
- 25 మంది సిట్టింగ్స్‌కు నో టికెట్!
- 90% మంది క్యాండిడేట్లు ఖరారు
- వెంటాడుతున్న వలసల భయం
- రెబల్స్‌ను బుజ్జగించే పని మంత్రులు, ఎమ్మెల్యేలకు..
హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి రెబల్స్ పెద్ద తలనొప్పిగా మారనున్నారు. టికెట్ దక్కదనే సమాచారం ఉన్నవారు పార్టీ నిర్ణయాన్ని ధిక్కరిస్తూ పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. టికెట్ రాకపోతే బీజేపీలోకి వెళ్లేందుకు సిట్టింగ్ కార్పోరేటర్లు రంగం సిద్ధం చేసుకుంటున్నరు. దీంతో టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు రెబల్స్, అసంతృప్తులను బుజ్జగించే బాధ్యతలు అప్పగించాలని చూస్తోంది.
బుధవారం తెలంగాణ భవన్ లో జరుగనున్న పార్టీ లెజిస్లేచర్ మీటింగ్ లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గెలుపు వ్యూహాలను ఎన్నికల ఇన్‌చార్జీలకు సీఎం కేసీఆర్ వివరించనున్నారు. మరోవైపు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు కొలిక్కి వచ్చింది. వివాదం లేని చోట నామినేషన్లు వేసేందుకు రెడీగా ఉండాలని అభ్యర్థులకు ఫోన్ చేసి చెప్తున్నట్టు తెలిసింది. పనితీరు సరిగా లేని, వివాదాలున్న 25 నుంచి 30 మంది సిట్టింగ్ లను తప్పించి మిగతా చోట్ల పాత వారికే టికెట్ ఇచ్చే చాన్స్ ఉంది. వివాదం లేని డివిజన్ల అభ్యర్థుల పేర్లను బుధవారం లేదా గురువారం ప్రకటించే చాన్స్ ఉంది. వివాదం ఉన్న చోట్ల నామినేషన్ల పరిశీలన రోజున బీ– ఫామ్ ఇవ్వాలని పార్టీ భావిస్తోంది.
వలసల భయం
టికెట్ దక్కని వారు బీజేపీలో చేరుతారనే భయం టీఆర్ఎస్ నేతలను వెంటాడుతోంది. ఒక్కో డివిజన్లో టికెట్ కోసం నలుగురి నుంచి 10 మంది వరకు పోటీ పడుతున్నారు. టికెట్ దక్కకపోతే బీజేపీలో చేరి పోటీ చేసే చాన్స్ ఉంది. ఒకవేళ అక్కడ టికెట్ రాకపోతే రెబల్ గా పోటీ చేసి పార్టీ అభ్యర్థిని ఓడించాలని పట్టుదలగా మెజార్టీ మంది ఆశావాహులు ఉన్నారు. దీంతో రెబల్స్ బెడద లేకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు చొరవ తీసుకోవాలని పార్టీ ఆదేశించినట్టు తెలిసింది. రెబల్స్ ను దారిలోకి తెచ్చుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలని పార్టీ పెద్దలు భావిస్తున్నట్టు తెలిసింది. ముందుగా బుజ్జగించాలని, లేకపోతే ఇతర పద్ధతుల్లో దారిలోకి తెచ్చుకునేందుకు వెనకాడొద్దని ఆలోచనగా ఉన్నట్టు పార్టీ లీడర్లు చెప్తున్నారు.
పార్టీ భవిష్యత్ నిర్ధారించే ఎన్నికలు
జీహెచ్ఎంసీ ఎన్నికలు పార్టీ భవిష్యత్ ను నిర్దారించేవిగా టీఆర్ఎస్ పెద్దలు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో కంటే తక్కువ డివిజన్లలో గెలిస్తే పార్టీ పరువు పోతుందని టెన్షన్ పడుతున్నరు. ఇప్పటికే దుబ్బాక ఓటమితో పార్టీ పట్ల ప్రజాదరణ తగ్గుతోందని ప్రచారం జరుగుతోంది. జీహెచ్ఎంసీలో తక్కువ డివిజన్లలో గెలిస్తే భవిష్యత్ లో పార్టీకి పెను ప్రమాదం వాటిల్లుతుందనే భయం పట్టుకుంది. అందుకని ఏంచేసైనా సరే ఎక్కువ స్థానాల్లో విజయం సాధించేందుకు వ్యూహాలు రూపొందిస్తున్నారు. బీజేపీని ఎట్ల ఎదుర్కోవాలనే అంశంపై లీడర్లకు సీఎం కేసీఆర్ లెజిస్లేచర్ మీటింగ్ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రతి ఒక్కరికి ఎన్నికల బాధ్యతలు అప్పగించి, అక్కడ అభ్యర్థి గెలపు కోసం కష్టపడాలని కోరనున్నారు. ఈ ఫలితాల ఆధారంగానే పార్టీ,లీడర్ల భవిష్యత్ ఆధారపడి ఉంటుందని హెచ్చరించే చాన్స్ ఉంది.