తెలంగాణలో కిలో ఎల్లిగడ్డ రూ. 350

తెలంగాణలో కిలో ఎల్లిగడ్డ రూ. 350
  •     140 రూపాయలు పలుకుతున్న అల్లం ధర
  •     రూ.50లకు దిగిరాని ఉల్లి రేటు

హైదరాబాద్, వెలుగు :  మార్కెట్​లో ఉల్లి, అల్లం వెల్లుల్లి ధరలు ఘాటెక్కిస్తున్నాయి. ప్రతి కూరలో, ఇతర అవసరాలకూ ఇండ్లల్లో వెల్లుల్లి(ఎల్లిగడ్డ)ని ఎక్కువగా వినియోగిస్తాం. అందుకు తగ్గట్టుగానే దాని ధర సైతం పెరుగుతోంది. నెల రోజుల క్రితం కిలో వెల్లుల్లి100 రూపాయలు పలికింది. ప్రస్తుతం హోల్​సేల్​ మార్కెట్​లోనే కిలో 300 రూపాయలకు చేరింది. రిటైల్​ మార్కెట్​లో మాత్రం 350 రూపాయలు పలుకుతోంది. హైదరాబాద్​సిటీలోని ప్రధాన హోల్​సేల్​ మార్కెట్లు అయిన ఉస్మాన్​గంజ్​, మలక్​పేట మార్కెట్లకు వెల్లుల్లి సరఫరా తగ్గినట్టు అధికారులు తెలిపారు.

వారం రోజుల క్రితం రాష్ట్రంలో ఏర్పడిన తుఫాన్​ కారణంగా పెద్ద సంఖ్యలో పంట నష్టం జరిగిందని పేర్కొన్నారు. సిటీ మార్కెట్​కు ప్రధానంగా తెలంగాణలోని కోహిర్​ నుంచే పెద్దయెత్తున సరుకు వస్తుంది. రాజస్థాన్​, మహారాష్ట్ర నుంచి కూడా కొంత వస్తుంది. నెల రోజుల క్రితం మార్కెట్​కు రోజుకు 30 నుంచి 50 లారీల వెల్లుల్లి దిగుమతి కాగా.. ప్రస్తుతం 20 నుంచి 25 లారీలు మాత్రమే వస్తున్నదని హైదరాబాద్​ మార్కెట్​ కమిటీ అధికారి ఒకరు తెలిపారు. ఈ కారణంగానే మార్కెట్​లో వెల్లుల్లి ధర పెరిగినట్టు అధికారులు తెలిపారు.

వర్షాలతో తగ్గిన అల్లం దిగుబడి

 వెల్లుల్లితో పాటు వినియోగించే అల్లం ధర కూడా పెరిగింది. నెల రోజుల క్రితం కిలో అల్లం ధర 50 నుంచి 70 రూపాయలు పలుకగా.. ప్రస్తుతం 100 నుంచి 150 రూపాయలకు అమ్ముతున్నారు. హోల్​సేల్​ మార్కెట్​లో కిలో అల్లం 80 నుంచి 100 రూపాయలు పలుకుతోంది. నిత్యం వినియోగించే కూరల్లో తప్పని సరిగా వినియోగించే అల్లం, వెల్లుల్లి అధికంగా హోటళ్లకు సరఫరా అవుతోంది. ఈ కారణంగా కూడా సాధారణ ప్రజలకు ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. ప్రస్తుతం చాలా జిల్లాల్లో వర్షాలు కురుస్తుండడం వల్ల కూడా అల్లం దిగుబడి తగ్గినట్టు వ్యాపారులు చెబుతున్నారు. 

దిగుమతి తగ్గడంతో పెరిగిన ఉల్లి ధర

వంటల్లో ప్రతి రోజూ వినియోగించే వాటిలో ఉల్లిగడ్డ ముఖ్యమైనది. ప్రస్తుతం హైదరాబాద్​ సిటీలోని హోల్​సేల్​ మార్కెట్లలో క్వింటాల్​ ఉల్లిగడ్డ ధర 3 వేల నుంచి 3,500 రూపాయలు పలుకుతోంది. రిటైల్​ వ్యాపారులు మాత్రం కిలో ఉల్లిగడ్డ 50 రూపాయల నుంచి 60 రూపాయలకు అమ్ముతున్నారు. గత కొంతకాలంగా మహారాష్ట్ర నుంచి ఉల్లిగడ్డ దిగుమతి తగ్గడం వల్ల ధర పెరిగినట్టు అధికారులు చెప్తున్నారు. అయితే, ఈ నెలాఖరులో కొత్త పంట మార్కెట్​కు వస్తుందని, ధర తగ్గే అవకాశం ఉందని సికింద్రాబాద్​ హోల్ సేల్​ గ్రెయిన్​ మర్చంట్స్​ అసోసియేషన్​ నాయకుడు ఒకరు వెల్లడించారు.