ఆశలన్నీ అమిత్​షా పైనే...ఏపీలో విలీనమైన ఐదు పంచాయతీల వ్యథ

ఆశలన్నీ అమిత్​షా పైనే...ఏపీలో విలీనమైన ఐదు పంచాయతీల వ్యథ

భద్రాచలం,వెలుగు:  రాష్ట్ర విభజన అనంతరం పోలవరం ఆర్డినెన్స్ ద్వారా ఏపీలో విలీనమైన కన్నాయిగూడెం, ఎటపాక, పిచ్చుకులపాడు, గుండాల, పురుషోత్తపట్నం పంచాయతీల ప్రజలు తమను తిరిగి తెలంగాణలో కలపాలని పోరాడుతున్నారు. తమ గ్రామాలను ఏపీలో విలీనం చేసినప్పటినుంచి ఆందోళనలు నిర్వహిస్తున్నా వారి గోడును తెలంగాణ సర్కారు పట్టించుకోవడంలేదు. ఈనెల 15న భద్రాచలంలో సీతారామస్వామిని దర్శించుకునేందుకు వస్తున్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్​షా దృష్టికి తమ సమస్యను తీసుకెళ్లేందుకు విలీనగ్రామాల ప్రజలు సిద్ధమవుతున్నారు. 

ఏపీలో కలిసిన తర్వాత కన్నాయిగూడెం, ఎటపాక, పిచ్చుకులపాడు, గుండాల, పురుషోత్తపట్నం పంచాయతీల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రమైన పాడేరుకు వెళ్లాలంటే 450 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాలి. ఈ ఐదు పంచాయతీల ప్రజలు చేస్తున్న పోరాటానికి అండగా ఉంటామని, అవసరమైతే అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లి ప్రధాని మోదీని కలుస్తామని, వీటిని తిరిగి తెలంగాణలో కలిపేందుకు కృషి చేస్తామని సీఎం కేసీఆర్​ అసెంబ్లీలో ప్రకటించినా ఆ దిశగా ఎలాంటి ముందడుగు పడలేదు. 

గవర్నర్​ దృష్టికి.. 

రాష్ట్ర గవర్నర్​ తమిళిసై మే 17న భద్రాచలం వచ్చారు. ఆదివాసీలతో ముఖాముఖిలో పాల్గొన్న ఆమె దృష్టికి విలీన గ్రామాల సమస్యలను తీసుకొచ్చారు. రీసెర్చ్ స్కాలర్​ సంపత్​ చొరవతో ఐదు పంచాయతీల ప్రజలు ఆమెకు తమ గోడు వినిపించారు. వారి కష్టాలు విని కదిలిపోయిన ఆమె హైదరాబాదుకు వెళ్లిన తర్వాత భద్రాచలం నుంచి ఆదివాసీలను రాజ్​భవన్​కు పిలిపించుకుని సమగ్ర సమాచారం తీసుకున్నారు. విలీన గ్రామాలసమస్యను ఆమె కేంద్రానికి నివేదించారు. ఈనెల 15న భద్రాచలం పర్యటన కొస్తున్న అమిత్​షా మీద ఐదు పంచాయతీల ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. విభజన అంశాలు కేంద్ర హోంశాఖ పరిధిలో ఉండడంతో ఆయన తమ సమస్యకు పరిష్కారం చూపుతారన్న విశ్వాసంతో ఉన్నారు. ఈనెల 15న రాముల వారి దర్శనం కోసం వస్తున్న ఆయనను స్థానిక ఐటీసీ గెస్ట్ హౌస్​లో కలిసేందుకు ఐదు పంచాయతీల ప్రజలు సిద్ధమయ్యారు.
 
ఇవీ సమస్యలు

 ఈ ఐదు పంచాయతీలు భద్రాచలానికి కేవలం 9 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. విద్య, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండడమేకాకుండా అన్ని సమస్యలు పరిష్కరించే ఐటీడీఏ ఆఫీసు కూడా ఉంది. జిల్లా కేంద్రం పాడేరుకు వెళ్లాలంటే 450 కిలోమీటర్లు, చింతూరులోని ఐటీడీఏ ఆఫీసులోకి వెళ్లాలంటే 60 కిలోమీటర్లు ప్రయాణించాలి. అనారోగ్యం బారిన పడితే విజయవాడకో, రాజమండ్రికో వెళ్లేందుకు అవస్థలు పడుతున్నారు.   

స్కూళ్లు, కాలేజీలకు వెళ్లేవారికి నాన్​లోకల్​ అన్న సమస్య ఎదురవుతోంది. 

గోదావరి వరదలు వస్తే ఐదు పంచాయతీల వారికి సహాయం అందే పరిస్థితి లేదు. కరకట్టలు కట్టాలన్నా టెక్నికల్ సమస్యలు వస్తున్నాయి. 

భద్రాచలం రామాలయం భూములు ఏపీ పరిధిలోకి వెళ్లడంవల్ల డెవలప్​మెంట్​వర్క్స్​కు ఇబ్బంది అవుతోంది. 

 భద్రాచలంలో కలపాల్సిందే..!

 ఐదు పంచాయతీలను తిరిగి భద్రాచలంలో కలిపితేనే ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఈ గ్రామాలను ఏపీలో కలపడం వల్ల భద్రాచలానికి కనీసం డంపింగ్​ యార్డుకు కూడా ప్లేస్లే కుండాపోయింది. రాముడి భూములు పురుషోత్తపట్నం పంచాయతీలో వెయ్యి ఎకరాల దాకా భూములున్నాయి. ఎటపాకలో జటాయువు మండపం, గుండాలలో ఉష్ణగుండాలు రాముడు నడయాడిన స్థలాలు. ఇవి భద్రాచలంలోనే ఉండాలి. విలీనం చేయడంవల్ల ఈ గ్రామాల ప్రజలు కనీస వసతులకు కూడా నోచుకోవడంలేదు. ఈ సమస్యలను అమిత్​షా దృష్టికితీసుకెళ్తాం. 

పొదెం వీరయ్య, భద్రాచలం ఎమ్మెల్యే