కొత్తగూడెం మున్సిపాలిటీలో అవిశ్వాసానికి రంగం సిద్ధం

కొత్తగూడెం మున్సిపాలిటీలో అవిశ్వాసానికి రంగం సిద్ధం
  • బీఆర్ఎస్​ కౌన్సిలర్ల రహస్య భేటీ

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, మున్సిపల్​ చైర్ పర్సన్​ కాపు సీతాలక్ష్మి తీరును వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్​కు చెందిన పలువురు కౌన్సిలర్లు అవిశ్వాసాన్ని పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. పలువురు కౌన్సిలర్లు, బీఆర్ఎస్​ నాయకులు ఆదివారం రహస్యంగా భేటీ అయ్యారు. రెండు, మూడు రోజుల్లో అవిశ్వాసంపై కలెక్టర్​కు నోటీస్​ ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. అసంతృప్తితో ఉన్న కౌన్సిలర్లను ఎమ్మెల్యే కొడుకు వనమా రాఘవ బుజ్జగించే పనిలో పడ్డారు. 

మొదటి నుంచే గ్రూపులు..

మున్సిపల్​ చైర్​పర్సన్​గా కాపు సీతాలక్ష్మి మూడేండ్ల కింద బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల తరువాత అధికార పార్టీ కౌన్సిలర్లలో  విభేదాలు స్టార్ట్​ అయ్యాయి. కౌన్సిల్​ సమావేశాల్లోనూ అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లే చైర్​పర్సన్​ తీరును ఎండగట్టారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ మున్సిపాలిటీ ఎదుట బీఆర్ఎస్​ కౌన్సిలర్లు ధర్నా చేశారు. ఇరు పక్షాలను సమన్వయం చేసేందుకు బీఆర్ఎస్​ కౌన్సిలర్లతో ఎమ్మెల్యే వనమా సమావేశం నిర్వహించినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. రాష్ట్రంలోని పలు చోట్ల అవిశ్వాస నోటీసులు ఇస్తున్న నేపథ్యంలో 10 మంది కౌన్సిలర్లు, బీఆర్ఎస్​ నాయకులు సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్​కు నోటీసు ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్​ నాయకులు, కౌన్సిలర్లు భీమా శ్రీధర్, రావి రాంబాబు, సుందర్​రాజ్, మోరే రమేశ్, మసూద్, యూసుఫ్, దుర్గాప్రసాద్, బండి నర్సింహారావు, మోరే రూప, సత్యభామ, లీలారాణి, శ్రీవల్లి, సాహెరాబేగం, జయంతి ఈ సమావేశంలో 
పాల్గొన్నారు. పార్టీని కాపాడుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇక్కడి విషయాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తున్నామని వారు చెప్పారు. అవిశ్వాసం పెడితే సీపీఐ, ఇండిపెండెంట్, కాంగ్రెస్​ కౌన్సిలర్లు కీలకం కానున్నారు. అవిశ్వాసం పెట్టకుండా ఎమ్మెల్యే కొడుకు రాఘవ పలువురు కౌన్సిలర్లతో మంతనాలు సాగిస్తున్నట్లు తెలిసింది. ఇదిలాఉంటే అవిశ్వాసానికి సిద్ధమవుతున్న కౌన్సిలర్లంతా మంత్రి పువ్వాడ అజయ్, బీఆర్ఎస్​ జిల్లా అధ్యక్షుడు, విప్​ రేగా కాంతారావు అనుచరులు కావడం గమనార్హంం. వారికి తెలియకుండానే అవిశ్వాసం తెరపైకి వచ్చిందా అనే విషయం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.