథకాలను ప్రచారం చేస్తూ హోర్డింగులు పెట్టడం రూల్స్​కు విరుద్ధమని పీసీసీ చీఫ్​ ఉత్తమ్ స్పష్టం చేశారు. వాటిని వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎలక్షన్​ కమిషనర్​కు విజ్ఞప్తి చేశారు. ఆయన శనివారం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్ లతో కలిసి ఎలక్షన్​ కమిషనర్  పార్థసారథికి కంప్లైంట్​ చేశారు. తర్వాత ఉత్తమ్​ మీడియాతో మాట్లాడారు. ‘‘మెట్రో పిల్లర్లు, మెట్రో స్టేషన్లు, బస్టాండ్లపై టీఆర్ఎస్​ హార్డింగులు, యాడ్స్​ పెట్టి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. మెట్రోస్టేషన్లు, పిల్లర్లు, బస్సులు, బస్టాపుల్లో ప్రభుత్వ పథకాల ప్రచారం తప్పు. చివరికి టాయిలెట్లు, పాయిఖానాలను కూడా వదలకుండా ప్రచారం చేసుకుంటున్నరు. ఇది రూల్స్​కు విరుద్ధం. దీనిపై సెంట్రల్​ ఎలక్షన్​ కమిషన్‌‌‌‌ నుంచి స్పష్టమైన సూచనలు ఉన్నాయి.” అని చెప్పారు. మెట్రో పిల్లర్లు, బస్‌‌‌‌లు, బస్టాప్‌‌‌‌ల యాడ్‌‌‌‌ స్పేస్‌‌‌‌ను  ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చినా.. సదరు ఎలక్షన్స్ ​ముగిసే వరకు ఏ పార్టీకి ప్రచారం కోసం స్పేస్‌‌‌‌ ఇవ్వవద్దన్నారు మెట్రో రైలును ఎల్ అండ్ టీ కంపెనీ నడుపుతున్నా.. అందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉందని, ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం నిధులిచ్చిందని గుర్తు చేశారు. ఆర్టీసీ ఆస్తులపై అధికార పార్టీ ప్రచారం రూల్స్​కు విరుద్ధమని స్పష్టం చేశారు. అసలు ఈసీ ఆఫీసు ముందు హోర్డింగులు ఉండడం చూస్తుంటేనే.. అధికారుల పని తీరు ఎట్లా ఉందో అర్థం చేసుకోవచ్చని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీ నిస్సిగ్గుగా వ్యవహరిస్తోందని.. భూపేంద్ర యాదవ్  కాంగ్రెస్ నేతలను కొనేందుకు రాష్ట్రానికి వచ్చినట్టుగా ఉందని విమర్శించారు. బీజేపీ, ఎంఐఎం రెండూ మతతత్వ పార్టీలని.. కుమ్మక్కై పనిచేస్తున్నాయని, వారి మధ్య రహస్య ఒప్పందం ఉందని ఆరోపించారు.