కోర్టుకెళ్లి కూతపెట్టే హక్కు సాధించుకున్న కోడి

కోర్టుకెళ్లి కూతపెట్టే హక్కు సాధించుకున్న కోడి
  • పట్నపోళ్లు అట్టి పాగల్​గాళ్లురా…
  • అరె.. పిట్ట అరవొద్దట, కోడి కూయొద్దట..!
  • ఆటి నోర్లెట్ల మూస్తం చెప్పు?
  • ఆళ్లని ఊర్లకు రమ్మని బొట్టువెట్టి పిల్షినమా?
  • ఆళ్లే.. అస్తరు, కోడి కూస్తున్నది.. బర్రె అరుస్తున్నదంటే ఎట్ల?
  • ఒర్రే హక్కు అవ్విట్కి లేదా?
  • మొన్న ఫ్రాన్స్​లో ఏమైందో మీకు తెల్సా?
  • ఓ కోడి కోర్టుకు పొయ్యి.. కూతపెట్టే హక్కును సాధించుకున్నది!
  • ఆ సంగతేందో ఓపారి మీరూ సదువున్రి..

ఫ్రాన్స్ దేశాన్ని ఉద్యమాలకు పుట్టినిల్లుగా చెప్తరు. ఫ్రెంచి విప్లవం నుంచి  మొదలుపెడితే ఇప్పటిదాకా ఎన్నో ఉద్యమాలకు పురుడు పోసింది ఫ్రాన్సే. ఆ దేశంలో ఇప్పుడు కొత్తగా ఓ ఉద్యమం పుట్టుకొచ్చింది. కోడికి  ‘కొక్కొరొకో..’ అని కూసే హక్కు.., కుక్కకు ‘భౌ భౌ..’మని అరిచే హక్కు కల్పించాలని… ఒక్కమాటల చెప్పాలంటే మూగజీవాలన్నింటికీ ‘భావప్రకటన స్వేచ్ఛ’ను ఇవ్వాలని ఉద్యమిస్తున్నరు.  ఇదంతా జోక్​గా అనిపిస్తున్నా.. ఈ ఉద్యమానికి ఓ మంచి లక్ష్యముంది.

అసలు ఈ ఉద్యమం ఎట్ల మొదలైందంటే…

మౌరీస్ .. ఇది ఓ కోడిపుంజు పేరు.  వయసు నాలుగేండ్లు. ఫ్రాన్స్​ దేశంలోని అట్లాంటిక్​ సముద్ర తీరంలో ఉన్న ఓలెరాన్​ దీవి దీని అడ్రస్​. ప్రశాంతంగ ఉంటదని పట్నపోళ్లంతా ఈ దీవిలో జాగలు కొనుక్కొని ఇండ్లు కట్టుకుంటున్నరు. జీన్​ లూయీ బైరన్​ అనే పెద్దమనిషి కూడా ఈ దీవిలోనే ఓ ఇల్లు కొనుక్కున్నడు. దానికి ఆనుకొని ఉన్న ఇంట్లనే మౌరీస్​, దాని యజమాని జాకీ ఫెసీ ఉంటరు. అయితే మౌరీస్​ రోజు పొద్దుగాలనే కూతపెట్టడం బైరన్​కు నచ్చలేదు.

ప్రశాంతంగా నిద్రపోదమని ఈ దీవిలో ఇల్లు కొనుక్కుంటే ఈ కోడి లొల్లేందని జాకీ​తో కొట్లాట కూడా పెట్టుకున్నడు. అయితే జాకీ​ మాత్రం.. ‘మా కోడి బరాబర్​ కూస్తది. ఏం చేస్తవో చేస్కో’ అని చెప్పిండు. దీంతో బైరన్​ ఆ కోడి మీద కేసుపెట్టిండు. పక్క ఇంట్ల ఉన్న కోడి తనను నిద్ర పోనిస్తలేదని, దాని కారణంగనే ప్రశాంతత కరువైందని, ఎట్లనన్న ఆ కోడి నుంచి తనకు విముక్తి కల్పించాలని కోరిండు.

పోరాటం కోడి గురించే కాదు…

ఆఫ్టరాల్​ కోడి కోసం ఇంత మంది రోడ్ల మీదకు వస్తున్నరా? అని ఓ టీవీ చానల్​ చర్చ పెట్టింది. అయితే.. చర్చలో పాల్గొన్న మేధావులు మాత్రం ఇది కేవలం కోడి కోసం మాత్రమే జరుగుతున్న ఉద్యమం కాదని.. నగర జీవితాలకు, గ్రామీణ జీవన విధానానికి మధ్య జరుగుతున్న పోరుగా చూడాలని పిలుపునిచ్చిన్రు.

నగరాల్లో రకరకాల సమస్యలతో బతకలేకపోతున్నరని, వారంతా ఊర్లమీదికి వచ్చి పడుతున్నరని.. గ్రామీణ సంస్కృతిని దెబ్బతీస్తున్నరని ఆందోళన వ్యక్తం చేసిన్రు. పట్నం నుంచి పల్లెటూళ్లకు వచ్చేటోళ్లు ఊరి సంప్రదాయాలను, సంస్కృతులను గౌరవించాలని డిమాండ్​ చేసిన్రు. చర్చల పాల్గొన్న మేధావుల అభిప్రాయాలకు దేశం మొత్తం సపోర్ట్​ చేసింది.

కోర్టు ఏమని తీర్పిచ్చిందంటే..

ఈ కేసు మీద విచారణ చేపట్టిన రోచ్‌ఫోర్ట్ కోర్టు.. మౌరీస్​కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. కోడిని కోర్టు మెట్లు ఎక్కించినందుకు పరిహారం కింద 1100 డాలర్లు జరిమానా కట్టాలని తీర్పు ఇచ్చింది.  ‘గ్రామీణ ప్రాంతం గ్రామీణ ప్రాంతంలాగే ఉండాలి.

పల్లెటూరి  శబ్దాలను వినిపించకుండా చేయాలని చెప్పకూడదు. పల్లెటూరి ప్రజలపై నగరవాసులు హాస్యపూరితంగా స్పందించే సంస్కృతి మంచిది కాదు. ఇక ఈ కేసు అసహనానికి ఎగ్జాంపుల్​. మనమంతా స్థానిక సంప్రదాయాలను అంగీకరించాల్సిందే’నని కోర్టు చెప్పింది.

ఎన్నో కేసులకు స్ఫూర్తి…

మౌరీస్​పై రోచ్‌ఫోర్ట్ కోర్టు ఇచ్చిన తీర్పు.. మరెన్నో తీర్పులకు రిఫరెన్స్​గా నిలుస్తుందని చెబుతున్నరు. బాతులు పెద్దగా శబ్దం చేస్తున్నయని నమోదైన ఓ కేసు కూడా అక్టోబర్​లో విచారణకు వస్తుందని, ఆ కేసులో కూడా బాతులే గెలుస్తాయంటున్నారు ఫ్రాన్స్​ ప్రజలు.

the-victory-of-maurice-the-rooster-is-a-win-for-the-rural-life-in-france