చిన్నప్పటి జ్ఞాపకాలు ఎందుకు యాదికుండవంటే..

చిన్నప్పటి జ్ఞాపకాలు ఎందుకు యాదికుండవంటే..
  • ఎపిసోడిక్ మెమరీని ఎన్ కోడ్ చేయలేకపోవడమే కారణం
  • ఏడాది వయసు తర్వాతే ఈ శక్తి క్రమంగా పెరుగుతది
  • అందుకే మూడేండ్లలోపు జ్ఞాపకాలు అంతగా గుర్తుండవ్ 
  • యేల్ యూనివర్సిటీ సైంటిస్టుల స్టడీలో వెల్లడి 

వాషింగ్టన్: చిన్నప్పుడు బుడి బుడి అడుగులు వేస్తూ, ముద్దు ముద్దు మాటలు పలికిన సంగతులు పెద్దయిన తర్వాత దాదాపు ఎవరికీ యాదికి ఉండవు. సాధారణంగా మూడేండ్లలోపు తమ బాల్యంలో జరిగిన విషయాలేవీ మనకు గుర్తుకురావు. దీనినే ‘ఇన్ఫాంటైల్ ఆమ్నీషియా (శైశవ దశలోని జ్ఞాపకాలను మరిచిపోవడం)’గా చెప్తుంటారు. పెరిగి పెద్దయిన తర్వాత దాదాపు అన్ని విషయాలనూ గుర్తుపెట్టుకునే మనం.. చిన్నప్పుడు ముఖ్యంగా మూడేండ్లలోపు జరిగిన విషయాలను ఎందుకు యాదికి తెచ్చుకోలేకపోతున్నామన్నది సైంటిస్టులకు ఎప్పటినుంచో మిస్టరీగా మిగిలిపోయింది. 

అయితే, మన మెదడులోని హిప్పోక్యాంపస్ భాగంలో స్టోర్ అయ్యే ఎపిసోడిక్ మెమరీలను ఎన్ కోడ్ చేసి, తిరిగి రీకాల్ చేసుకునే వ్యవస్థ చిన్నప్పుడు ముఖ్యంగా ఏడాదిలోపు వయసులో ఇంకా అభివృద్ధి చెందకపోవడమే అందుకు కారణమని తాజాగా అమెరికాలోని యేల్ యూనివర్సిటీ సైంటిస్టులు కనుగొన్నారు. ఏడాది వయసు తర్వాత ఎపిసోడిక్ మెమరీ (తర్వాత గుర్తుకు తెచ్చుకునేందుకు వీలుగా జ్ఞాపకాలు స్టోర్ కావడం)ని ఎన్ కోడ్ చేసే వ్యవస్థ హిప్పోక్యాంపస్ లో అభివృద్ధి చెందుతున్నప్పటికీ, వీటిని రీకాల్ చేసుకునే వ్యవస్థ మాత్రం మూడేండ్లలోపు డెవలప్ కావడంలేదని గుర్తించారు. 

రీసెర్చ్ లో భాగంగా సగం మంది ఏడాదిలోపు, మిగతా సగం మంది ఏడాదికిపైగా వయసులో ఉన్న 26 మంది శిశువులను వాలంటీర్లుగా ఎంపిక చేశారు. వీరందరికీ కొన్ని వందలసార్లు రకరకాల శబ్దాలు, ముఖాలు, ఫొటోలు, వస్తువులను విడతలవారీగా చూపిస్తూ ఎఫ్ఎంఆర్ఐ స్కానింగ్​లు చేశారు. స్కానింగ్ చిత్రాల ఆధారంగా వీరి మెదడులోని హిప్పోక్యాంపస్ లో యాక్టివిటీ స్థాయిలను పరిశీలించారు. 

దీంతో హిప్పోక్యాంపస్​లో యాక్టివిటీస్ స్థాయిలను బట్టి.. ఏడాది వయసులోపు పిల్లల్లో ఎపిసోడిక్ మెమరీ ఎన్​కోడ్ కావడంలేదని, మిగతా వారిలో ఎన్​కోడ్ అవుతున్నా.. రీకాల్ వ్యవస్థ రూపుదిద్దుకోలేదని గుర్తించారు. అయితే, ఈ అంశంపై మరింత విస్తృతంగా పరిశోధనలు జరగాల్సి ఉందని సైంటిస్టులు వెల్లడించారు. వీరి రీసెర్చ్ వివరా లు ఇటీవల ‘సైన్స్’ జర్నల్​లో పబ్లిష్ అయ్యాయి.