
సంగారెడ్డి జిల్లాలో రోడ్లు లేక గర్భిణీ నరకయాతన.. నాగల్‌గిద్ద మండలంలోని మున్యా నాయక్ తండా గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఓ గర్భిణీ చెప్పలేని బాధ అనుభవించింది.
అంబులెన్స్ కి రోడ్డు మార్గం లేక గర్భిణి కష్టాలు pic.twitter.com/8PymW8O7uu
— దివిటి ఛానల్ (@risingsun143) August 10, 2025
ఆదివారం ఉదయం ప్రసవ వేదన మొదలైన ఆ మహిళను కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే తండాకు వెళ్లే రహదారి లేకపోవడంతో అంబులెన్స్ గ్రామానికి చేరుకోలేకపోయింది. పరిస్థితి అత్యవసరంగా ఉండటంతో కుటుంబ సభ్యులు, ఆశా కార్యకర్తల సహాయంతో సుమారు 2 కిలోమీటర్ల దూరం వరకు ఆ బాలింతను వీపుపై మోసుకెళ్లారు.
దారిలోనే ప్రసవం జరగడంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. సుమారు గంటపాటు తీవ్ర వేదనను అనుభవించిన ఆ మహిళను చివరికి అంబులెన్స్‌లో నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
గ్రామస్తుల ఆవేదన
గత కొన్నేళ్లుగా తండాకు రోడ్డు వేయాలని అధికారులు, ప్రజా ప్రతినిధులను గ్రామస్తులు పలు సార్లు కోరినా ఎవరు పట్టించుకోలేదని వారు ఆరోపించారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా వెంటనే రోడ్డు నిర్మాణం చేపట్టాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేశారు.