ఈ ఫలితాలతో దేశ రాజకీయాల్లో మార్పొస్తది

ఈ ఫలితాలతో దేశ రాజకీయాల్లో మార్పొస్తది

నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆసక్తి రేపాయి. ఈ ఫలితాలు దేశ రాజకీయాలను ప్రభావితం చేయడంతో పాటు గొప్ప మార్పును తీసుకురానున్నాయి. తాను పోటీ చేసిన నందిగ్రామ్ ​సీటులో బెంగాల్​ సీఎం మమతా బెనర్జీ ఓడిపోవడం ఆమెకు పెద్ద షాకే. మమత వ్యక్తిగత ఓటమి బీజేపీకి మంచి అవకాశమే. తమ పార్టీ ఓడినా, ఈ ఎన్నికల్లో మమతను బెంగాలీ ప్రజలు తిరస్కరించారని చెప్పడానికి వారికి అవకాశం దొరికింది. ఇది బీజేపీ బెంగాల్​లో తన పోరాటాన్ని కొనసాగించడానికి ఉపయోగ పడుతుంది. ఇక తమిళనాడులో స్టాలిన్​ శకం మొదలు కానుంది. తొలిసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న ఆయన రాష్ట్రాన్ని ఎలా నడిపిస్తారనేది ఆసక్తికరం. కర్నాటక తర్వాత తొలిసారి మరో దక్షిణాది రాష్ట్రంలో బీజేపీ పవర్ లోకి రానుంది. పుదుచ్చేరిలో బీజేపీ భాగస్వామిగా అధికారం చేపట్టనుంది. మొత్తంగా చూస్తే ఈ ఎన్నికల్లో అనూహ్యమైన మార్పులేవీ కనిపించలేదు.

పశ్చిమబెంగాల్​లో సీఎం మమతా బెనర్జీ సొంత సీటులో ఓడిపోవడమే బీజేపీ సాధించిన అతి పెద్ద విజయం. బెంగాల్​ మమత, బీజేపీ మధ్య తీవ్ర స్థాయిలో పోరాటం సాగింది. బెంగాల్​లో బీజేపీ దూకుడుగా ముందుకెళ్లింది. ఆ పార్టీ లీడర్లు ఓపెన్​గానే తాము అధికారంలోకి వస్తామని స్టేట్​మెంట్లు ఇచ్చారు. అయితే చివరికి ఈ పోరాటంలో మమతా బెనర్జీనే విజయం సాధించారు. అయితే బెంగాల్​లోని మొత్తం 294 అసెంబ్లీ సీట్లకు గానూ 2016లో 3 చోట్ల గెలిచిన బీజేపీ ఈసారి 70 సీట్లను క్రాస్​ చేసింది. ఇది బీజేపీ వరకూ అద్భుతమైన పర్ఫార్మెన్సే. ఈ ఎన్నికల్లో బెంగాల్​ ప్రజలు మమతను వద్దని తిరస్కరించారు. అదే సమయంలో ఆమె పార్టీకి మాత్రం కావాలని మెజారిటీ సీట్లు కట్టబెట్టారు. ఈ పరిస్థితుల్లో మమత కాకుండా మరొకరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినట్లయితే అది కచ్చితంగా బీజేపీని కొంత వరకూ సంతృప్తి పరుస్తుంది. అలాగే ఆ పార్టీ లీడర్​ సువేందు అధికారిని ఈ ఎలక్షన్  స్టార్​ను చేస్తుంది. సువేందు అధికారి బెంగాల్​ చరిత్రలోనే ఒక జయంట్​ కిల్లర్​గా నిలిచిపోతారు. అయితే పార్టీ కోరుకుంటే తాను సీఎం పదవి చేపడతానని మమత చెబుతున్నారు. ఒకవేళ ఆమె సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తే ఆరు నెలల్లో ఏదో ఒక అసెంబ్లీ సీటు నుంచి గెలవాల్సి వస్తుంది. రాజ్యాంగం ప్రకారం ఇలా చేయడం తప్పు కాకపోయినా.. నైతిక పరంగా చూస్తే మాత్రం ఇది కరెక్ట్​ కాదని చెప్పవచ్చు.
ఇక మొత్తం బెంగాల్​ ఓటర్లలో మైనార్టీలు 30 శాతం. ఈ ఎన్నికల్లో వీరందరూ గంపగుత్తగా మమతా బెనర్జీ కే ఓటు వేసినట్టు ఫలితాలు వెల్లడిస్తున్నారు. అందువల్లే ఈసారి తృణమూల్​ కాంగ్రెస్​ విజయం సాధించగలిగింది. ఇదే సమయంలో మెజారిటీ కమ్యూనిటీల ఓట్లను భారీగా బీజేపీ పొందింది. అందువల్ల బెంగాల్​లో స్ట్రగుల్​ ఇంకా కొనసాగే అవకాశం ఉంది. మమతా బెనర్జీ బెంగాల్​లో గెలిచినా.. బీజేపీ పూర్తిగా ఓడిపోలేదు. మమత వ్యక్తిగత ఓటమి ఆ పార్టీని శాటిస్​ఫై చేసే అంశమే.
కేరళలో ఓటమితో గాంధీలకు ఇబ్బందులు
40 ఏండ్లుగా కేరళలో ఒక ప్రభుత్వం ఐదేండ్లు మాత్రమే అధికారంలో ఉంటూ వస్తోంది. ఒకసారి అధికారం, ఆ తర్వాత టర్మ్​లో ఓటమి ఇలా ఉండేది. అయితే, ఇలాంటి పరిస్థితుల్లో పినరయి విజయన్​ వరుసగా రెండోసారి అధికారం చేజిక్కించుకోవడం ఒక రికార్డే. 2019 లోక్​సభ ఎన్నికల్లో మొత్తం 20 ఎంపీ సీట్లకుగానూ కాంగ్రెస్​ కూటమి 19 చోట్ల విజయం సాధించింది. రాహుల్​గాంధీ ఇక్కడి నుంచే ఎంపీగా కొనసాగుతున్నారు. అందువల్ల ఈసారి కాంగ్రెస్​ పార్టీ సులువుగా విజయం సాధిస్తుందని అంతా అంచనా వేశారు. అందువల్ల గాంధీస్ వేరే ఏ కాంగ్రెస్​ నేతను ఇక్కడ ప్రచారం చేసేందుకు అనుమతించలేదు. ఎందుకంటే ఒకవేళ అక్కడ గెలిస్తే అది తమ ఘనతగా చెప్పుకోవాలని భావించారు. కానీ, ఇప్పుడు ఆ పార్టీ ఓటమి పాలవ్వడంతో బాధ్యత మొత్తం గాంధీలపైనే పడనుంది. కాంగ్రెస్ పార్టీ ఓటమితో గాంధీ ఫ్యామిలీకి కూడా ఇబ్బందులు తప్పకపోవచ్చు.
అస్సామీల భయమే బీజేపీకి కలిసివచ్చింది
అస్సాంలో 2016 నుంచి బీజేపీనే అధికారంలో ఉంది. అస్సాం జనాభాలో మైనార్టీలు 37 శాతం. ఈసారి మొత్తం మైనార్టీలంతా బీజేపీకి వ్యతిరేకంగా ఓటేశారు. అయితే మెజారిటీ అస్సామీ ప్రజలు మాత్రం బీజేపీకి అనుకూలంగానే ఉన్నారు. కాంగ్రెస్​ పార్టీ మైనార్టీ పార్టీలతో కూటమిని ఏర్పాటు చేసినా ఓటమి తప్పలేదు. బంగ్లాదేశ్​నుంచి అక్రమ వలసలు, చొరబాట్లను నియంత్రిస్తామన్న బీజేపీకే అస్సామీ జనాలు ఓటేశారు. తమ రాష్ట్రంలో తామే మైనార్టీలుగా మారిపోతామేమో అని ఒరిజినల్​ అస్సామీ ప్రజల్లో ఒక భయం గూడుకట్టింది. అదే ఓట్ల రూపంలో బీజేపీకి కలిసి వచ్చింది. అస్సాంలో తిరిగి విజయం సాధించడం ద్వారా దేశవ్యాప్తంగా తన గౌరవాన్ని బీజేపీ కాపాడుకోగలిగింది. మరోవైపు గాంధీలు వేరే లీడర్లను క్యాంపెయిన్​ చేసేందుకు అనుమతించలేదు. అందువల్ల ఈ ఓటమిపై వారు పార్టీకి వివరణ ఇవ్వాల్సి వస్తుంది.
లీడర్​గా నిరూపించుకున్న పళనిస్వామి 
తమిళనాడులో 30 ఏండ్లుగా ఐదేండ్లకు ఒకసారి ప్రభుత్వం మారే సంప్రదాయమే ఉంది. కానీ, 2016లో మాత్రం జయలలిత ఇక్కడ సెకండ్​ టర్మ్​ అధికారం చేజిక్కించుకున్నారు. జయలలిత మరణం తర్వాత అన్నా డీఎంకే ముక్కలైపోతుందని డీఎంకే భావించింది. కానీ ముఖ్యమంత్రి పళనిస్వామి తాను గ్రేట్​ పొలిటీషియన్​నే కాదు.. మంచి అడ్మినిస్ట్రేటర్​ని కూడా అని నిరూపించుకున్నారు. ఎన్నికలకు నెల రోజుల ముందు డీఎంకే చీఫ్​ స్టాలిన్​ మొత్తం 234 సీట్లకు 190 చోట్ల విజయం సాధిస్తామని ప్రకటించారు. కానీ, ఎన్నికల ఫలితాల తర్వాత అన్నా డీఎంకే దాదాపు 70 సీట్లను సాధించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే అన్నాడీఎంకే మాత్రం అధికారాన్ని కోల్పోయింది. అయినా కూడా బలమైన పార్టీగా నిలబడింది. పళనిస్వామి లీడర్​గా నిరూపించుకోవడమే కాక.. డీఎంకేకు గట్టి ప్రత్యర్థిగా పోటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పుదుచ్చేరిలో ఇక బీజేపీ మినిస్టర్లు
పుదుచ్చేరిలో మాత్రమే రాజకీయంగా కాస్త మార్పు కనిపించింది. బీజేపీ తొలిసారిగా కొన్ని ఎమ్మెల్యే సీట్లను గెలుచుకుంది. ఇప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వంలో పార్ట్​నర్​గా మారనుంది. తొలిసారిగా ఒక తమిళ స్టేట్​లో బీజేపీకి మినిస్టర్లు ఉండనున్నారు. ఇది బీజేపీకి మంచి అవకాశమే.
నేషనల్​ పాలిటిక్స్​పై ఎఫెక్ట్​
ప్రస్తుతం దేశం మొత్తం కరోనా సెకండ్​ వేవ్​తో అతలాకులం అవుతోంది. వ్యాక్సినేషన్, ఇతర చర్యల ద్వారా పరిస్థితిని కచ్చితంగా అదుపులోకి తీసుకురావాల్సిన పరిస్థితుల్లో కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం ఉంది. ఒకవేళ బెంగాల్​లో దారుణంగా ఓడి, అస్సాంలో అధికారం కోల్పోతే.. ప్రతిపక్షాలన్నీ ప్రజలు నరేంద్రమోడీకి వ్యతిరేకంగా మారారని ప్రచారం చేసే అవకాశం దక్కేది. కానీ ఇప్పుడు ఆ చాన్స్​ లేదు. ఎన్నికల ఫలితాలు మోడీ పాపులారిటీపై పాజిటివ్​ ఇంపాక్టే చూపించాయి. ఒకవేళ బెంగాల్​లో బీజేపీ గెలిచినట్లయితే మాత్రం రాజకీయ భూకంపం వచ్చి ఉండేది. కానీ, బెంగాల్​లో బీజేపీ మంచి ఫైట్​ ఇవ్వడంతో అక్కడ ఆ పార్టీ పోరాటం ఇంకా కొనసాగుతుందని అర్థమవుతోంది. అందువల్ల అక్కడ బీజేపీ ఓడిపోనట్టే. ఇక కాంగ్రెస్​ విషయానికి వస్తే దేశంలో అతి పెద్ద ప్రతిపక్షం ఇదే. ఒకవేళ కాంగ్రెస్​ పార్టీ కేరళలోగానీ, అస్సాంలో గానీ గెలిచినట్లయితే అది రాహుల్​గాంధీకి బూస్ట్​గా ఉపయోగపడేది. గాంధీల డామినేషన్​ పార్టీపై కొనసాగేది. అయితే ఇప్పుడు ఈ ఓటములకు వారు పార్టీ కేడర్​కు జవాబు చెప్పుకోవాల్సి వస్తుంది. అస్సాం, పుదుచ్చేరిలో విజయంతో పాటు బెంగాల్​లో మమత వ్యక్తిగత ఓటమితో బీజేపీ తన పరువును కాపాడుకోగలిగింది. అయితే త్వరలో మరిన్ని ఎన్నికలు రానున్నాయి. ఈ ఎలక్షన్లకు ముందు కరోనా వైరస్​తో ప్రధాని మోడీ పోరాటం చేయాల్సి ఉంది. భవిష్యత్​లో జరిగే ఎన్నికల ఫలితాలు ప్రధానంగా కరోనాపై పోరు మీదే ఆధారపడి ఉంటాయి. అదే ప్రధానమంత్రి నరేంద్రమోడీకి అతి పెద్ద టెస్ట్.-పెంటపాటి పుల్లారావు, రాజకీయ విశ్లేషకుడు,