లాక్ డౌన్ ఎఫెక్ట్..షాపుల్లో స్నాక్స్ ఖతం!

లాక్ డౌన్ ఎఫెక్ట్..షాపుల్లో స్నాక్స్ ఖతం!

హైదరాబాద్ , వెలుగులాక్ డౌన్  ఎఫెక్ట్  చిరుతిండ్లపైనా పడింది. జనం చాలా వరకు ఇళ్లలోనే ఉండడం, టైంపాస్ కు చిరుతిండ్లు పెరగడం వంటి కారణాలతో స్నాక్స్  కు డిమాండ్  పెరిగిపోయింది. దీంతో షాపుల్లో నిల్వలు తగ్గిపోతున్నాయి. కిరాణా షాపులు, సూపర్ మార్కెట్లు, మాల్స్ లో బిస్కెట్లు, నూడుల్స్, చాక్లెట్లు, ఇతర స్నాక్స్   స్టాక్స్  అయిపోతున్నాయి. చాలా చోట్ల వాటి ర్యాకులు ఖాళీగా కనిపిస్తున్నాయి. లాక్ డౌన్ తో వాటి ప్రొడక్షన్  కూడా ఎక్కువగా లేకపోవడంతో డిమాండ్ కు తగ్గ సరఫరా జరగట్లేదు. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి ఉంటే ఆ ఇన్ స్టంట్  ఫుడ్  ఐటెమ్స్  దొరక్కపోవచ్చని షాపుల నిర్వాహకులు చెబుతున్నారు. ఉద్యోగులు కూడా ఎక్కువగా లేకపోవడంతో ప్రొడక్షన్ పై ఎఫెక్ట్  పడిందని అంటున్నారు.

వంద ఆర్డరిస్తే వస్తోంది 15

ఇన్ స్టంట్  ఫుడ్  ఐటెమ్స్ కు సంబంధించి 100 బాక్సుల దాకా ఆర్డరిస్తే కేవలం 15 నుంచి 20 బాక్సులే వస్తున్నట్టు షాపుల ఓనర్లు చెబుతున్నారు. ట్రాన్స్ పోర్ట్  సౌకర్యం పూర్తి స్థాయిలో లేకపోవడమూ సరఫరాకు అడ్డంకి అవుతోందని అంటున్నారు. ప్రస్తుతం డిస్ట్రిబ్యూటర్ల వద్ద 20––25 రోజుల వరకు సరిపడే స్టాక్ ఉండగా, కంపెనీల దగ్గర 10 నుంచి 15 రోజులకు సప్లై చేసేంత స్టాక్  మాత్రమే ఉందని చెబుతున్నారు. ఇప్పటికైతే సమస్యలేకపోయినా, మరికొన్ని రోజులు ప్రొడక్షన్  జరగకుంటే పరిస్థితేంటన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పార్లే, ఐటీసీ వంటి సంస్థల ఉత్పత్తులు, స్నాక్స్  కు కొరత ఏర్పడింది. బిగ్ బజార్  వంటి పెద్దపెద్ద షాపింగ్  మాల్స్ కు ఆయా కంపెనీల ప్రొడక్ట్స్  సరఫరా నిలిచిపోయింది. దీంతో బిగ్ బజార్  తాను సొంతంగా తయారు చేస్తున్న ఇన్ స్టంట్  ఫుడ్స్ ను అమ్ముతోంది. నూడుల్స్ , బిస్కెట్లు, ఇతర ఇన్ స్టంట్  ఫుడ్స్ ను ప్రజలు ఎక్కువగా తింటున్నారని, దీంతో డిమాండ్  పెరిగిందని, లాక్ డౌన్ తో ప్రొడక్షన్  లేక సరిపడా సరఫరా చేయలేకపోతున్నామని పార్లే, యిప్పీ, ఐటీసీ కంపెనీల యాజమాన్యాలు చెబుతున్నాయి. బిస్కెట్లకు డిమాండ్  దాదాపు 50 నుంచి 60 శాతం దాకా పెరిగినట్టు షాపుల నిర్వాహకులు చెబుతున్నారు. పరిశ్రమలు పూర్తి స్థాయిలో ప్రొడక్షన్  మొదలుపెడితే ఈ సమస్య ఎంతో కాలం ఉండదని, సాధ్యమైనంత తొందరగా సమస్య తీరుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఆరెంజ్ , గ్రీన్  జోన్లలో ప్రస్తుతం డిస్ట్రిబ్యూటర్లు పని మొదలుపెట్టారని, లాక్ డౌన్ లో మరిన్ని సడలింపులు ఇస్తే ప్రొడక్షన్  మరింత పెరుగుతాయని కంపెనీలు చెబుతున్నాయి.

మేం తయారుచేసినవి అమ్ముతున్నం

లాక్ డౌన్ తో ఇన్ స్టంట్  ఫుడ్  ఐటెమ్స్ కు డిమాండ్  పెరిగింది. చాలా మంది వినియోగదారులు పార్లే, ఐటీసీ కంపెనీల ఫుడ్  ఐటెమ్స్  అడుగుతున్నారు. అయితే, వాటి సరఫరా నిలిచిపోయింది. దీంతో బిగ్ బజార్  సొంతంగా బిస్కెట్లు, నూడుల్స్ , ఇతర ఇన్ స్టంట్  ఫుడ్  ఐటెమ్స్ ను తయారు చేస్తోంది. డిమాండ్ కు తగ్గట్టు సరఫరా చేస్తున్నాం. ఇప్పటికైతే వాటి కొరత ఏర్పడే ప్రమాదమేమీ లేదు. ధరలు పెరగొచ్చు. డిమాండ్ కు తగ్గ సరఫరా జరిగే అవకాశాలున్నాయి.

– జలాలుద్దీన్, బిగ్ బజార్  మేనేజర్  (ఆపరేషన్స్ ), తార్నాక

పిల్లలు ఇన్ స్టంట్ ఫుడ్డే కావాలంటున్నరు

లాక్ డౌన్ తో అందరం ఇంట్లోనే ఉంటున్నాం. ఎక్కువసార్లు తింటుండడంతో వంటలు చేయడం కొంచెం రిస్క్  అవుతోంది. దానికి తోడు పిల్లలూ అన్నం కన్నా చిరుతిండ్లనే ఎక్కువ ఇష్టపడుతున్నారు. దీంతో ఇంట్లో అందరం బిస్కెట్లు, నూడుల్స్  వంటి వాటిని ఎక్కువగా తింటున్నాం. గతంలో కన్నా ఇప్పుడు ఎక్కువగా కొంటున్నాం. షాపింగ్  మాల్స్ కు వెళితే  మాకు కావాల్సిన బ్రాండ్లు దొరకట్లేదు. వేరే బ్రాండ్లూ తక్కువగానే ఉంటున్నాయి.

– వెంకటరమణ, తార్నాక

ఆన్ లైన్ లో గల్లీ కిరాణం