కోతుల బెడదతో వణికిపోతున్న జనం

కోతుల బెడదతో వణికిపోతున్న జనం

వరంగల్ వాసులకూ కోతుల కష్టాలు తప్పడంలేదు. వందల సంఖ్యలో ఊళ్లలోకి వస్తున్న కోతులు  కనిపించిన వస్తువులను చిందరవందర చేస్తూ... దొరికిన ఆహారాన్ని తినేస్తున్నాయి.కోతుల దాడిలో  చాలామంది గాయపడ్డారు. కొందరు ప్రాణాలు కోల్పోయారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు చెప్పినా నివారణ చర్యలు తీసుకోవడం లేదంటున్నారు జనం. 

 జయశంకర్ భూపాలప్లలి జిల్లా  రేగొండ మండలం నాగుర్లపల్లి గ్రామానికి చెందిన శిరీష  గతేడాది మే  నెలలో కోతుల దాడితో బిల్డింగ్ పై  నుంచి పడి చనిపోయింది. శిరీష  హనుమకొండ శివారు బట్టుపల్లిలోని ఓ ప్రభుత్వ హాస్టల్ లో ఉంటూ ఎంసీఏ చదువుతోంది. కోతుల గుంపు గదిలోకి రావడంతో లోపల ఉన్న వాళ్లంతా భయంతో బయటకు పరుగులు తీశారు. శిరీష కూడా పరిగెడుతూ కాలుజారి వరండా గోడపై నుంచి కింద పడి చనిపోయింది. ఐదు రోజుల కిందట  హనుమకొండ జిల్లాలోని  ఎల్కతుర్తి మండలం దామెర గ్రామంలో  కోతుల దాడిలో నలుగురు గాయపడ్డారు.  అదేరోజు ఎల్కతుర్తి లోని  కెజిబివి హాస్టల్ లో 6వ తరగతి విద్యార్థిపై కోతులు దాడి చేసి గాయపర్చాయి. వీళ్లంతా స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందారు. భీమదేవరపల్లి మండలం కొత్తపల్లిలో కోతులు ఇంటి పైన పెంకులు పీకేస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

 గ్రామాల్లోకి వస్తున్న కోతులు రాత్రి, పగలు ఆహారం  కోసం పంటపొలాలపై దండయాత్ర చేస్తున్నాయి. పండ్లు, కూరగాయలతో పాటు వరి, మొక్కజొన్న పంటలను  పాడు చేస్తున్నాయి. డోర్నకల్, మహబూబాబాద్,  కే సముద్రం,  కురవి, తొర్రూరు మండలాల్లో కోతుల బెడద ఎక్కువగా ఉందంటున్నారు జనం. 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా, జనగామ, ములుగు జిల్లాల్లోని గ్రామాలు, పట్టణాల్లో కోతులు  బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇండ్లలోకి దూరి సంచులు, డబ్బాలు, అన్నం గిన్నెలు ఇలా దొరికినవన్నీ ఎత్తుకెళ్తున్నాయి. బట్టల్ని చించేస్తున్నాయి. వస్తువులను చిందరవందర చేస్తున్నాయి. ఇళ్ల దగ్గర పండ్ల చెట్లు,  పూల చెట్లను ధ్వంసం చేస్తున్నాయి.   కోతుల దాడిలో గాయపడిన వాళ్లు  వాక్సిన్ కోసం  హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు. ఫిర్యాదు చేసినా ఫారెస్ట్ అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు జనం.  ఒకప్పుడు  ఉమ్మడి వరంగల్ లో దట్టమైన అడువులు ఉండేవి.  అడవుల విస్తీర్ణం తగ్గిపోవడంతో ఆహారం కోసం గ్రామాల్లోకి వస్తున్నారు కోతులు.