హనుమకొండ కలెక్టరేట్​ గేటుకు మళ్లీ ఇనుప ముళ్ల కంచెలు

హనుమకొండ కలెక్టరేట్​ గేటుకు మళ్లీ ఇనుప ముళ్ల కంచెలు

మళ్లీ ఇనుప ముళ్ల కంచెలు
హనుమకొండ కలెక్టరేట్​ గేటుకు ఏర్పాటుపై తెలంగాణవాదుల ఆగ్రహం  

హనుమకొండ, వెలుగు : ఉద్యమకాలంలో తెలంగాణ వ్యాప్తంగా రోడ్లపై, ప్రభుత్వ ఆఫీసుల ఎదుట కనిపించిన ఇనుప ముళ్ల కంచె మళ్లీ తెరమీదకు వచ్చింది. టీఎస్​పీఎస్సీ పేపర్​లీక్​పై నిరసనగా ఈ నెల18న బీజేపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు హనుమకొండ కలెక్టరేట్ గేట్ వద్ద ముళ్లకంచె ఏర్పాటు చేశారు. వివిధ అవసరాల నిమిత్తం కలెక్టరేట్​కు వచ్చేవాళ్లు .. లోనికి వెళ్లకుండా ఇనుప ముళ్ల కంచెలు పెట్టడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

సమైక్య పాలనలో ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ తో రోడ్డెక్కిన ఉద్యమకారులను అడ్డుకునేందుకు వాడిన వాటిని భద్రత పేరుతో మళ్లీ తీసుకురావడం ఏమిటని తెలంగాణవాదులు మండిపడుతున్నారు. ఉద్యమ కాలంలో తమ రక్తం కళ్లజూసిన ఇనుప ముళ్ల కంచెలను రాష్ట్రం వచ్చిన తొమ్మిదేండ్ల తరువాత మళ్లీ చూడాల్సిన పరిస్థితి వచ్చిందని వాపోయారు. ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చకపోవడం, ప్రభుత్వ వైఫల్యాల వల్లే ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు ప్రభుత్వంపై ఆందోళనలకు దిగుతూ రోడ్డెక్కుతున్నాయని కేయూ ప్రొఫెసర్ తిరునహరి శేషు అన్నారు. ప్రభుత్వం సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టకుండా ముళ్ల కంచెల ఏర్పాటు వంటి చర్యలతో ప్రజా పోరాటాలను అణచివేసేందుకు సిద్ధమవుతోందని విమర్శించారు.