పట్టించుకోకుంటే డేంజరే : ఈ ఐదు సూత్రాలు పాటిస్తే క్యాన్సర్​ సమస్యే రాదు

పట్టించుకోకుంటే డేంజరే :  ఈ ఐదు సూత్రాలు పాటిస్తే క్యాన్సర్​ సమస్యే రాదు

ఎంత డబ్బు పెట్టినా తగ్గని రోగం క్యాన్సర్​. అందరూ భయపడే ఎయిడ్స్​ కంటే ఎక్కువ మందిని మింగే జబ్బు ఇది. ఒకప్పుడు ఇన్నేళ్ల వయసులో వస్తుందని డాక్టర్లకు ఓ అంచనా ఉండేది. ఇప్పుడా అంచనాలు తలకిందులు చేస్తూ ముందే వస్తున్నది. జనాల్లో లైఫ్​స్టైల్​ ఎప్పుడైతే గాడి తప్పుతుందో… అప్పట్నించి క్యాన్సర్​ రిస్క్​ పెరుగుతుందని డాక్టర్లు అలర్ట్ చేస్తున్నారు. బ్రెస్ట్‌‌ అండ్ లివర్ క్యాన్సర్‌‌‌‌ అవేర్‌‌‌‌నెస్ మంత్​ సందర్భంగా దాని గురించి బసవ తారకం ఇండో అమెరికన్​ క్యాన్సర్​ హాస్పిటల్​ అండ్​ రీసెర్చ్​ ఇని​స్టిట్యూట్​లో​ ​ మెడికల్ ఆంకాలజిస్ట్​గా పనిచేస్తున్న డాక్టర్ ఎం.వి.టి. కృష్ణ మోహన్​ చెప్తున్న మరిన్ని వివరాలు…

క్యాన్సర్​ ప్రధానంగా లైఫ్​ స్టైల్ లో ఉండే లోపాల వల్ల వచ్చే రోగం. మన దేశంలో శారీరక  శ్రమ చేసేవాళ్లు ఎక్కువ. ఇంట్లో వండేవి తినడం మన సంస్కృతిలో భాగం. కాబట్టి ఫాస్ట్ ఫుడ్​ వాడకం చాలా తక్కువ. అయినా సరే అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే వివిధ రకాల క్యాన్సర్లు వచ్చే సాధారణ వయసు మన దేశంలో తగ్గుతోంది. అంటే ఇంకా చిన్నా వయసులోనే వస్తోంది. మారుతున్న అలవాట్ల వల్ల రాబోయే రోజుల్లో ఎంత రిస్క్​లోకి పోతున్నామో హెచ్చరించే సిగ్నల్ ఇది. పట్టించుకోకుంటే డేంజరే.

అమెరికాలో లంగ్​ క్యాన్సర్​ ఉండే వాళ్ల యావరేజ్ ఏజ్​  65 సంవత్సరాలు. కానీ మన దేశంలో అది 60 సంవత్సరాలుగా రికార్డు అవుతోంది. అంటే పదేళ్లు ముందే వస్తోంది. స్మోకింగ్​ చిన్న వయసులోనే మొదలుపెడుతున్నారని అనుకున్నా బ్రెస్ట్ క్యాన్సర్ లోనూ ఇదే తీరు కనబడుతోంది. బ్రెస్ట్ క్యాన్సర్ రోగుల్లో యావరేజ్ ఏజ్​ 50 ఏళ్లుగా ఉంది. కోలన్​ క్యాన్సర్ (పెద్ద పేగు క్యాన్సర్​) వెస్టర్న్ కంట్రీస్​లో యావరేజ్​ ఏజ్​ 65 సంవత్సరాలు అయితే.. మన దేశంలో అది 55 సంవత్సరాలే!

యంగ్ ఏజ్ బ్రెస్ట్ క్యాన్సర్

దేశంలో యంగ్ ఏజ్​ బ్రెస్ట్ క్యాన్సర్​ కేసులు కూడా అట్లనే పెరుగుతున్నయ్‌‌‌‌‌‌‌‌. 35 ఏళ్లలోపులోనే బ్రెస్ట్ క్యాన్సర్​ బారిన పడుతున్నరు. ఇండియాలో బ్రెస్ట్ క్యాన్సర్​ పేషెంట్స్ లో 15 శాతం మంది 35 లోపు వాళ్లు ఉన్నరు. కానీ అమెరికాలో ఇది 5 శాతమే ఉంది. ఇండియాలో కోలన్​​ క్యాన్సర్ (పెద్ద పేగు క్యాన్సర్) కూడా యంగ్​ ఏజ్​లో ఎక్కువగా వస్తోంది. ఈ బాధితుల్లో మగవాళ్లే ఎక్కువ. చిన్న వయసులో ఎందుకు వస్తుందో కచ్చితంగా చెప్పలేం. కానీ లైఫ్​ స్టైలే కారణమని డాక్టర్లు అంటున్నరు.  మన దేశంలో ఆడవాళ్లు కూడా ఉద్యోగాలు చేయడం వల్ల వాళ్లలోనూ ఫుడ్​ డిసిప్లిన్​ లేకపోవడం వల్ల ఒబెసిటీ పెరుగుతున్నది. అట్లనే చదువు, ఉద్యోగం కోసం లేటుగ పెండ్లి చేసుకుంటున్నరు. అందువల్ల పిల్లల్ని లేటుగా కంటున్నరు. ఒబెసిటీ, లేటు వయసులో పిల్లల్ని కనడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నయ్‌‌‌‌‌‌‌‌.

మహిళల్లో..

సిటీల్లో ఉండే ఆడవాళ్లలో రొమ్ము ( బ్రెస్ట్) క్యాన్సర్​ సమస్య ఎక్కువగా ఉంది. రూరల్ ఏరియాల్లో కూడా రొమ్ము క్యాన్సర్​ ఇప్పుడు పెరుగుతోంది. రొమ్ముక్యాన్సర్​ కంటే  సర్వైకల్ క్యాన్సర్​ పల్లెల్లో ఎక్కువగా ఉంది. సిటీల్లో పరిశుభ్రత (హైజీన్) పాటించడం వల్ల పల్లెటూళ్లతో పోల్చితే సర్వైకల్ క్యాన్సర్​ తక్కువగా ఉంది.

మగవాళ్లలో..

లంగ్​ క్యాన్సర్​ మగవాళ్లలో ఎక్కువగా వస్తోంది. ఒకప్పుడు ఇది అర్బన్​లో ఎక్కువగా ఉంటే ఇప్పుడు రూరల్​ ఏరియాల్లో కూడా పెరుగుతోంది. పల్లెల్లో ఉండేవాళ్లలో పొగాకు, గుట్కాలు నమిలేవాళ్లు (స్మోక్​ లెస్​ టొబాకో వాడకం) ఎక్కువగా ఉన్నారు. అందువల్ల నోరు, గొంతు, నాలుక మీద (హెడ్​ అండ్​ నెక్​ క్యాన్సర్స్) క్యాన్సర్​ ఎక్కువగా వస్తోంది.

ముందుచూపు లేకుంటే..

మొదటి స్టేజ్​లో క్యాన్సర్​ని గుర్తిస్తే  ఆపరేషన్​ చేస్తాం. రెండు వారాల్లో తగ్గిపోతుంది. కానీ, అయిదేళ్ల పాటు డాక్టర్స్​తో చెకప్​ చేయించుకుంటూ మెడిసిన్స్​ వాడాలె. రెండూ, మూడో స్టేజీలో గుర్తిస్తే సర్జరీ చేసి రేడియోథెరపీ, కీమో థెరపీ చేస్తరు. ఈ ట్రీట్​మెంట్​ కి ఆరు నుంచి ఎనిమిది నెలలు పడుతుంది. ట్రీట్ మెంట్ తర్వాత ఐదు సంవత్సరాల పాటు డాక్టర్​ని తరచుగా కలుస్తూ మెడిసిన్స్​ వాడాలి. నాలుగో స్టేజ్​లో క్యూర్​ కావడం కష్టం. ఉన్నంత కాలం ట్రీట్​మెంట్​ చేయించుకోవాల్సిందే. క్యాన్సర్​ వచ్చిన తర్వాత నెలల తరబడి ట్రీట్​మెంట్​, ఏళ్ల తరబడి మెడిసిన్స్​ వాడుతూ జాగ్రత్తలు  పాటించే బదులు రోగం రాకముందే హెల్దీ లైఫ్​ స్టైల్ కోసం రోజూ కొన్ని నియమాలు పాటిస్తే ఏ సమస్యా ఉండదు. క్యాన్సర్​ ముదరక ముందే ట్రీట్​మెంట్​ తీసుకుంటే ఈజీగా బయటపడొచ్చు. కానీ మన దేశంలో స్ర్కీనింగ్ లో బయటపడేవి ఐదు శాతం కేసులే. ఆ తర్వాత బయటపడడం వల్లే రిస్క్​ పెరుగుతోంది.

తప్పు చేయొద్దు
లైంగి క సంబంధాలతో హెచ్ఐవి ఒక్కటే కాదు క్యాన్సర్ కూడా రావచ్చు. హెపటైటిస్–బి, హెపటైటిస్ –సి వైరస్ లైంగి క సంబంధం ఉన్నవాళ్లలో ఒకరికి సోకి ఉంటే మరొకరికి కూడా సోకుతుంది. ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల 10 నుంచి 20 సంవత్సరాల తర్వాత లివర్ క్యాన్సర్ రావొచ్చు. హెపటైటిస్ –బి వైరస్సోకిన వాళ్లలో ఈ ప్రమాదం ఎక్కు వగా ఉంది. ఈ వైరస్ సోకిన వాళ్లను రెగ్యులర్ గా చెకప్ చేస్తూ , ట్రీట్ మెంట్ చేస్తేక్యాన్సర్ రాదు.- డాక్టర్ ఎం.వి.టి.కృష్ణ మోహన్ ,బసవతారకం క్యాన్సర్ హాస్పి టల్

లైఫ్​ స్టైల్ ని మార్చుకుంటే క్యాన్సర్ రిస్క్ నుంచి 90 శాతం సేఫ్‌‌‌‌‌‌‌‌.

ఈ ఐదు సూత్రాలు పాటిస్తే క్యాన్సర్​ సమస్యే రాదు

  • ఫ్యామిలీ హిస్టరీలో కోలన్, బ్రెస్ట్, ఓవరీ, యుటిరస్​​ క్యాన్సర్​ ఉంటే జెనెటిక్​ టెస్ట్ చేయించుకోవాలె. అమ్మా, నాన్న, మేనత్త, మేనమామ, చిన్నాన్న, పెద్దనాన్న, పిన్ని, పెద్దమ్మ… వీళ్లలో ఒకరికి ఉండి, వాళ్ల పిల్లలకు కూడా ఉంటే జాగ్రత్తపడాలె. ఈ విషయంలో వాళ్లకు క్యాన్సర్​ ఏ వయసులో వచ్చిందో కూడా చూడాలె. క్యాన్సర్​ రాకుండా అవసరాన్ని బట్టి డాక్టర్లు పెద్ద పేగు, రొమ్ము తొలగించి క్యాన్సర్​ ముప్పు నుంచి కాపాడతారు
  •  స్మోకింగ్ చేయకూడదు, ఆల్కహాల్  తాగకూడదు. పొగాకు, పాన్, గుట్కా నమలడం మానేయాలె.
  • రెడ్ మీట్ తినకూడదు. యానిమల్ ఫ్యాట్ ఎక్కువగా ఉండే ఫుడ్​ తినడం తగ్గించాలి. ప్లాంట్​ ఫ్యాట్​తో క్యాన్సర్​ ప్రాబ్లమ్ రాదు. సీజన్​లో పండే ప్రూట్స్​ తినాలె. ​ రోజులో కనీసం ఒక్కసారైనా ఫ్రూట్స్​, వెజిటబుల్స్ తినాలె.
  • రోజూ కచ్చితంగా 30 నిమిషాలు ఎక్సర్​సైజ్​ చేయాలె. ఇట్ల  వారంలో ఐదు రోజులు  చేయాలె. యోగా, ఏరోబిక్స్​, జిమ్​ వర్కవుట్స్​ రన్నింగ్​, బ్రిస్క్​ వాకింగ్​, సైక్లింగ్, స్విమ్మింగ్​ చేయాలె. లేకుంటే ఆటలు ఆడాలె.
  • వయసు, ఎత్తుకు తగ్గ బరువు ఉంటేనే ఆరోగ్యంగా ఉన్నట్టు. క్యాన్సర్​ రాకుండా ఉండాలంటే తప్పకుండా బాడీ వెయిట్​ని మెయింటెయిన్​ చేయాలె. మన దేశంలో 40 శాతం మంది తగినంత బరువు లేరు. ఉండాల్సిన బరువు కంటే ఎక్కువ లేదా తక్కువ ఉండేటోళ్లు జాగ్రత్త పడాలె. హెల్దీ వెయిట్ మెయింటెయిన్​ చేయాలె.