ఫేక్ ఎడ్యుకేషన్​ సర్టిఫికెట్ల తయారీ గ్యాంగ్ ఆటకట్టు

ఫేక్ ఎడ్యుకేషన్​ సర్టిఫికెట్ల తయారీ గ్యాంగ్ ఆటకట్టు

గచ్చిబౌలి, వెలుగు : దేశంలోని పలు యూనివర్సిటీలకు చెందిన ఫేక్ ఎరు డ్యుకేషన్​సర్టిఫికెట్లను తయాచేసి అమ్ముతున్న 11 మంది సభ్యుల గ్యాంగ్ ను మాదాపూర్ జోన్ ఎస్ వోటీ, కేపీహెచ్ బీ పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు వివరాలను శుక్రవారం గచ్చిబౌలిలోని కమిషనరేట్ ఆఫీసులో సైబరాబాద్ సీపీ స్టీఫెన్​ రవీంద్ర వెల్లడించారు. ఏపీలోని విజయవాడ పరిధి రామవరప్పాడు ప్రాంతానికి చెందిన కోట కిశోర్​కుమార్​(42) ఓ ప్రైవేటు స్కూల్ టీచర్ గా పనిచేసేవాడు. రెండేండ్ల కిందట కరోనా ఫస్ట్ వేవ్ టైమ్ లో  జాబ్​ పోవడంతో విజయవాడలోని బెంజ్ సర్కిల్ దగ్గర ‘క్యాంపస్ సర్వీస్’ పేరుతో జాబ్స్, అబ్రాడ్, ఎడ్యుకేషన్ కు సంబంధించిన కన్సలెన్సీ ఆఫీసును ఓపెన్ చేశాడు. కన్సల్టెన్సీ సరిగా రన్ కాకపోవడంతో గూగుల్ లో వన్ సిట్టింగ్ స్టడీ సర్టిఫికెట్ ప్రొవైడర్స్ గురించి వెతికాడు. ఈ క్రమంలో వెస్ట్ బెంగాల్​కు చెందిన సంజయ్​వర్మ, రాహుల్​ ఘోష్​, ప్రతిమా పాటిల్​అతడికి పరిచయమయ్యారు. ఈ ముగ్గురు ఫేక్ స్టడీ సర్టిఫికెట్లను తయారు చేస్తున్నట్లు తెలుసుకున్న కిశోర్ వారితో కలిసి ఓ గ్యాంగ్ ఏర్పాటు చేశాడు.

డిగ్రీకి రూ.60 వేలు.. బీటెక్ కు రూ.2 లక్షల 50 వేలు

 దేశంలో పలు వర్సిటీల పేర్లతో ఫేక్ డిగ్రీ, బీటెక్, పీజీ సర్టిఫికెట్లను ఈ గ్యాంగ్ తయారు చేసేది. ఇంటర్, టెన్త్ సర్టిఫికెట్లను సైతం ప్రింట్ చేసేవారు.  కేపీహెచ్​బీలోని ఎల్లమ్మబండకు చెందిన బొక్క వెంకటేశ్వరరావు, సరూర్​నగర్​కు చెందిన కిరణ్​కుమార్​, కేపీహెచ్​బీకాలనీకి చెందిన కృష్ణకాంత్​రెడ్డి, ఎస్​ఆర్​నగర్​లో ఉండే ఆర్. గోపాలకృష్ణ, కొండాపూర్​కు చెందిన రాజేష్​గౌడ్​, యూసుఫ్​గూడకు చెందిన దేవేందర్​రెడ్డి, బాచుపల్లికి చెందిన కృష్ణసాయి, బాలానగర్​కు చెందిన రాఘవేంద్రగుప్తా,  కూకట్​పల్లికి చెందిన షేక్​బాబా గౌస్ , నిర్మల్​జిల్లా కడెంకు చెందిన మధుకర్ ను మీడియేటర్లుగా పెట్టుకున్నారు. కన్సల్టెన్సీ ద్వారా ఫేక్​ స్టడీ సర్టిఫికెట్లను తయారు చేసి ఈ మీడియేటర్ల నుంచి అవరమున్న వాళ్లకు వాటిని అమ్మేవారు. డిగ్రీ సర్టిఫికెట్ కు రూ.60 వేలు, బీటెక్ సర్టిఫికెట్ కు రూ.2 లక్షల 50 వేలు వసూలు చేసేవారు. సర్టిఫికెట్​ కావల్సిన వారికి వారు ఉండే అడ్రస్​కు పోస్టు ద్వారా పంపించేవారు. 

ఇలా దొరికిన్రు 

ఏపీలోని వెస్ట్ గోదావరి జిల్లా భీమడోలు ప్రాంతానికి చెందిన ఎం. వెంకటేశ్వరరావు 3 నెలల కిందట సిటీకి వచ్చి కేపీహెచ్ బీలోని ఓ హాస్టల్ లో ఉంటున్నాడు.  తాను ఇంటర్​ వరకు చదినానని, తనకు జాబ్​ కావాలని  వెంకటేశ్వర్​రావు  హాస్టల్​ ఓనర్​ కృష్ణకాంత్​రెడ్డిని అడిగాడు. ఫేక్ సర్టిఫికెట్ల గ్యాంగ్ లో మీడియేటర్ గా ఉన్న కృష్ణకాంత్..  ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికెట్ ఇప్పిస్తానని ఎం. వెంకటేశ్వరరావుకు చెప్పాడు.  ఇందుకోసం మరో మీడియేటర్  బొక్క వెంకటేశ్వరరావును కలవాలన్నాడు. కొన్ని రోజుల్లో మంచి యూనివర్సిటీ నుంచి డిగ్రీ సర్టిఫికెట్ ఇప్పిస్తామని చెప్పి మీడియేటర్లు ఇద్దరు ఎం. వెంకటేశ్వరరావు నుంచి రూ.90 వేలు తీసుకున్నారు. కొన్నిరోజుల తర్వాత యూపీలోని మీరట్ లో ఉండే చౌదరి చరణ్ సింగ్ వర్సిటీ నుంచి ఎం. వెంకటేశ్వరరావు పేరుతో బీకామ్ సర్టిఫికెట్ కొరియర్ ద్వారా వచ్చింది. సర్టిఫికెట్ గురించి అతడు ఆరాతీయగా అది ఫేక్ అని తెలిసింది. దీంతో ఎం. వెంకటేశ్వర​రావు కేపీహెచ్ బీ పోలీసులకు కంప్లయింట్ చేశాడు. మాదాపూర్ జోన్ ఎస్ వోటీ, కేపీహెచ్ బీ పోలీసులు దర్యాప్తులో భాగంగా హాస్టల్ ఓనర్, మీడియేటర్ కృష్ణకాంత్ రెడ్డి, బొక్క వెంకటేశ్వర్ రావును అదుపులోకి తీసుకుని విచారించడంతో ఫేక్ సర్టిఫికెట్ల దందా బయటపడింది. ప్రధాన నిందితుడు కోట కిశోర్ తో పాటు అతడి గ్యాంగ్ కు చెందిన 10 మంది మీడియేటర్లను అరెస్ట్ చేశారు. వెస్ట్​ బెంగాల్​కు చెందిన సంజయ్​, రాహుల్​, ప్రతిమా పాటిల్​ పరారీలోఉన్నట్లు సీపీ రవీంద్ర తెలిపారు. ఈ గ్యాంగ్ నుంచి ఫేక్ సర్టిఫికెట్లు తీసుకున్న వారు ప్రస్తుతం ప్రైవేటు కంపనీల్లో, విదేశాల్లో జాబ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించామన్నారు.  ప్రధాన నిందితుడు కిశోర్ నుంచి 70 ఫేక్​ ఎడ్యుకేషనల్​ సర్టిఫికెట్లు, వివిధ వర్సిటీలకు చెందిన 4 ఫేక్​ స్టాంప్స్​, 18 వర్సిటీలకు చెందిన 25  డిగ్రీ, పీజీ, బీటెక్​ కొటేషన్​ చాట్​లు, వర్సిటీల లోగోలు, వీసీ స్టాంప్​ ప్యాడ్స్​, సెల్​ఫోన్లు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నామన్నారు. సమావేశంలో ఎస్​వోటీ ఏడీసీపీ నారాయణ, ఎస్​వోటీ మాదాపూర్​ జోన్​ ఇన్​స్పెక్టర్​, కేపీహెచ్​బీ ఇన్​స్పెక్టర్​, సిబ్బంది పాల్గొన్నారు.