బీసీల సంక్షేమం ఉత్తమాట

బీసీల సంక్షేమం ఉత్తమాట
  • చదువు నుంచి స్వయం ఉపాధి దాకా అన్నిట్లో రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యం
  • హాస్టళ్లు, గురుకులాలకు సొంత భవనాల్లేవ్​.. పిల్లలకు సరైన తిండి లేదు
  • రూ. 1,400 కోట్ల రీయింబర్స్​మెంట్లు, స్కాలర్​షిప్​లు పెండింగ్​ 
  • కార్పొరేషన్లు, ఫెడరేషన్లకు ఫండ్స్​ విడుదల చేస్తలే
  • అప్లికేషన్లకే పరిమితమైన  స్వయం ఉపాధి లోన్లు
  • మోడ్రన్​ సెలూన్లు,  దోభీఘాట్ల ఊసులేదు
  • ఆత్మగౌరవ భవనాల నిర్మాణం ముందుకు సాగుతలేదు

హైదరాబాద్‌‌, వెలుగు: బీసీల సంక్షేమాన్ని రాష్ట్ర  సర్కారు గాలికొదిలేసింది. రాష్ట్ర జనాభాలో 54 శాతం ఉన్న బీసీలకు ఎంతో చేస్తున్నామని చెప్పడమే తప్ప ఆచరణలో చూపడం లేదు. బీసీ వెల్ఫేర్‌‌ శాఖను నిర్వీర్యం చేసే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. చదువు నుంచి స్వయం ఉపాధి వరకు అన్నిరంగాల్లో బీసీలు వంచనకు గురవుతున్నారు.  ఫీజు రీయింబర్స్‌‌మెంట్‌‌కు పరిమితులు పెట్టి పేద బీసీ స్టూడెంట్లకు  ఇంజనీరింగ్‌‌ వంటి ఉన్నత చదువును దూరం చేస్తున్నారు. గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు కట్టించే ప్రయత్నమే జరగడం లేదు. స్థలం కేటాయిస్తే భవన నిర్మాణాలకు 80 శాతం నిధులు గ్రాంట్‌‌ రూపంలో ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు ప్రయత్నాలే చేయడం లేదు. సంచార కులాల కోసం పెట్టిన ఎంబీసీ కార్పొరేషన్‌‌ అస్తిత్వమే ప్రమాదంలో పడింది. బీసీ కార్పొరేషన్‌‌, 11 ఫెడరేషన్లకు పైసా కేటాయించడం లేదు. సంక్షేమ శాఖకు ఫుల్‌‌టైం ప్రిన్సిపల్‌‌ సెక్రటరీ లేరు. పరిపాలన సంబంధమైన అనేక పోస్టులను ప్రభుత్వం ఖాళీగా ఉంచి ఇన్‌‌చార్జులతో నెట్టుకువస్తున్నది.

ఉప ఎన్నిక ఉన్న చోటనే..!

ఎంబీసీ కార్పొరేషన్‌‌కు ప్రభుత్వం వరుసగా మూడు బడ్జెట్లలో కలిపి రూ.2,400 కోట్లు కేటాయించినప్పటికీ 100 కోట్లు కూడా రిలీజ్‌‌ చేయలేదు. రెండో విడత గొర్రెల పంపిణీని ఉప ఎన్నికలు జరిగిన హుజూరాబాద్‌‌, మునుగోడుకే పరిమితం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది గొల్లకురుమలు ఈ స్కీం కోసం ఎదురు చూస్తున్నారు. నాయీ బ్రాహ్మణులకు మోడ్రన్‌‌ సెలూన్లు, రజకులకు దోభీఘాట్లు కట్టించి ఇస్తామని సీఎం కేసీఆర్‌‌ అసెంబ్లీ వేదికగా పలుమార్లు ప్రకటించారు. కానీ ఒక్క యూనిట్‌‌ కూడా మంజూరు చేయలేదు.  చెప్పుకుంటూ పోతే అన్నింటా బీసీలు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నారు.

ఇన్​చార్జ్​ ఆఫీసర్లే దిక్కు

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌‌‌‌‌‌‌‌ సెక్రటరీగా ఉన్న సీనియర్‌‌‌‌‌‌‌‌ ఐఏఎస్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ బుర్రా వెంకటేశం పలుమార్లు నెల, అంతకన్నా ఎక్కువ రోజులు లాంగ్‌‌‌‌‌‌‌‌ లీవ్‌‌‌‌‌‌‌‌లు పెడుతున్నారు. ఆయనే బీసీ వెల్ఫేర్‌‌‌‌‌‌‌‌ కమిషనర్‌‌‌‌‌‌‌‌గానూ బాధ్యతల్లో ఉన్నారు. ఎంబీసీ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌కు సీఈవోగా, బీసీ కమిషన్‌‌‌‌‌‌‌‌కు మెంబర్‌‌‌‌‌‌‌‌ సెక్రటరీగానూ ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు. బుర్రా వెంకటేశం మినహా బీసీ సంక్షేమ శాఖలో ఇంకో ఐఏఎస్‌‌‌‌‌‌‌‌ అధికారి లేరు. రాష్ట్ర జనాభాలో సగానికి పైగా వెనుకబడిన తరగతుల సంక్షేమానికి ప్రభుత్వం ఎంత ప్రాధాన్యం ఇస్తున్నదో ఉన్నతాధికారుల పోస్టింగులే స్పష్టం చేస్తున్నాయి. ఇతర  గురుకులాల సెక్రటరీగా ఐఏఎస్‌‌‌‌‌‌‌‌, ఐఎఫ్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లను నియమించిన ప్రభుత్వం 330 బీసీ గురుకులాలకు మాత్రం గ్రూప్‌‌‌‌‌‌‌‌ -1 ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ను సెక్రటరీగా నియమించింది.  11 బీసీ ఫెడరేషన్‌‌‌‌‌‌‌‌లకు ఎండీగా ఈయనకే అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లో మిగతా బాధ్యతల్లో ఇంకో నలుగురు అధికారులు మాత్రమే ఉన్నారు. ఈ పోస్టులన్నీ ఐఏఎస్‌‌‌‌‌‌‌‌ అధికారులతో భర్తీ చేయాల్సిన ప్రభుత్వం పట్టించు కోవడం లేదు. జిల్లాల్లో బీసీ కమిషన్‌‌‌‌‌‌‌‌కు ఎగ్జిక్యూటివ్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లను నియమించడం లేదు. 
అనేక జిల్లాల్లో బీసీ వెల్ఫేర్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ పోస్టుల్లోనూ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జ్​ అధికారులే ఉన్నారు.

స్వయం ఉపాధి లోన్లు ఇస్తలే

బీసీ, ఎంబీసీ కార్పొరేషన్లు, రజక, నాయీ బ్రాహ్మణ, కల్లుగీత, వడ్డెర, సగర, వాల్మీకి (బోయ), కృష్ణ బలిజ (పూసల), భట్రాజు, కుమ్మరి, మేదర, విశ్వబ్రాహ్మణ ఫెడరేషన్ల ద్వారా స్వయం ఉపాధి లోన్ల  కోసం లక్షలాది మంది యువత ఎదురు చూస్తున్నారు. 2014లో కేసీఆర్‌‌‌‌‌‌‌‌ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ యువతకు స్వయం ఉపాధి లోన్లు ఇస్తామని ప్రకటిస్తే 3.62 లక్షల మంది అప్లయ్‌‌‌‌‌‌‌‌ చేసుకున్నారు. 2018 ఎన్నికలకు ముందు మరోసారి ప్రకటన వస్తే 5.75 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో కేవలం 40 వేల మందికి రూ. 50 వేల చొప్పున ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఫెడరేషన్ల ద్వారా లోన్ల కోసం అప్లయ్‌‌‌‌‌‌‌‌ చేసుకున్న వాళ్లు 50 శాతం మొత్తాన్ని తమ వాటాగా అప్పులు తెచ్చి బ్యాంకుల్లో డిపాజిట్‌‌‌‌‌‌‌‌ చేశారు. ఏండ్ల తరబడి లోన్‌‌‌‌‌‌‌‌లే రాకపోవడంతో ఎక్కువ మంది ఆ డిపాజిట్లు  విత్‌‌‌‌‌‌‌‌ డ్రా చేసుకున్నారు. ఒకటి, రెండు కులాల ఫెడరేషన్లే  స్కిల్‌‌‌‌‌‌‌‌ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై శిక్షణ ఇచ్చినా వాళ్లకు స్వయం ఉపాధి కోసం లోన్లు, సామగ్రి సమకూర్చలేదు.

ఆత్మగౌరవ భవనాలకు పునాదులూ పడలే

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ శివారుల్లో బీసీల ఆత్మగౌరవ భవనాల కోసం భూములు కేటాయించామని రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంది. వెలమ, కమ్మ కులాలకు హైటెక్‌‌‌‌‌‌‌‌ సిటీ సమీపంలో వందల కోట్ల విలువ చేసే భూములు ఇచ్చి.. బీసీలకు గుట్టలు, బండరాళ్లతో కూడిన భూములు కేటాయించింది. ఒకటి, రెండు కులాల భవనాలు మినహా మిగతా కులాల భవనాల నిర్మాణం కోసం కనీసం పునాదులు కూడా తీయలేదు. వాటి నిర్మాణానికి   నిధులు కూడా ఇవ్వడం లేదు. 

రీయింబర్స్​మెంట్​ పెంచదు.. బకాయిలు ఇవ్వదు

బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం రూ.35 వేలుగా చేసింది. అయితే, ఫీజుల రెగ్యులేటరీ కమిషన్‌‌‌‌‌‌‌‌ ఇటీవల ఇంజనీరింగ్‌‌‌‌‌‌‌‌ కనీస ఫీజును రూ. 45 వేలకు పెంచినా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రూ. 35 వేలకే స్కీంను పరిమితం చేసింది. రాష్ట్రంలోని వంద కాలేజీల్లో కనీస ఫీజు రూ. 80 వేలుగా ఉంది.. టాప్‌‌‌‌‌‌‌‌ కాలేజీల్లో రూ. లక్ష నుంచి లక్షన్నరకు పైగా ఉంది. ఆయా కాలేజీల్లో సీట్లు పొందినా ఫీజులు కట్టే స్తోమత లేక నిరుపేద బీసీ విద్యార్థులు సీట్లు వదులుకోవాల్సి వస్తున్నది. బీసీల స్కాలర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లు, రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ బకాయిలు రూ.1,400 కోట్లు పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయి. వాటిని విడుదల చేయకపోవడంతో కోర్సులు పూర్తి చేసినా కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ఫలితంగా విద్యార్థులు ఉన్నత విద్యా అవకాశాలతో పాటు ఉద్యోగాలను కోల్పోతున్నారు. బీసీ విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఫీ రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ అమలు చేస్తే అదనంగా రూ.150 కోట్ల భారం మాత్రమే పడుతుందని, దీనిని పరిశీలించి అమలు చేయాలని పలుమార్లు బీసీ సంఘాలు కోరినా ప్రభుత్వం కనీసం పరిశీలన కూడా చేయలేదు. ఏటా 300 మందికే మహాత్మా జ్యోతిబా ఫూలే ఓవర్సీస్‌‌‌‌‌‌‌‌ స్కాలర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లు పరిమితం చేస్తున్నారు. దీంతో వందలాది మంది విదేశాల్లో చదివే అవకాశాలు కోల్పోతున్నారు.

సర్కార్​లో చలనం లేదు

రాష్ట్ర జనాభాలో 54 శాతం ఉన్న బీసీల సంక్షేమాన్ని కేసీఆర్‌‌‌‌‌‌‌‌ గాలి కొదిలేసిండు. బీసీ మంత్రి ఉన్నా కరీం నగర్‌‌‌‌‌‌‌‌ దాటి రారు. ప్రిన్సిపల్‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ ఏదో కారణంతో ఎప్పుడూ లీవ్‌‌‌‌‌‌‌‌లోనే ఉంటున్నరు. గురుకులాలు, కాలేజీ హాస్టళ్లకు భవనాలు మంజూరు చేయాలని మేం ప్రధానిని కోరితే స్థలాలు కేటాయించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రపోజల్స్‌‌‌‌‌‌‌‌ పంపితే 80 శాతం నిధులు గ్రాంట్‌‌‌‌‌‌‌‌గా ఇస్తమన్నరు. ఇదే విషయం సీఎం, రాష్ట్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లినా అలాంటి ప్రయత్నమేదీ చేయడం లేదు. రాష్ట్రంలో 16 ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ యూనివర్సిటీలు ఏర్పాటు చేసి, వాటిలో రిజర్వేషన్లు అమలు చేయడం లేదు. ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం 2006లో చట్టం తెచ్చింది. సుప్రీంకోర్టు 2007లో దానికి ఆమోదం తెలిపింది. ప్రైవేటు వర్సిటీల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని యూజీసీ ఇటీవలే సర్క్యులర్‌‌‌‌‌‌‌‌ ఇచ్చింది. ఈ విషయాలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినా ఫలితం లేకుండా పోయింది. - ఆర్‌‌‌‌‌‌‌‌. కృష్ణయ్య, ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు

గురుకులాలకు సొంత బిల్డింగ్స్​ లేవు

బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 330 గురుకులాలు, 280 కాలేజీ హాస్టళ్లు ఉన్నాయి. 20 గురుకులాలకు మాత్రమే సొంత బిల్డింగులు ఉండగా..  మిగతా 310 గురుకులాలు అద్దె ఇండ్లల్లో కొనసాగుతున్నాయి. 280 కాలేజీ హాస్టళ్లలో ఒక్క హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోనే 90 ఉన్నాయి. కాలేజీ హాస్టళ్లన్నీ అద్దె ఇండ్లలో నిర్వహిస్తున్నారు. వాటిల్లో కనీస వసతులు కూడా లేకపోవడంతో ప్రస్తుతం చలి తీవ్రతతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని గురుకులాలు హైస్కూల్‌‌‌‌‌‌‌‌ నుంచి జూనియర్‌‌‌‌‌‌‌‌ కాలేజీకి అప్‌‌‌‌‌‌‌‌గ్రేడ్‌‌‌‌‌‌‌‌ అయినా అందుకు తగ్గట్టుగా ప్రభుత్వం వసతులు పెంచలేదు. కొత్తగా 33 జిల్లాలకు గురుకులాలు మంజూరు చేసింది. వాటిని కొత్త భవనాల్లో కాకుండా ఇప్పటికే ఉన్న అద్దె భవనాల్లోనే ఏర్పాటు చేశారు. దీంతో పరిమితికి మించి ఒకే ఆవరణలో వందలాది మంది విద్యార్థులు ఉంటూ చదువుకోవాల్సి వస్తున్నది. టాయిలెట్లు, తాగునీరు సహా ఇతర సదుపాయాలు లేక అవస్థలు పడుతున్నారు. దేశంలోనే ఎక్కడా లేనన్ని బీసీ గురుకులాలు ఏర్పాటు చేశామని గొప్పగా చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం వాటికి సొంత భవనాలు మాత్రం నిర్మించడం లేదు. వసతులు కల్పించడం లేదు. పటిష్టమైన సెక్రటేరియట్‌‌‌‌‌‌‌‌ బిల్డింగ్‌‌‌‌‌‌‌‌ కూల్చేసి సుమారు రూ. వెయ్యి కోట్లతో కొత్త సెక్రటేరియట్​ను, అన్ని జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్‌‌‌‌‌‌‌‌ కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌ కాంప్లెక్స్‌‌‌‌‌‌‌‌లు, డిస్ట్రిక్ట్‌‌‌‌‌‌‌‌ పోలీస్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లు, ఇతర ప్రభుత్వ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లకు భవనాలు నిర్మిస్తున్న ప్రభుత్వం..  బీసీ గురుకులాలు, కాలేజీ హాస్టళ్లకు మాత్రం సొంత బిల్డింగ్స్​ నిర్మించకపోవడం ఏమిటని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. గురుకులాలు, కాలేజీ హాస్టళ్లలో విద్యార్థులకు పౌష్టికాహారం అందడం లేదు. 

అమలు కాని ప్రత్యేక పాలసీ

బీసీల ఉన్నతి కోసం ప్రత్యేక పాలసీ తెస్తామని అసెంబ్లీలో మూడు రోజుల పాటు చర్చలు జరిపారు. మంత్రులు తొమ్మిది రోజులు సంక్షేమంపై రివ్యూలు పెట్టారు. దాదాపు 210 తీర్మానాలు చేశారు. కానీ వాటిలో ఒక్కటీ అమలు చేయలేదు. బీసీ పాలసీపై ఇచ్చిన మంత్రుల నివేదిక సీఎం దగ్గరే ఆగిపోయింది. ఎస్సీ, ఎస్టీ సబ్‌‌ ప్లాన్‌‌ తరహాలోనే బీసీ సబ్‌‌ ప్లాన్‌‌ తెస్తామని కేసీఆర్‌‌ స్వయంగా ప్రకటించారు. కానీ, దానిపై 
ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.