17 నుంచి విద్యుత్ ఉద్యోగుల సమ్మె

17 నుంచి విద్యుత్ ఉద్యోగుల సమ్మె

సిద్ధం కావాలని పవర్‌‌ ఎంప్లాయీస్‌‌ జేఏసీ పిలుపు

హైదరాబాద్‌‌, వెలుగు : ఈ నెల 17 నుంచి విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు సిద్ధం కావాలని స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపునిచ్చింది. సోమవారం జేఏసీ చైర్మన్, కన్వీనర్ సాయిబాబు,- రత్నాకర్ రావు మాట్లాడుతూ.. విద్యుత్ యాజమాన్యాలపై విశ్వాసంతో సమస్యల పరిష్కారం కోసం ఇప్పటివరకు ఓర్పుతో వ్యవహరించామని తెలిపారు. వివిధ రూపాలలో నిరసన కార్యక్రమాలు చేపట్టినా మేనేజ్​మెంట్​నుంచి సరైన స్పందన లేకపోవడంతో అనివార్యంగా ఈ నెల 17 నుంచి సమ్మెకు వెళ్లాలని నిర్ణయించి నోటీసు అందజేశామని తెలిపారు. సమ్మె ను ఉద్యోగులందరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నిత్యం ప్రాణాలను ఫణంగా పెట్టి విధులు నిర్వర్తించే విద్యుత్ ఉద్యోగులు న్యాయపరమైన సమస్యల పరిష్కారం కోసం జరిపే సమ్మెకు ప్రజలు కూడా సహకరించాలని వారు కోరారు. ఈ సమావేశంలో జేఏసీ కో చైర్మన్ శ్రీధర్, కో కన్వీనర్ బీసీ రెడ్డి, వైస్ చైర్మన్లు వజీర్, అనిల్, జేఏసీ నాయకులు పాల్గొన్నారు. 

సమ్మె నోటీసు వెనక్కి తీసుకోండి : జేఏసీకి సీఎండీ ప్రభాకర్ రావు లెటర్‌‌

సమ్మె నోటీసును వెనక్కి తీసుకోవాలని స్టేట్‌‌ పవర్‌‌ ఎంప్లాయీస్‌‌ జేఏసీకి ట్రాన్స్‌‌కో, జెన్‌‌కో సీఎండీ  ప్రభాకర్ రావు లెటర్‌‌ రాశారు. విద్యుత్‌‌ సంస్థలు.. ట్రేడ్‌‌ యూనియన్ ప్రతినిధులతో ఇప్పటికే పలు దఫాలు శాంతియుతంగా చర్చలు జరిపాయని, మరోసారీ జరిపేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. విద్యుత్‌‌ సంస్థల ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని సమ్మె నోటీసు వెనక్కు తీసుకోవాలని ఆయన కోరారు. యాసంగి సీజన్‌‌ పనులు నడుస్తున్నాయని, మరో వైపు ఎస్సెస్సీ పరీక్షలు జరుగుతున్న సమయంలో ఇలా సమ్మెకు దిగడం ద్వారా కరెంటు అంతరాయం ఏర్పడి స్టూడెంట్స్​, ప్రజలు, రైతులులకు ఇబ్బందులు, నష్టాలు తలెత్తుతాయని పేర్కొన్నారు. ఈ నెల 14న ఉదయం 8 గంటలకు మరోసారి చర్చలు జరపడానికి సిద్ధంగా ఉందని సీఎండీ ప్రభాకర్‌‌రావు తన లెటర్‌‌లో పేర్కొన్నారు.