దేశంలో SUVల హవా.. జోరుగా అమ్మకాలు

దేశంలో SUVల హవా.. జోరుగా అమ్మకాలు

బిజినెస్​ డెస్క్,  వెలుగు​: దేశంలో అమ్ముడవుతున్న పాసింజర్​ కార్లలో హై ఎండ్​ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్​ (ఎస్​యూవీ)ల వాటా ఎక్కువవుతోంది. మరో ఆసక్తికరమైన విషయమేమంటే ఎంట్రీ లెవెల్​ కార్ల అమ్మకాలు తగ్గిపోతున్నాయి. 2022–23 లో దేశంలో పాసింజర్​ వెహికల్స్​ అమ్మకాలు 27 శాతం పెరిగి 38.9 లక్షల యూనిట్లకు చేరాయి. కానీ, ఇదే సమయంలో ఎంట్రీ లెవెల్​ కార్ల వాటా  కేవలం 6.5 శాతానికి పరిమితమైంది. 2022–23లో 2.52 లక్షల ఎంట్రీ లెవెల్​ కార్లు అమ్ముడయ్యాయి. 2016–17లో మొత్తం పాసింజర్​ కార్ల అమ్మకాలలో  చూస్తే ఎంట్రీ లెవల్​ కార్ల  వాటా 57 శాతంగా ఉండేది. దీనికి కారణాలేమిటో ఇప్పుడు చూద్దాం.

సొంత కారు సమకూర్చుకునే ఆదాయ స్థాయిని ఎక్కువ మంది పొందలేకపోతున్నారని ఎనలిస్టులు చెబుతున్నారు. మరోవైపు చిప్​ షార్టేజ్​ వల్ల కార్ల తయారీదారులు కూడా ఎక్కువ మార్జిన్లు ఉండే ఎస్​యూవీల తయారీకి పెద్ద పీట వేస్తున్నారు. అంటే ఎంట్రీ లెవెల్​ కార్ల తయారీని పెద్దగా పట్టించుకోవడం లేదన్నమాట. ఫలితంగా ఎంట్రీ లెవెల్​ కార్ల వాటా తగ్గుతోంది. 

ఫైనాన్స్​ వల్లే....

ఫైనాన్సింగ్​ ఆప్షన్స్​లో మార్పు కూడా మరో కారణంగా చెప్పుకోవచ్చు. ఇన్​ఫ్లేషన్​ పెరిగిన నేపథ్యంలో వడ్డీ రేట్లను ఆర్​బీఐ పెంచింది. ఫలితంగా, కార్పొరేట్లు లోన్ల కోసం ఆసక్తి చూపించకపోవడంతో రిటెయిల్​ లోన్లపైనే బ్యాంకులు ఫోకస్​ పెట్టాయి. కొంచెం ఎక్కువ రిస్క్​తో కూడిన ప్రొఫైల్స్​ అయినా లోన్లను ఇవ్వడానికి బ్యాంకులు వెనకాడటం లేదు. అంటే ఆటోమొబైల్​ లోన్లు దొరకడం కొంత ఈజీగా మారింది. దీంతో మొదటిసారి కారు కొనేవారు ఎంట్రీ లెవెల్​ కారు కంటే ఎస్​యూవీ బెటరని, దానివైపు మొగ్గుచూపుతున్నారు.

ఎంట్రీ లెవెల్​  హ్యాచ్ ​బ్యాక్ ​కార్లతో పోలిస్తే కొంత మెరుగయిన ఫీచర్లతో ఎస్​యూవీలను కార్ల తయారీదారులు 2020–21 నుంచీ  మార్కెట్లోకి తేవడం మొదలెట్టారు. దేశంలో క్యాబ్​ సర్వీసులు అందిస్తున్న ఉబర్​, ఓలా వంటి కంపెనీలు ఎంట్రీ లెవెల్​ కార్లవైపు చూస్తున్నాయి. ముఖ్యంగా ఉబరైతే ఎంట్రీ లెవెల్​ కార్లనే ఇష్టపడుతోంది. కారు కొనుక్కోలేని డ్రైవర్లకు తానే ఎంట్రీ లెవెల్​ కార్లు కొని ఇస్తోంది ఉబర్​. అయినా కూడా ఎంట్రీ లెవెల్​ కార్ల సేల్స్​ జోరందుకోవడం లేదు. దేశంలో మధ్య తరగతి– దిగువ మధ్య తరగతి ప్రజల  ఆదాయాలు పెరిగితే  తప్ప మళ్లీ ఎంట్రీ లెవెల్​కార్ల అమ్మకాలు జోరందుకోవని ఎనలిస్టులు పేర్కొంటున్నారు.