రూమ్ నెం.1046 లో ఏం జరిగింది?.. ఇప్పటికీ మిస్టరీనే..

రూమ్  నెం.1046 లో ఏం జరిగింది?.. ఇప్పటికీ మిస్టరీనే..

అది 1935, జనవరి 4వ తేది. అమెరికాలోని కేంజస్​ సిటీలో ఉన్న ఒక పెద్ద హోటల్‌‌‌‌లో ఒక యువకుడు చనిపోయాడు. ఆ యువకుడు ఎవరు? ఎలా చనిపోయాడు? అది హత్యా? ఆత్మహత్యా?.. ఇలాంటి ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. ఆ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి పోలీసులు ఎంతగానో ప్రయత్నించారు. కానీ.. తెలియలేదు. చివరకు అది హత్యే అని పోలీసులు కన్ఫర్మ్ చేసినా.. చనిపోయేముందు ఆ యువకుడు తనది హత్య, ఆత్మహత్య రెండూ కావని చెప్పాడు. పోనీ ఆ యువకుడు చెప్పింది నమ్ముదామంటే.. అతను చనిపోయిన పరిస్థితులు అలా లేవు. దాంతో అతను ఎలా చనిపోయాడు అనే ప్రశ్నతోనే కేస్‌‌‌‌ మూసేశారు పోలీసులు. 

కేంజస్​ సిటీలోని ప్రెసిడెంట్‌‌‌‌ హోటల్‌‌‌‌లో 1935 జనవరి 2 బుధవారం నాడు మధ్యాహ్నం 1.20 గంటలకు రోలాండ్ టి. ఓవెన్ అనే ఇరవై ఏండ్ల వయసున్న యువకుడు దిగాడు. అతనికి రూమ్ నెంబర్‌‌‌‌‌‌‌‌ 1046ని అలాట్‌‌‌‌ చేసింది హోటల్‌‌‌‌. సరిగ్గా రెండు రోజులకు అదే రూంలో అతను చనిపోయి పడి ఉన్నాడు. ఈ రెండు రోజుల్లో ఆయన ఎవరితోనూ పెద్దగా మాట్లాడలేదు.  అయితే.. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ కేసు మిస్టరీగానే ఉంది. అతను హోటల్లో దిగినప్పుడు తనది లాస్ ఏంజిలెస్‌‌‌‌ అని హోటల్‌‌‌‌ సిబ్బందికి చెప్పాడు. 

చూడడానికి రెజ్లర్‌‌‌‌‌‌‌‌లా బలంగా ఉన్నాడు. అయితే.. ఇంటీరియర్ రూమ్ కావాలని, ప్రైవసీ ఎక్కువగా ఉండాలని, కనీసం రూమ్‌‌‌‌కి కిటికీలు కూడా ఉండొద్దని అడిగాడు ఓవెన్‌‌‌‌. అందుకే అలాంటి ఫెసిలిటీస్‌‌‌‌ ఉన్న ‘1046’ని ఇచ్చారు. అదే రోజు సాయంత్రం రూమ్ క్లీన్‌‌‌‌ చేసేందుకు మేరీ సోప్టిక్ వెళ్లింది. అప్పుడు ఒకే లైట్‌‌‌‌ వేసుకుని, డిమ్‌‌‌‌ లైట్‌‌‌‌లో చైర్‌‌‌‌‌‌‌‌పై కూర్చుని ఉన్నాడు. తన పని చేసుకుని వెళ్లబోయింది సోప్టిక్‌‌‌‌. అప్పుడు ఓవెన్ ‘‘నా ఫ్రెండ్‌‌‌‌ కోసం ఎదురు చూస్తున్నా. డోర్ లాక్ చేయొద్దు” అని చెప్పాడు. ఆమె అలానే చేసింది. అప్పుడు సోప్టిక్‌‌‌‌కి ఓవెన్ భయపడుతున్నట్టు అనిపించింది. ఆ తర్వాత కొద్దిసేపటికి ఫ్రెష్‌‌‌‌ టవల్స్‌‌‌‌ ఇవ్వడానికి సోప్టిక్ మళ్లీ రూమ్‌‌‌‌కి వచ్చింది. ఓవెన్ ఒంటినిండా దుప్పటి కప్పుకుని మంచంపై పడుకున్నాడు. డెస్క్ మీద ఒక పేపర్‌‌‌‌‌‌‌‌పై “డాన్, నేను పదిహేను నిమిషాల్లో తిరిగి వస్తాను. వేచి ఉండండి” అని నోట్‌‌‌‌ రాసి ఉంది. సోప్టిక్ టవల్స్‌‌‌‌ పెట్టేసి వెళ్లిపోయింది. 

జనవరి 3

మరుసటి రోజు జనవరి 3న మధ్యాహ్నం టైంలో ఓవెన్‌‌‌‌ రూమ్‌‌‌‌కి వచ్చింది సోప్టిక్. కానీ.. రూమ్‌‌‌‌ డోర్ బయటి నుంచి లాక్‌‌‌‌ చేసి ఉంది. దాంతో రూమ్ క్లీన్‌‌‌‌ చేయడానికి తన దగ్గరున్న పాస్‌‌‌‌కీతో డోర్‌‌‌‌‌‌‌‌ తెరిచింది. లోపలికి వెళ్లి చూసి షాక్ అయింది సోప్టిక్‌‌‌‌. ఎందుకంటే.. చీకటిలో ఓవెన్ ఒంటరిగా కూర్చుని ఉన్నాడు. ఆమె షాక్ నుంచి తేరుకుని పని మొదలుపెట్టింది. గదిని శుభ్రం చేస్తుండగా ఓవెన్‌‌‌‌ ఫోన్‌‌‌‌లో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఫోన్‌‌‌‌లో ‘‘వద్దు డాన్. నాకు తినాలని లేదు. నేను ఇప్పుడే బ్రేక్‌‌‌‌ ఫాస్ట్ చేశాను” అని చెప్పాడు. సోప్టిక్ తన పని చేసుకుని వెళ్లిపోయింది. మరుసటి రోజు ఫ్రెష్‌‌‌‌ టవల్స్ ఇవ్వడానికి మళ్ళీ డోర్ కొట్టింది. ఓవెన్ బయటికి రాకుండా, తలుపు తీయకుండానే వద్దని చెప్పాడు. కానీ.. ఆ టైంలో అందులో ఓవెన్‌‌‌‌తోపాటు మరో వ్యక్తి కూడా ఉన్నాడు. ఓవెన్‌‌‌‌ ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు. అందుకే సోప్టిక్‌‌‌‌ని లోపలికి రానివ్వలేదు. ఆమె ఓవెన్‌‌‌‌తో మాట్లాడటం అదే చివరిసారి. అదే రోజు మధ్యాహ్నం హోటల్‌‌‌‌కి దగ్గర్లో ఉన్న బార్లలో ఓవెన్‌‌‌‌ను ఇద్దరు అమ్మాయిలతో చూశామని లోకల్‌‌‌‌ వాళ్లు చెప్పారు. అప్పటికే అతని చేతిపై కోసినట్టు ఒక గీత ఉంది. 

టర్న్‌‌‌‌ ఆన్‌‌‌‌ లైట్స్‌‌‌‌

జనవరి 4న తెల్లవారుజామున రూమ్‌‌‌‌ నెంబర్‌‌‌‌‌‌‌‌ 1048లో ఉంటున్న ఒక మహిళ 1046లో ఉన్నవాళ్లు పెద్దగా అరుస్తున్నారు. వాళ్లలో ఒక మహిళ పెద్దగా అరుస్తోంది. చాలా డిస్టర్బెన్స్‌‌‌‌గా ఉందని హోటల్‌‌‌‌ వాళ్లకు కంప్లైంట్‌‌‌‌ చేసింది. ఆ తర్వాత కొద్దిసేపటికే టెలిఫోన్ ఆపరేటర్ 1046లోని ఫోన్‌‌‌‌ చేసేందుకు ట్రై చేశాడు. ఫోన్‌‌‌‌ కనెక్ట్‌‌‌‌ కాలేదు. దాంతో బెల్‌‌‌‌బాయ్‌‌‌‌ని రూమ్‌‌‌‌కి పంపాడు. అతను డోర్ కొట్టగానే.. లోపల్నించి ‘కమ్‌‌‌‌ ఇన్‌‌‌‌’ అని వినిపించింది. బెల్‌‌‌‌ బాయ్‌‌‌‌ లోపలికి వెళ్లేందుకు ట్రై చేశాడు. కానీ.. లోపలి నుంచి లాక్‌‌‌‌ చేసి ఉంది. ‘డోర్‌‌‌‌‌‌‌‌ తీయండి’ అనడిగాడు బెల్‌‌‌‌బాయ్. ‘‘టర్న్‌‌‌‌ ఆన్ లైట్స్‌‌‌‌” అని లోపలి నుంచి వినిపించింది. ఎందుకలా అన్నాడో అర్థం కాక.. ఏం చేయాలో తోచక బెల్‌‌‌‌బాయ్‌‌‌‌ కొద్దిసేపు డోర్‌‌‌‌‌‌‌‌ కొట్టి వెళ్లిపోయాడు. ఉదయం 8.30 గంటలకు ఫోన్ ఆపరేటర్ 1046 రూమ్‌‌‌‌కి ఫోన్‌‌‌‌ చేశాడు. కానీ.. కనెక్ట్‌‌‌‌ కాలేదు. దాంతో మరోసారి బెల్‌‌‌‌బాయ్ రూమ్‌‌‌‌కి వెళ్లాడు. డోర్ కొట్టినా లోపలి నుంచి రిప్లై రాకపోవడంతో పాస్‌‌‌‌కీతో డోర్‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌ చేసి లోపలికి వెళ్లాడు. లైట్స్ ఆఫ్‌‌‌‌ చేసి ఉన్నాయి. బెడ్‌‌‌‌పై ఓవెన్‌‌‌‌ బట్టల్లేకుండా పడుకున్నాడు. తాగిన మత్తులో ఉన్నాడనుకుని.. పక్కన పడేసి ఉన్న రిసీవర్‌‌‌‌‌‌‌‌ను హుక్‌‌‌‌కు పెట్టి వెళ్లిపోయాడు బెల్‌‌‌‌బాయ్. ఆ తర్వాత మరో బెల్‌‌‌‌బాయ్  రూమ్‌‌‌‌కి వెళ్లాడు. అప్పుడు డోర్‌‌‌‌‌‌‌‌కి రెండు అడుగుల దూరంలో ఓవెన్‌‌‌‌ మోకాళ్లపై కూర్చుని తలను చేతులతో గట్టిగా పట్టుకుని ఉన్నాడు. ఒంటి నిండా రక్తం ఉంది. లైట్‌‌‌‌ ఆన్‌‌‌‌ చేసి చూస్తే..  మంచం మీద, బాత్ రూమ్‌‌‌‌లో, గోడలపై రక్తం మరకలు ఉన్నాయి. భయంతో పరుగెత్తుకెళ్లి విషయాన్ని మేనేజర్‌‌‌‌కి చెప్పాడు. వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్‌‌‌‌ చేశాడు ఆ మేనేజర్​. 

ఎవరూ చంపలేదా!

ఓవెన్‌‌‌‌ని ఎవరో చిత్ర హింసలు పెట్టినట్టు గుర్తించారు పోలీసులు. ఛాతీలో పొడిచారు. ఊపిరితిత్తుల్లో కూడా కత్తితో గుచ్చారు. తలపై కుడివైపు చాలా దెబ్బలు తగిలాయి. అప్పటికీ ఓవెన్‌‌‌‌ సోయిలోనే ఉన్నాడు. ‘‘నిన్ను చంపాలని ట్రై చేసిందెవరు?” అనడిగారు పోలీసులు. దానికి ఓవెన్‌‌‌‌ ‘‘ఎవరూ కాదు. నేను బాత్‌‌‌‌ టబ్‌‌‌‌లో పడిపోయా. అందుకే దెబ్బలు తగిలాయి” అని చెప్పాడు. 
‘‘ఆత్మహత్య చేసుకోవడానికి ట్రై చేశారా?” మళ్లీ అడిగాడు డిటెక్టివ్. దానికి ‘‘లేదు, అనుకోకుండా జరిగింది” అని సమాధానం చెప్పి కోమాలోకి వెళ్లిపోయాడు ఓవెన్‌‌‌‌.  మరుసటి రోజు జనవరి 5న హాస్పిటల్‌‌‌‌లో చనిపోయాడు. 

ఎవరు చేశారు?

అతను చనిపోయినక తర్వాత.. అదంతా ఎవరు చేశారో తెలుసుకోవడానికి కేంజస్​ సిటీ పోలీస్ డిపార్ట్‌‌‌‌మెంట్ చాలా ట్రై చేసింది. కానీ.. లాభం లేకపోయింది. అతనిది ఆత్మహత్య అనుకుందామంటే అలాంటి ఆధారాల్లేవు. పోనీ అతను చెప్పినట్టు బాత్‌‌‌‌ టబ్‌‌‌‌లో పడిపోయాడు అనుకుంటే.. బాత్‌‌‌‌రూంలో కూడా అతను పడిపోయినట్టు ఎలాంటి గుర్తులు లేవు. పైగా శరీరంలో కత్తిపోట్లు ఉన్నాయి. నమ్మలేని మరో విషయం ఏంటంటే.. అన్ని గాయాలైనా అతను హోటల్‌‌‌‌ వాళ్లకు ఫోన్ చేయలేదు. గట్టిగా అరవలేదు. ఎవరైనా హత్య చేశారేమో అనే డౌట్‌‌‌‌తో హోటల్‌‌‌‌ రూమ్ మొత్తం వెతికారు. అందులో టవల్స్, షాంపూ, నెక్‌‌‌‌టై లేబుల్, హెయిర్‌‌‌‌పిన్, సిగరెట్, సేఫ్టీ పిన్, డైల్యూటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్‌‌‌‌ బాటిల్‌‌‌‌, సింక్‌‌‌‌లో పగిలిన వాటర్‌‌‌‌‌‌‌‌ గ్లాస్‌‌‌‌, టెలిఫోన్ స్టాండ్ మీద ఒక మహిళ ఫింగర్ ప్రింట్లు దొరికాయి. అంతకుమించి ఆధారాలు ఏమీ దొరకలేదు. దొరికిన వాటితో కనీసం ఓవెన్ ఎవరనేది కూడా కనిపెట్టలేకపోయారు. ఆ సిటీలోని చాలామంది అతని శవాన్ని గుర్తుపట్టారు. వాళ్లందరికీ అతను ఒక్కో పేరుతో తెలుసు. ప్రెసిడెంట్‌‌‌‌ హోటల్‌‌‌‌ కంటే ముందు అతను వేరే హోటల్స్‌‌‌‌లో కూడా ఉన్నాడు. ‘ముహెల్‌‌‌‌బాచ్’ హోటల్‌‌‌‌లో పేరు యూజీన్ కె. స్కాట్ అని, తనది లాస్ ఏంజిలెస్‌‌‌‌ అని చెప్పి ఒక రాత్రి ఉన్నాడు. అంతకుముందు ‘సెయింట్ రెగిస్ హోటల్‌‌‌‌’లో ఉన్నాడు. అక్కడ అతని పేరు ‘డంకన్ ఓగ్లెట్రీ’ అని చెప్పాడు. ‘సెసిల్ వెర్నర్’ పేరుతో చనిపోవడానికి కొన్ని వారాల ముందు తన దగ్గరకు వచ్చాడని ఒక రెజ్లింగ్ ప్రమోటర్ చెప్పాడు. ఒక్కో పేరు చెప్పి ఒక్కొక్కరిని కలిశాడు. కానీ.. అతని అసలు పేరు, ఊరు ఎవరికీ తెలియదు. పోలీసులు అతని ఫొటో మీడియాకు ఇచ్చారు. కానీ.. అతని గురించి తెలుసని ఎవరూ రాలేదు. 

డబ్బులు పంపిందెవరు? 

సోప్టిక్ చెప్పిన డాన్‌‌‌‌ ఎవరో తెలియలేదు. ఫోన్ స్టాండ్ మీద దొరికిన ఫింగర్‌‌‌‌‌‌‌‌ ఫ్రింట్స్‌‌‌‌ ఎవరివో తెలుసుకోలేకపోయారు. ఓవెన్‌‌‌‌ కోసం ఎవరూ రాకపోవడంతో శవాన్ని ఖననం చేస్తామని అనౌన్స్ చేశారు పోలీసులు. కానీ అంత్యక్రియలు జరగకముందే ఒక గుర్తు తెలియని వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి, ‘‘అతని శవాన్ని కేంజస్​ సిటీ మెమోరియల్ పార్క్ శ్మశానవాటికలో గ్రాండ్‌‌‌‌గా ఖననం చేయండి. అందుకు కావాల్సిన డబ్బులు పంపుతాను’’ అని చెప్పాడు. అయితే.. ఓవెన్‌‌‌‌ ఒక మహిళను మోసం చేశాడని అందుకే హోటల్‌‌‌‌లో ఆమెతో పాటు తాను కూడా ఓవెన్‌‌‌‌ని కలిశానని చెప్పి  ఫోన్‌‌‌‌ పెట్టేశాడు. అతను చెప్పినట్టుగానే ఒక న్యూస్‌‌‌‌పేపర్‌‌‌‌‌‌‌‌లో కొంత డబ్బు చుట్టి పోలీస్‌‌‌‌స్టేషన్‌‌‌‌కు ఒక వ్యక్తితో పంపాడు. డబ్బులిచ్చిన వ్యక్తి ఎవరో... తీసుకొచ్చిన వ్యక్తికి తెలియదు. అంత జాగ్రత్త పడ్డాడు. పోలీసులు ఓవెన్‌‌‌‌ శవాన్ని ఖననం చేశారు. అతని సమాధిపై 13 అమెరికన్ బ్యూటీ రోజెస్‌‌‌‌ పెట్టాలని, ఒక పూల వ్యాపారికి గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఆర్డర్ వచ్చింది. సమాధిపై పూలతోపాటు పెట్టడానికి ఒక కార్డు ఇచ్చాడతనికి. అందులో  ‘‘లవ్ ఫరెవర్‌‌‌‌‌‌‌‌.. -లూయిస్” అని రాసి ఉంది. 

రూబీ ఆమె కొడుకా? 

ఓవెన్‌‌‌‌ హోటల్‌‌‌‌లో దిగినప్పుడు తనది లాస్ ఏంజిలెస్‌‌‌‌ అని చెప్పాడు. దాంతో  లాస్ ఏంజిలెస్‌‌‌‌ అధికారులు ఓవెన్‌‌‌‌కు సంబంధించిన ఎలాంటి రికార్డులు తమ దగ్గర లేవని, అతనిది లాస్‌‌‌‌ ఏంజిలెస్​ కాదని చెప్పారు. ఓవెన్‌‌‌‌ చనిపోయిన వార్తను 1936లో పేపర్‌‌‌‌లో చూసిన రూబీ ఓగ్లెట్రీ అనే మహిళ ఓవెన్‌‌‌‌ తన కొడుకు అని చెప్పింది. అతని పేరు ఆర్టెమస్ ఓగ్లెట్రీ అని కూడా చెప్పింది. ఆర్టెమస్ చనిపోవడానికి ముందు రూబీకి రాసిన లెటర్స్‌‌‌‌ని చూపించింది. దాంతో ఓవెన్‌‌‌‌గా హోటల్‌‌‌‌లో దిగింది ఆర్టెమస్‌‌‌‌ అని పోలీసులు కూడా నమ్మారు. రూబీ తన కొడుకు గురించి చెప్పిన గుర్తులన్నీ సరిపోయాయి. కానీ..  ట్విస్ట్‌‌‌‌ ఏంటంటే.. రూబీకి వచ్చిన లెటర్స్‌‌‌‌లో కొన్ని ఓవెన్‌‌‌‌ చనిపోయిన తర్వాత డేట్లతో ఉన్నాయి. ఆర్టెమస్ పేరుతో ఆ లెటర్లు ఎవరు పంపారన్నది కూడా మిస్టరీనే. 

అమ్మాయి చంపిందా? 

ప్రెసిడెంట్‌‌‌‌ హోటల్ ఎలివేటర్ ఆపరేటర్ ఛార్లెస్ బ్లాచర్ రూమ్‌‌‌‌ నెంబర్‌‌‌‌‌‌‌‌ 1026లో ఉన్న వ్యక్తిని కలిసేందుకు ఒక మహిళ వచ్చినట్టు చెప్పిందని పోలీసులతో చెప్పాడు. కానీ.. ఆమె 1046కి వెళ్లిందని చార్లెస్‌‌‌‌ చెప్పాడు. ఆ తర్వాత ఆమెను మరో వ్యక్తితో చూశానని, అతను డాన్ అయి ఉండొచ్చని కూడా ఛార్లెస్‌‌‌‌ చెప్పాడు. దాంతో ఓవెన్‌‌‌‌ గదిలో ఉన్న మహిళ ఫింగర్ ప్రింట్స్‌‌‌‌ ఆమెవే కావచ్చని పోలీసులు అనుమానించారు. డాన్‌‌‌‌, ఆ మహిళ కలిసి ఓవెన్‌‌‌‌ను చంపి ఉంటారని చాలామంది నమ్మారు. ఈ హత్య జరిగిన తర్వాత ఇలాంటి కథలు చాలానే పుట్టుకొచ్చాయి. కానీ.. ఓవెన్‌‌‌‌ని చంపిందెవరనేది ఇప్పటికీ తెలియలేదు. ఆ కేసు ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. 

::: కరుణాకర్​ మానెగాళ్ల