
- 2021–22 లో గ్రోత్ రేటు 10.5%
- కన్జూ మర్ల కోసం ఒకటే రిడ్రెస్సల్ అంబుడ్స్‌మన్
- ప్రకటించిన ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ
న్యూఢిల్లీ: వరసగా నాలుగో మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) మీటింగ్‌లోనూ కీలక వడ్డీ రేట్లను ఆర్‌బీఐ మార్చలేదు. కానీ, ఎకానమీకి అవసరమనిపిస్తే రేట్లను తగ్గించడానికి రెడీగా ఉన్నామనే సంకేతాలను ఇచ్చింది. ఎటువంటి మార్పులు లేకపోవడంతో రెపో రేటు 4 శాతం వద్ద, రివర్స్ రెపో రేటు 3.35 శాతం వద్ద కొనసాగుతున్నాయి. రెపో రేటు అంటే కమర్షియల్ బ్యాంకులకు ఇచ్చిన అప్పులపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీ. రివర్స్ రెపో రేటు అంటే బ్యాంకులు ఆర్‌బీఐ దగ్గర డబ్బులు పెట్టి వడ్డీని పొందడం. రెపో రేటును మార్చకపోవడంపై ఆరుగురు మెంబర్లు కలిగిన ఎంపీసీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుందని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ అన్నారు. 2021–22 లో జీడీపీ వృద్ధి రేటు 10.5 శాతానికి పెరుగుతుందని అంచనావేశారు. దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావాన్ని తగ్గించేందుకు, కన్జూమర్ డిమాండ్‌ను పెంచేందుకు అవసరమనుకుంటే వడ్డీ రేట్లను తగ్గిస్తామనే సంకేతాలను ఆర్‌బీఐ ఎంపీసీ ఇచ్చింది. ఇన్‌ఫ్లేషన్‌ను టార్గెట్‌లోపే ఉంచుతూ ఈ రేట్లను తగ్గింపును చేపడతామని తెలిపింది. ఎకానమీ గ్రోత్‌కు ఊతమిచ్చేందుకు ఆర్‌బీఐ కిందటేడాది మార్చి నుంచి రెపో రేటులో115 బేసిస్ పాయింట్లను తగ్గించింది. చివరి సారిగా మే 22 న కీలక వడ్డీ రేట్లను సవరించిన ఆర్‌బీఐ ఎంపీసీ, ఆ తర్వాత నాలుగు సార్లు సమావేశమయినా వడ్డీ రేట్లలో మార్పులు చేయలేదు. ఆర్‌బీఐ ఎంపీసీ మీటింగ్ ఈ నెల 3 న స్టార్ట్‌యి, శుక్రవారం క్లోజయ్యింది.
చెక్ క్లియరింగ్ సిస్టమ్ మెరుగ్గా…
పేమెంట్స్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్‌ను మరింత మెరుగుపరిచేందుకు సీటీఎస్‌కు వెలుపల పనిచేస్తున్న 18,000 బ్రాంచులు ఈ సిస్టమ్ కిందకు సెప్టెంబర్‌లోపు తీసుకొస్తామని ఆర్‌బీఐ ప్రకటించింది. 2010 లో ఏర్పడిన చెక్ ట్రన్కేషన్ సిస్టమ్(సీటీఎస్) ప్రస్తుతం 1.5 లక్షల బ్రాంచులను కవర్ చేస్తోంది. 1,219 నాన్ సీటీఎస్ క్లియరింగ్ సంస్థలు కూడా సీటీఎస్‌లో కలిసిపోయాయి. పేపర్ బేస్డ్ పేమెంట్స్‌ను క్లియర్ చేయడంలో సామర్ధ్యాన్ని పెంచేందుకు సీటీఎస్‌కు వెలుపల ఉన్న బ్రాంచులను సీటీఎస్ కిందకు తెస్తున్నామని ఆర్‌బీఐ ప్రకటించింది.
వన్ నేషన్ వన్ అంబుడ్స్‌మన్..
కన్జూమర్లకు సాయపడేందుకు డిజిటల్ పేమెంట్స్‌కు సంబంధించి 24×7 హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపింది. కన్జూమర్ల సమస్యలను(గ్రీవెన్స్‌లను) పరిష్కరించేందుకు ఒక అంబుడ్స్‌మన్(పరిష్కరించే సంస్థ) కిందకు తీసుకొస్తామని ఆర్‌బీఐ ప్రకటించింది. ప్రస్తుతం బ్యాంకింగ్, నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు, డిజిటల్ ట్రాన్సాక్షన్లకు సంబంధించిన కన్జూమర్ల గ్రీవెన్స్‌లను పరిష్కరించేందుకు ముగ్గురు అంబుడ్స్‌మన్‌లు పనిచేస్తున్నారు. వీటిని కలిపి ‘వన్ నేషన్ వన్ అంబుడ్స్‌మన్’ ను క్రియేట్ చేయనున్నామని పేర్కొంది. ఈ స్కీమ్ జూన్ నుంచి అమల్లోకి రానుంది.
ప్రభుత్వ బాండ్లను డైరక్ట్‌గా కొనొచ్చు..
ప్రభుత్వ సెక్యూరిటీలను రిటైల్ ఇన్వెస్టర్లు డైరక్ట్‌గా కొనుగోలు చేసేందుకు ఆర్‌బీఐ అనుమతిచ్చింది. ఇది బాండ్ మార్కెట్ బలపడడానికి సాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వానికి నిధుల సేకరణ సులభమవుతుందని పేర్కొన్నారు. ఫైనాన్షియల్ సంస్థలకు సంబంధించి క్యాష్ రిజర్వ్ రేషియో(సీఆర్‌ఆర్) రూల్స్‌ను రెండు దశల్లో తిరిగి సాధారణ స్థాయికి తీసుకురావాలని ఆర్‌బీఐ నిర్ణయించుకుంది. సీఆర్‌ఆర్ 3.5 శాతంగా ఉండడం మార్చి 27,2021 నుంచి అమల్లోకి వస్తుంది. మే 22 నుంచి సీఆర్‌ఆర్‌ను 4 శాతానికి పెంచాల్సి ఉంటుంది. క్యాపిటల్ కన్సర్వేషన్ బఫ్ఫర్(సీసీబీ) చివరి విడతను ఫైనాన్షియల్ సంస్థలు చేరుకోవడానికి డెడ్‌లైన్, నెట్ స్టేబుల్ ఫండింగ్ రేషియో అమలును ఆర్‌బీఐ మరో 6 నెలలు పొడిగించింది. కరోనా టైమ్‌లో తీసుకున్న రెగ్యులేటరీ చర్యలలో భాగంగా చివరి విడత సీసీబీ అయిన 0.625 శాతాన్ని ఫైనాన్షియల్ సంస్థలు ఏప్రిల్ 1, 2021 లోపు చేరుకోవాలి. దీన్ని అక్టోబర్ వరకు ఆర్‌బీఐ పొడిగించింది. ఆన్‌ట్యాప్ టీఎల్‌టీఆర్‌ఓ స్కీమ్‌ను ఎన్‌బీఎఫ్‌సీ సెక్టార్‌కు ఆర్‌బీఐ పొడిగించింది.
క్యూ4 లో ఇన్‌ఫ్లేషన్ 5.2 శాతం..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి క్వార్టర్‌లో ఇన్‌ఫ్లేషన్ 5.2 శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ అంచనావేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో ఇన్‌ఫ్లేషన్ 5 నుంచి 5.2శాతంగా ఉంటుందని లెక్కించింది. కూరగాయల ధరలు మరింత తగ్గుతాయని సెంట్రల్ బ్యాంక్ అభిప్రాయపడింది. కరోనా సంక్షోభంతో కిందటేడాది జూన్ క్వార్టర్ నుంచి సీపీఐ ఇన్‌ఫ్లేషన్ 6 శాతానికి పైనే ఉందని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. మొదటి సారిగా డిసెంబర్ క్వార్టర్‌లో ఇన్‌ఫ్లేషన్ 6 శాతానికి దిగువన నమోదయ్యిందని పేర్కొన్నారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో కూరగాయల ధరలు తగ్గాయని పేర్కొన్నారు. కొన్ని ఫుడ్ ఐటెమ్స్ ధరలు పెరిగే అవకాశాలున్నప్పటికీ, సప్లయ్ పెరగడంతో కూరగాయల ధరలు మాత్రం పెరగకపోవచ్చని ఆర్‌బీఐ అంచనావేస్తోంది. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతుండడంతో పాటు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నుల వలన పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయని దాస్ అన్నారు. దీంతో సర్వీస్, మాన్యుఫాక్చరింగ్ సెక్టార్లలో కూడా ధరల పెరుగుదల కనిపిస్తోందని చెప్పారు. వీటన్నిటిని పరిగణనలోకి తీసుకొనే ఇన్‌ఫ్లేషన్ 2020–21 క్యూ4 లో 5.2 శాతంగా, 2021–22లోని మొదటి ఆరు నెలల్లో 5–5.2 శాతంగా, 2021–22 క్యూ3లో 4.3 శాతంగా ఉంటుందని లెక్కించామని పేర్కొన్నారు.
డిజిటల్ కరెన్సీపై వర్క్ జరుగుతోంది..
డిజిటల్ కరెన్సీని తీసుకురావడంపై ఆర్‌బీఐ ఇంటర్నల్ కమిటీ పనిచేస్తోందని సెంట్రల్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ బీపీ కనుంన్గ్ అన్నారు. బిట్‌కాయిన్ లాంటి క్రిప్టో కరెన్సీని తీసుకురావాలని అనుకుంటున్నామని ఆర్‌బీఐ గతంలోనే ప్రకటించింది. గత వారం ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలను సెంట్రల్ బ్యాంక్ బ్యాన్ చేసిన విషయం తెలిసిందే.
ప్రభుత్వానికి ఆర్‌బీఐ నుంచి రూ. 12 లక్షల కోట్లు..
వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి అవసరమయ్యే రూ. 12 లక్షల కోట్ల అప్పులను ఆర్‌బీఐ అందించగలదని దాస్ పేర్కొన్నారు. ఎటువంటి అడ్డంకి లేకుండా ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో నిధులను అందించగలమని చెప్పారు. ప్రభుత్వానికి అప్పులను అందిస్తున్న సంస్థగా, బడ్జెట్‌కు ముందే ఫైనాన్స్ మినిస్ట్రీతో బారోవింగ్స్ గురించి చర్చించామని అన్నారు. కరోనా వలన రెవెన్యూ పడిపోవడంతో ఎఫ్‌ఆర్‌బీఎం టార్గెట్‌ను మించి ప్రభుత్వం అప్పులు చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
సరియైన బడ్జెట్‌కు తోడు సరియైన పాలసీ: ఎస్‌బీఐ