స్టాలిన్ ఇంటికి రజనీకాంత్.. ఓటమిపై మిత్రుడికి ధైర్యం చెప్పిన సూపర్ స్టార్!

స్టాలిన్ ఇంటికి రజనీకాంత్.. ఓటమిపై మిత్రుడికి ధైర్యం చెప్పిన సూపర్ స్టార్!

తమిళనాట రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఘనం విజయం సాధించిన దళపతి విజయ్.. కాంగ్రెస్, ఇతర మిత్ర పక్షాల సపోర్టుతో ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టేందుకు సిద్ధం అవుతున్నారు.  ఇలాంటి సమయంలో పరాజయం పాలైన పాత మిత్రుడు స్టాలిన్‌కు 'సూపర్ స్టార్' రజనీకాంత్ అండగా నిలవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

స్టాలిన్ తో రజనీకాంత్ భేటీ...

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఓటమి తర్వాత డీఎంకే (DMK) అధినేత ఎం.కె. స్టాలిన్‌ను రజనీకాంత్ మర్యాదపూర్వకంగా కలిశారు. స్టాలిన్ నివాసంలో వారిద్దరూ ముఖాముఖి కూర్చున్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. కేవలం పలకరింపు మాత్రమే కాకుండా, ఈ క్లిష్ట సమయంలో తాను స్టాలిన్‌కు పూర్తి స్థాయిలో అండగా ఉంటానని రజనీ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

1995లో డీఎంకే కూటమికి మద్దతు ప్రకటించినప్పటి నుండి రజనీకాంత్‌కు ఆ పార్టీతో ప్రత్యేక అనుబంధం ఉంది. 2017లో రాజకీయ అరంగేట్రం ప్రకటించినప్పటికీ, 2021లో ఆరోగ్య కారణాల దృష్ట్యా ఆయన వెనక్కి తగ్గారు. ఇప్పుడు తన పాత మిత్రుడు ఎన్నికల్లో ఓడిపోవడంతో రజనీ నేరుగా వెళ్లి పరామర్శించడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు, విజయ్ విజయంపై రజనీకాంత్ ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు.

ALSO READ : విజయ్ ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీకి ఆహ్వానం..!

విజయ్ ప్రభంజనం

తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్.. డీఎంకే కోటలను బద్దలు కొట్టారు. టీవీకే 108 స్థానాలు సాధించగా, డీఎంకే కేవలం 59 సీట్లకే పరిమితమైంది. స్వయంగా ఎం.కె. స్టాలిన్ తన నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థి వి.ఎస్. బాబు చేతిలో 8,700 ఓట్ల తేడాతో ఓటమి చెందడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేసింది. స్టాలిన్ ఓడిపోవడంతో, ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.

మే 7న సీఎంగా ప్రమాణ స్వీకారం!

మెజారిటీకి అవసరమైన మరో 11 సీట్ల కోసం విజయ్ ప్రస్తుతం కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు (CPI, CPM), వీసీకే (VCK) పార్టీలతో చర్చలు జరుపుతున్నారు. వారు ఇప్పటికే మద్దతు ప్రకటించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. అన్నీ కుదిరితే మే 7న (రేపు) విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు తొమ్మిది మంది కేబినెట్ మంత్రులు కూడా బాధ్యతలు తీసుకోబోతున్నారు..