
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వల్లే అంటున్న సర్కార్
వేరే కారణాలు ఉన్నాయని ప్రభుత్వ, పార్టీ వర్గాల్లో చర్చ
3న జరిగిన అగ్నిప్రమాదంతో దెబ్బతిన్న గ్రౌండ్ ఫ్లోర్
ఆ రిపేర్లతో పాటు ఇతర కారణాలతోనే వాయిదా వేశారని ప్రచారం
హైదరాబాద్, వెలుగు : ఈ నెల 17న జరగాల్సిన కొత్త సెక్రటేరియెట్ ఓపెనింగ్‌ను రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ప్రారంభోత్సవాన్ని వాయిదా వేస్తున్నామని శనివారం ప్రకటన విడుదల చేసింది. కోడ్ ఉన్నప్పుడు సెక్రటేరియెట్ ప్రారంభోత్సవం చేసుకోవచ్చా? అని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ (సీఈసీ)ను సీఎస్ అడిగారని.. సీఈసీ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రాలేదని, అందుకే ఓపెనింగ్‌ను వాయిదా వేస్తున్నామని అందులో పేర్కొంది. ఎప్పుడు ప్రారంభించేది త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది. సెక్రటేరియెట్ ఓపెనింగ్వాయిదా పడడంతో, అదే రోజు పరేడ్‌గ్రౌండ్‌లో నిర్వహించాల్సిన సభ కూడా వాయిదా పడింది.
ఎవరూ ఫిర్యాదు చేయకున్నా.!
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం ప్రజలను ప్రలోభ పెట్టే నిర్ణయాలు తీసుకుంటే, వాటిపై ఎవరైనా కంప్లయింట్ చేస్తే... సీఈసీ దానిపై రాష్ట్ర సీఈవో వివరణ తీసుకొని నిర్ణయాన్ని వెలువరిస్తుంది. ఇప్పుడు సెక్రటేరియెట్ ప్రారంభోత్సవంపై ఎవరూ సీఈసీకి కంప్లయింట్ చేయలేదు. కానీ ప్రభుత్వమే ఎన్నికల కమిషన్‌ను వివరణ కోరడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ‘‘సెక్రటేరియెట్ ప్రారంభోత్సవం ఓటర్లను ప్రలోభ పెట్టేది కాదు. ఎన్నికల షెడ్యూల్ రావడానికి 20 రోజుల ముందే ఓపెనింగ్ తేదీని నిర్ణయించారు. మూడేండ్లుగా పనులు కొనసాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సెక్రటేరియెట్ ప్రారంభోత్సవం ఓటర్లపై ఎలాంటి ప్రభావం చూపుతుంది” అని అధికార పార్టీ వాళ్లే సందేహం వ్యక్తం చేస్తున్నారు. సెక్రటేరియెట్ ప్రారంభోత్సవం వాయిదా వేస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం వెనుక ఇతర కారణాలేవో ఉన్నాయని అనుమానిస్తున్నారు. అయితే సెక్రటేరియెట్ వాయిదాకు ఎలక్షన్ కోడ్ నే కారణమా? లేక ఇంకేవైనా కారణాలు ఉన్నాయా? అని ప్రభుత్వ, పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అసలు కారణాలు వేరే ఉన్నాయని, ఎలక్షన్ కోడ్ సాకుతో ఓపెనింగ్ ను ప్రభుత్వం వాయిదా వేసిందనే ప్రచారం జరుగుతోంది.
అందుకేనా వాయిదా?
ఈ నెల 17న తన పుట్టిన రోజు సందర్భంగా కొత్త సెక్రటేరియెట్‌ను అట్టహాసంగా ప్రారంభించాలని 20 రోజుల కింద సీఎం కేసీఆర్నిర్ణయించారు. వాస్తుపూజ, చండీయాగం, సుదర్శన యాగం తదితర కార్యక్రమాలతో శాస్త్రోక్తంగా నిర్వహిస్తామని ముందే ప్రకటించారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు, జార్ఖండ్సీఎంలు స్టాలిన్, హేమంత్ సోరేన్, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, అంబేద్కర్ మనుమడు ప్రకాశ్‌అంబేద్కర్ తదితరులకు ఆహ్వానాలు కూడా అందజేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ముహూర్తానికి సెక్రటేరియెట్ ప్రారంభించాలని మూడు షిఫ్టుల్లో సిబ్బందిని పెట్టి వేగంగా పనులు చేయిస్తున్నారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి, అధికారులు అర్ధరాత్రి వరకు అక్కడే ఉండి పనులను పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 3న సెక్రటేరియెట్ గ్రౌండ్‌ఫ్లోర్‌లో వెల్డింగ్ పనులు చేస్తుండగా అగ్నిప్రమాదం జరిగింది. మంటల ధాటికి పెద్ద ఎత్తున మెటీరియల్ కాలిపోయిందని.. ఫాల్ సీలింగ్, వుడ్ వర్క్స్దెబ్బ తిన్నాయని తెలిసింది. బాగా దెబ్బతినడంతో ఫ్లోర్‌లోని కొంత భాగాన్ని కూల్చేశారని సమాచారం. మంటల తీవ్రతతో బిల్డింగ్ మొత్తం పొగ బట్టిందని, దాన్ని కవర్‌చేసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని.. దెబ్బతిన్న ఫాల్‌సీలింగ్, వుడ్ వర్క్, ఇతర ఇంటీరియర్పనులు మళ్లీ చేయాల్సి ఉందని తెలుస్తోంది. ఇవన్నీ ఇప్పటికిప్పుడు పూర్తయ్యేవి కావని, ఇతర రాష్ట్రాల సీఎంలను పిలిచి వారి ముందు పరువు తీసుకోవడం కన్నా వాయిదా వేయడమే మంచిదనే నిర్ణయానికి కేసీఆర్వచ్చినట్టు సమాచారం. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ సాకుగా చూపి బయటపడ్డారని ప్రభుత్వ, పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన రోజే కేటీఆర్ రివ్యూ చేపట్టినా..
ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్వచ్చిన రోజే (ఈ నెల 9న) అసెంబ్లీ కమిటీ హాల్లో పరేడ్‌గ్రౌండ్‌లో చేపట్టాల్సిన బహిరంగ సభపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మంత్రి కేటీఆర్ రివ్యూ నిర్వహించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లోని ఒక్కో నియోజకవర్గం నుంచి 10 వేల మంది చొప్పున సభకు తరలించాలని టార్గెట్ పెట్టారు. జన సమీకరణ, సభ సక్సెస్ కోసం ఒక్కో నియోజకవర్గానికి ఇతర జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులను ఇన్చార్జులుగా నియమిస్తామని చెప్పారు. అయితే ఉన్నట్టుండి సెక్రటేరియెట్ ప్రారంభోత్సవం, సభను వాయిదా వేయడంతో పార్టీ వర్గాల్లో చర్చ మొదలైంది.
ఇవీ కారణమా?
సెక్రటేరియెట్‌కు అంబేద్కర్ పేరు పెట్టి, సీఎం పుట్టిన రోజున ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నిస్తూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్హైకోర్టును ఆశ్రయించారు. సెక్రటేరియట్లో జరిగిన ఫైర్యాక్సిడెంట్పై అనుమానాలు ఉన్నాయని, వాటిని తీర్చాలని పిటిషన్లో కోరారు. దీంతో హైకోర్టు ఒకవేళ తమ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆదేశాలు ఇస్తదేమోననే ఆందోళన ప్రభుత్వ వర్గాల్లో ఉంది. మరోవైపు అంబేద్కర్జయంతి సందర్భంగా ఏప్రిల్ 14న సెక్రటేరియెట్ ను ప్రారంభించాలనే డిమాండ్లు పెరిగాయి. ఇంకోవైపు సెక్రటేరియెట్‌లో ఫ్లోరింగ్, ఫాల్ సీలింగ్, మెయిన్ ఎంట్రెన్స్, పోర్టికో, ల్యాండ్ స్కేప్ తదితర పనులు పూర్తయ్యేందుకు టైమ్ పట్టనుంది. అక్కడ చేపట్టిన ఇతర పనులతో పాటు గుడి, మసీదు, చర్చి సహా మతపరమైన నిర్మాణాలు పూర్తి కాలేదు. ఆ పనులు పెండింగ్‌లో ఉండగా సెక్రటేరియెట్ ప్రారంభిస్తే ఆయా వర్గాల నుంచి ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుందనే ఆందోళన కూడా ప్రభుత్వ వర్గాల్లో ఉంది.