బీజేపీకి గట్టి పోటీ ఇచ్చిన ముగ్గురు లీడర్లు

బీజేపీకి గట్టి పోటీ ఇచ్చిన ముగ్గురు లీడర్లు

హర్యానా, మహారాష్ట్రల్లో ఫలితాలు వచ్చేశాయి. బీజేపీ ఈ రెండు రాష్ట్రాల్లోనూ అధికారాన్ని నిలబెట్టుకోగలిగింది. ఈ ఎన్నికలు రొటీన్​గా అనిపించకుండా ముగ్గురు లీడర్లు మంచి క్లయిమాక్స్​ అందించారు. హర్యానాలో దుష్యంత్​ చౌతాలా, మహారాష్ట్రలో ఆదిత్య థాక్రేలాంటి యువకులు బలమైన నాయకులుగా ఎదిగారు.  పొలిటికల్​ రిటైర్మెంట్​ ఏజ్​లో సైతం చక్రం తిప్పిన నాయకుడు శరద్​ పవార్​. ఈ మరాఠా యోధుడు ఇప్పటికీ చాలెంజ్​లు విసరగలగడం మామూలు విషయం కాదు.

త్రీ మస్కటీర్స్​ పేరు వినే ఉంటారు. దాదాపు నాలుగు వందలేళ్ల నాడు ఫ్రెంచ్​ సమాజంలో ‘త్రీ మస్కటీర్స్​ (ముగ్గురు యోధులు)’ ఉండేవారని, వాళ్లపై ఎన్నో నవలలు, కామిక్స్​, సినిమాలు వచ్చేశాయి. ఇప్పుడెందుకు గుర్తు చేసుకున్నామంటే… నిన్న రిజల్ట్స్​ వచ్చిన హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో ముగ్గురు యోధులు సెంటర్​ ఆఫ్​ ఎట్రాక్షన్​గా నిలిచారు. ఈ త్రీ మస్కటీర్స్​లో ఇద్దరు జస్ట్​ పొలిటికల్​ ఎంట్రీ ఇచ్చిన కుర్రాళ్లు కాగా, మరొకరు కాకలు తీరిన మరాఠా యోధుడు. హర్యానాలో రెండోసారి సునాయాసంగా అధికారంలోకి వస్తామనుకున్న బీజేపీని 31 ఏళ్ల దుష్యంత్​ సింగ్​ చౌతాలా వణికించాడు. మహారాష్ట్రలోనూ పొత్తు పాలిటిక్స్​తో ‘టార్గెట్​ 220+’ సీట్లు సాధించాలని దిగిన బీజేపీని మరాఠా యోధుడు శరద్​ పవార్​ బలంగా ఢీకొట్టారు. వీళ్లిద్దరూ పొలిటికల్​ బ్యాక్​గ్రౌండ్​ ఉన్నవాళ్లే కానీ, మూడో మస్కటీర్​ ఆదిత్య థాక్రే ఒక డిఫరెంట్​ బ్యాక్​గ్రౌండ్​ నుంచి వచ్చినవాడు. థాక్రే ఫ్యామిలీ రాజకీయాల్లో ఉన్నట్లే, కానీ లేనట్లే. డైరెక్ట్​ పాలిటిక్స్​కు ఆ కుటుంబం దూరంగా ఉంటూ వచ్చింది.

చిన్నతనం నుంచే చిరుత

1956లో గోవా ఇండిపెండెన్స్​కోసం శరద్​ పవార్​ తన ఊరిలో ఊరేగింపు తీశారు. అప్పటికాయన వయసు జస్ట్​ సిక్స్​టీన్. నిక్కర్లు వేసుకునే రోజుల నుంచే పాలిటిక్స్​ అంటే ఆసక్తి పెంచుకున్నారు. చదువులో యావరేజ్​గా ఉన్నా, సోషల్​ యాక్టివిటీస్​లో మాత్రం చిరుత పులిలా ఉండేవాడు. ఆ స్పీడుతోనే 18 ఏళ్లకే యూత్​ కాంగ్రెస్​లో చేరిపోయి, 22 ఏళ్లకల్లా ప్రెసిడెంట్​ అయ్యారు. మహారాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి యశ్వంత్​ రావు చవాన్​ దృష్టిలో పడ్డారు. ఆయన శిష్యరికంలో అంచెలంచెలుగా ఎదుగుతూ 1967లో బారామతిలో నెగ్గి అసెంబ్లీలో అడుగుమోపారు. ఈ సీటుపై శరద్​ పవార్​ ప్రభావం ఎంత బలంగా ఉందంటే… అప్పటి నుంచి ఇప్పటివరకు పవార్​ కుటుంబమే నెగ్గుతూ వస్తోంది. పవార్​ ఆరుసార్లు నెగ్గి, 1991లో కేంద్ర కేబినెట్​లోకి వెళ్లిపోతే, ఆ తర్వాత ఆయన అన్న కొడుకు అజిత్​ పవార్​ వరుసగా ఏడుసార్లు నెగ్గారు. ఎమర్జెన్సీ పరిణామాలతో కాంగ్రెస్​ రెండుగా చీలిపోయినప్పుడు పవార్​ తన గురువు యశ్వంత్​ రావుతో పాటు ఇందిర వ్యతిరేక గ్రూప్​లో ఉండిపోయారు. 1978 ఎన్నికల్లో కాంగ్రెస్​ (యూ) నుంచి విడిపోయి జనతా పార్టీతో చేతులు కలిపి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగారు పవార్​. అప్పటి కాయన వయసు 38 ఏళ్లు. అతి చిన్న వయసులోనే మహారాష్ట్రకు సీఎం అయిన రికార్డు ఇప్పటికీ ఆయన పేరుమీదనే ఉంది. మొత్తంగా ఆయన మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. సోనియా హయాంలో ఆమెను విమర్శించి, సొంతంగా నేషనలిస్టు కాంగ్రెస్​ పార్టీ (ఎన్సీపీ) ఏర్పాటు చేసుకుని, మహారాష్ట్రలో తిరుగులేని శక్తిగా నిలబడ్డారు.

ఈ ఎన్నికల్లో శివసేన ఎమ్మెల్యేల సంఖ్య ఏడుగురి వరకు తగ్గిపోయినా, ఆ పార్టీ నుంచి కొత్త వారసుడిగా ఉద్ధవ్​ థాక్రే కొడుకు ఆదిత్య థాక్రే ఎదిగారు. ఆదిత్య ముంబై సిటీలోని వర్లి స్థానం నుంచి ఎమ్మెల్యేగా నెగ్గారు. శివసేన తరఫున ఇప్పటివరకు బాల్​ థాక్రే ఫ్యామిలీ నుంచి ఎవరూ చట్ట సభలకు పోటీ చేయలేదు. 1995లో శివసేన అధికారానికి వచ్చినా, ప్రభుత్వంలో పాలు పంచుకోలేదు. ఆ పార్టీ సీఎంలుగా మనోహర్​ జోషి, నారాయణ్​ రాణే పనిచేశారు. రాజ్​ థాక్రే తమ మహారాష్ట్ర నవనిర్మాణ సమితి (ఎంఎన్​ఎస్​) తరఫున  అన్న భార్య షాలిని థాక్రేనిఇటీవలి లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేయించారు, ఇంతవరకు ఆమె ఒక్కరే థాక్రే ఫ్యామిలీ నుంచి చట్టసభకు పోటీ చేసిన తొలి వ్యక్తి. ఈ రికార్డుని 29 ఏళ్ల ఆదిత్య థాక్రే బ్రేక్​ చేశారు. ఫస్ట్​ అటెంప్ట్​లోనే చట్టసభకు ఎన్నికయ్యారు. అధికారాన్ని చెరి సగం పంచుకుందామన్న ఉద్ధవ్​ థాక్రే ప్రతిపాదన ఓకే అయితే, శివసేన వంతు వచ్చేసరికి ఆదిత్య థాక్రే సీఎం అవుతారని పొలిటికల్​ వర్గాలు చెబుతున్నాయి.

29 ఏళ్ల వయసున్న ఆదిత్యపై ఎంత ఫోకస్​ ఉందో 79 ఏళ్ల శరద్​ పవార్​పైకూడా అంతే ఫోకస్​ పెట్టింది మీడియా. ఒక దశలో పవార్​ పని అయిపోయిందన్న ప్రచారం  బాగా సాగింది.  అన్న కొడుకు అజిత్​ పవార్​కి, కూతురు సుప్రియా సూలేకి మధ్య ఫ్యామిలీ తగాదాలున్నాయని చెప్పుకున్నారు. ఆయన పార్టీ ఎన్సీపీనుంచి బీజేపీలోకి, శివసేనలోకి జంప్​ చేసేవాళ్లు పెరిగారు. అయినాగానీ, ఈ 79 ఏళ్ల సీనియర్​ కుటుంబాన్ని, పార్టీని గాడిలో పెట్టారు. బీజేపీని పశ్చిమ మహారాష్ట్రలో గడగడలాడించారు. స్వయంగా తనపైనే ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ (ఈడీ) మనీ లాండరింగ్​ కేసు పెడితే, దాన్ని మరాఠాల ఆత్మగౌరవంతో ముడిపెట్టి జనం సానుభూతి కొట్టేశారు.  ‘మరాఠాలు ఢిల్లీ సింహాసనానికి తలొగ్గేది లేదు’ అన్నారు. ఈ సందర్భాన్ని శివాజీ–ఔరంగజేబుల కాలంతో ముడిపెట్టారు. మరాఠీ సెంటిమెంట్​ బలంగా ఉండే నాసిక్​, పుణే, నాగపూర్​ ప్రాంతాల్లో గట్టిగా పోటీ ఇచ్చారు. పవార్​ దెబ్బకి గోపీనాథ్​ ముండే కూతురు పంకజ ముండే సహా ఎనిమిదిమంది మంత్రులు ఓటమి పాలయ్యారు. ఛత్రపతి శివాజీ వంశానికి చెందిన ఉదయన్​ రాజే భోసలే తమ పార్టీ నుంచి గెలిచి బీజేపీలోకి ఫిరాయించి, మళ్లీ బైఎలక్షన్​కి వెళ్తే, ఆయనను సైతం ఓడించగలిగారు పవార్​. ఎన్నికల రిజల్ట్స్​ వచ్చాక ‘రేపు మనదే’ అన్న ధీమా ఎన్సీపీ క్యాడర్​లో కలగజేశారు. శరద్​ పవార్​ చాణక్యానికి బీజేపీ, శివసేన కాంబినేషన్​కి సీట్లు తగ్గించడమే కాకుండా, తమ బలాన్ని బాగా పెంచుకున్నారు. పవార్​ తమ నేషనలిస్టు కాంగ్రెస్​ పార్టీ (ఎన్సీపీ) ఎమ్మెల్యేల్ని 41 నుంచి 54కి చేర్చారు. ప్రతిపక్షంలో కూర్చుంటామని, ప్రజల పక్షానే నిలబడతామని ప్రకటించారు శరద్​ పవార్​.

హర్యానాలో జాట్​ కులానికి పెద్దలుగా ఒకప్పుడు దేవీలాల్​, బన్సీలాల్​, భజన్​లాల్​ ఉండేవారు. వీళ్లు ముగ్గురి చుట్టూనే హర్యానా పాలిటిక్స్​ తిరిగేవి. ముగ్గురూ కూడా సీఎంలుగా పనిచేసినవాళ్లే. ఆ తర్వాత బన్సీలాల్​, భజన్​లాల్​ ఫ్యామిలీలు తమ తమ ప్రాంతాలకే పరిమితమయ్యారు. దేవీలాల్​ కుటుంబం నుంచి ఓం ప్రకాశ్​ చౌతాలా ముఖ్యమంత్రిగా వచ్చారు. అయితే, ఆయన హయాంలో టీచర్ల రిక్రూట్​మెంట్​ స్కాం జరగడంతో చౌతాలాతోపాటు పెద్ద కొడుకు అజయ్​ సింగ్​కూడా జైలు పాలు కావలసి వచ్చింది. ఆ తర్వాత ఫ్యామిలీ తగాదాల్లో అజయ్​ని పార్టీ నుంచి బహిష్కరించగా, తండ్రితో కలిసి దుష్యంత్​ జననాయక్​ జనతా పార్టీ (జేజేపీ) ఏర్పాటు చేసుకున్నారు. ఆయన తల్లి నయనా చౌతాలా పూర్తి సహాయ సహకారాలతో పార్టీని నడిపిస్తున్నారు. తల్లీ కొడుకులిద్దరూ 2014 నుంచి పొలిటికల్​గా చాలా యాక్టివ్​గా ఉన్నారు.

గతంలో హిసార్​ నుంచి దుష్యంత్​ ఎంపీగా, దబ్వాలీ నుంచి నయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో  బధ్రా నియోజకవర్గం నుంచి నయనా చౌతాలా,  ఉచనా స్థానం నుంచి దుష్యంత్​ గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 90 సీట్లున్న అసెంబ్లీలో బీజేపీ 40 సీట్లు గెలుచుకుని, ఏడుగురు ఇండిపెండెంట్లు సాయంతో బొటాబొటీ మెజారిటీతో అధికారాన్ని నిలబెట్టుకునే ప్రయత్నాల్లో ఉంది. దుష్యంత్​ తన 10 సీట్లతో బీజేపీ సర్కారుకి మద్దతిచ్చి కేబినెట్​లోనూ చేరాలని నిర్ణయించుకున్నారు. జేజేపీకి ఉపముఖ్యమంత్రి పదవిని ఆఫర్​ చేస్తున్నట్లు బీజేపీ ప్రెసిడెంట్​ అమిత్​ షా ప్రకటించారు. హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు అధికార పార్టీకి అనుకూలమా, వ్యతిరేకమా అన్నది పక్కనబెడితే, రాజకీయాల్లోకి కొత్త తరం ప్రవేశించింది.

తడబడకుండా… తల్లి సాయంతో…

తండ్రి జైలు పాలయ్యాడు. తాత పార్టీ నుంచి గెంటేశాడు. మామూలు కుటుంబాల్లోనైతే బాగా కుంగిపోవలసిన తరుణం. ఇలాంటి పరిస్థితుల్ని దాటుకుని దుష్యంత్​ సింగ్​ చౌతాలా (31) తారాజువ్వలా పైకి లేచారు.  తల్లి నయనా చౌతాలా వెన్నుదన్నుగా నిలవడంతో సొంతంగా జననాయక్​ జనతా పార్టీ (జేజేపీ) పెట్టారు. నెల్లాళ్లకే జింద్​ అసెంబ్లీ సీటుకి ఉప ఎన్నిక ఎదురైతే,  తన తమ్ముడు దిగ్విజయ్​ని దింపి, 35 వేల ఓట్లతో సెకండ్​ ప్లేస్​ సాధించారు. ఈసారి దిగ్విజయ్​ పోటీ చేయలేదుగానీ, అదే సీటులో జేజేపీ 45 వేల ఓట్లను తెచ్చుకోవడాన్ని బట్టి దుష్యంత్​ భవిష్యత్తు ఊహించవచ్చు. 2014లో ఐఎన్​ఎల్డీ తరఫున ఎంపీగా, ఆయన తల్లి నయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఈసారి సొంత పార్టీ తరఫున తాము నెగ్గడమే కాకుండా, మొత్తంగా 10 సీట్లతో థర్డ్​ ప్లేస్​లో నిలబడ్డారు. తాత ఓం ప్రకాశ్​కి చెందిన ఐఎన్​ఎల్డీ కేవలం ఒక్క స్థానంతోనే సరిపుచ్చుకుంది.  కాలిఫోర్నియాలో ఎంబీయేని, నల్సర్​లో లా పీజీని చేసి పాలిటిక్స్​లో దిగారు. జాట్​ కులస్తులకు దుష్యంత్​ పెద్ద దిక్కుగా కనబడుతున్నారు. ముత్తాత దేవీలాల్​కి నిజమైన వారసుడు దుష్యంతే అంటున్నారు కుల పెద్దలు.

అందరినీ కలుపుకుంటూ…

శివసేన పార్టీ పేరు చెప్పగానే థిక్​ కాషాయం డ్రెస్​తో కనిపించే బాల్​ థాక్రే కనిపిస్తారు. ఆ ఫ్యామిలీలోని మూడో తరానికి చెందిన ఆదిత్య థాక్రే (29) ఎప్పుడూ వైట్​ డ్రెస్​తో ఉంటారు. స్మైలీ ఫేస్​తో యూత్​ని ఆకట్టుకుంటూ అందరినీ కలుపుకుపోతుంటారు. ముస్లింలతోకూడా ఆయన చాలా కలుపుగోలుగా ఉంటారు. దుష్యంత్​ మాదిరిగానే ఆదిత్య కూడా లా చదివారు. స్వయంగా కవి. ‘మై థాట్స్​ ఇన్​ వైట్​ అండ్​ బ్లాక్​’ పేరుతో సంకలనం రిలీజ్​ చేశారు. ఈమధ్యనే ఎనిమిది పాటలతో ఆల్బమ్​కూడా విడుదల చేశారు. 19 ఏళ్ల వయసులోనే శివసేన యూత్​ వింగ్​ యువ సేన బాధ్యతలు అందుకున్నారు. ముంబై నగరంలోని వర్లి నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఎన్నికలకు ముందే రాష్ట్రంలో అధికారం పంచుకోవడానికి ఆదిత్య తండ్రి ఉద్దవ్​ థాక్రే ప్లాన్​ రెడీ చేసుకున్నారు. ఇప్పుడు బీజేపీకి 105, శివసేనకు 56 సీట్లు వచ్చాయి, కాబట్టి అదే రేషియోలో రెండేళ్లపాటు తమకు అధికారం పంచాలంటున్నారు ఉద్దవ్​. ఈ ప్లాన్​ గనుక ఫలిస్తే… శివసేన తరఫున ఆదిత్యకు సీఎం అయ్యే ఛాన్స్​ దక్కుతుంది. అంటే… చిన్న వయసులోనే మహారాష్ట్ర సీఎంలైన శరద్​ పవార్​, దేవేంద్ర ఫడ్నవీస్​ల రికార్డును ఆదిత్య తుడిచేస్తారు.