
రాష్ట్రవర్ధన మెదగోరు రాజు మేలు
రాష్ట్రమును గోరు దాన గార్యమొ యనంగ
రాదు బ్రహ్మోత్తరములైన ప్రజల యేక
ముఖపు గోర్కి దదంతరాత్ముండొసగడె
ప్రజా పరిపాలకుడైన రాజు తన చేతలలోనే కాదు హృదయంలో సైతం ప్రజల అభివృద్ధిని కోరుకోవాలి. అలా కోరుకున్న రాజు క్షేమంగా ఉండాలని ఆయన అభివృద్ధిని ప్రజలు తప్పనిసరిగా కోరుకుంటారు. అలా కోరుకోవటం వలన ప్రయోజనం ఏంటి? అని అనుకోకూడదు. అన్ని వర్ణాలకు చెందిన ప్రజలందరూ కోరుకునే ఒకే కోరికను ఆ సర్వాంతర్యామి అయిన భగవంతుడు నెరవేర్చుతాడు కదా... అని ‘ఆముక్తమాల్యద’లో యామున ప్రభువు రాజనీతి ద్వారా శ్రీకృష్ణదేవరాయలు సందేశాన్ని ఇస్తున్నాడు.
‘ప్రజ’ అనే పదానికి ‘సంతానం’ అని అర్థం. అందుకే రాముడిని ‘కౌసల్యా సుప్రజా రామా..’ అంటారు. కౌసల్యా దేవి కుమారుడు రాముడు అని అర్థం. ఒక రాజ్యాన్ని పాలించే ప్రభువు తన ఏలుబడిలోని వారిని కన్నబిడ్డల్లా భావించాలి. అందుకే వారిని ప్రజలు అని అంటారు. రాజు ప్రజల అభివృద్ధిని కాంక్షించాలి. అది మాటల్లో కాదు, చేతల్లో, హృదయంలో కూడా ఉండాలి. సింహాసనం మీద కూర్చున్న తరువాత రాజు నిరంతరం ప్రజల అభివృద్ధి కోసం పాటుపడుతుండాలి. అటువంటి ప్రభువు పరిపాలకుడుగా ఉన్నప్పుడు ఆ రాజ్యంలోని ప్రజలు తమ ప్రభువు క్షేమంగా ఉండాలని త్రికరణశుద్ధిగా కోరుకుంటారు. పశుపక్ష్యాదులు సైతం వాటి నాయకత్వానికి తగిన న్యాయం చేస్తాయి. ఒక కాకికి ఏదైనా హాని జరిగితే, మిగతా కాకులన్నీ అక్కడకు చేరుకుంటాయి. చీమలన్నీ వాటికి నాయకత్వం వహిస్తున్న చీమ చెప్పిన విధంగా నడుచుకుంటాయి. నాయకస్థానంలో ఉన్న చీమ లేదా కాకి... తన ఏలుబడిలో ఉన్న వాటి సంరక్షణ భారం మీద శ్రద్ధ వహిస్తాయి.
మేవాడ్ ప్రభువు మహారాణా సంగ్రామ్ సింగ్. 16వ శతాబ్దానికి చెందినవాడు. ఆయనకు నలుగురు సంతానం. నాలుగో కుమారుడైన ఉదయ్‌సింగ్ 1522లో పుట్టిన దగ్గర నుంచి ‘పన్నా’ అనే ఆయా ఆయనను పెంచుతుంది. ఉదయ్ సింగ్ పన్నా దగ్గరే పాలు తాగి పెరుగుతాడు. పన్నాకు చందన్ అనే కొడుకు ఉంటాడు. వీళ్లిద్దరూ ఒకే వయసువారు కావటం వల్ల ఇద్దరూ కలిసి పెరుగుతారు. రాణా సంగ్రామ్ సింగ్ మరణించిన తరువాత వీరి బంధువు అయిన భన్వీర్ సింగ్ రాజ్యం కోసం ఉదయ్ సింగ్‌ను చంపేందుకు ప్రయత్నిస్తాడు. ఆ సమయంలో ఉదయ్ సింగ్‌ను కాపాడటం కోసం పన్నా ఏ తల్లీ చేయని త్యాగం చేస్తుంది. ఉదయ్ సింగ్ స్థానంలో చందన్‌ను ఉంచుతుంది. ఆ పిల్లవాడే ఉదయ్‌సింగ్ అనుకుని భన్వీర్ సింగ్ చందన్‌ను చంపేస్తాడు. ఆ విధంగా పన్నా తన కుమారుడిని త్యాగం చేసినట్లు చరిత్ర చెప్తోంది. ఈ అంశాన్ని ‘పన్నా కీ త్యాగ్’ పేరున చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది.
తన కుమారుడిని త్యాగం చేసిన పన్నా ఒక సామాన్య స్త్రీ. చందన్‌ను త్యాగం చేయటం వల్ల ఉదయ్‌సింగ్ బతికిబయటపడి, ఆ తరువాత ప్రజలను పరిపాలిస్తాడనేది పన్నా ఆలోచన. ఒక రాజ వంశం నిలబడటం కోసం ఆ స్త్రీ అంత త్యాగం చేసింది. అందుకు కారణం రాణా సంగ్రామ్‌సింగ్. ఆయన పాలనలో ప్రజలంతా సుఖశాంతులతో విలసిల్లారు. ఆయన నిరంతరం తన ప్రజల గురించే తన మనసులో కూడా ఆలోచనచేసేవాడని ప్రతీతి. పన్నాను ఆయాలా కాకుండా ఇంటి మనిషిలా ఆదరించేవాడట. అందువల్లే ఆమె తన ప్రభువు రుణం తీర్చుకోవాలనుకుంది. తన బిడ్డను త్యాగం చేసి రాజ్యాన్ని నిలబెట్టింది. ఉదయ్‌సింగ్ పెరిగి పెద్దవాడై మేవాడ్‌ను పరిపాలించాడు. ఆ తరవాత వచ్చిన రాణాప్రతాప్ సింగ్ ఈయన కుమారుడే. ఆ విధంగా పన్నా చేసిన త్యాగం, చూపిన సాహసం.. ఒక రాజ్యాన్ని నిలబెట్టాయి. ఇటువంటి కథలు చరిత్రలో చాలానే కనిపిస్తాయి.
అందుకే... ‘యథా రాజా తథా ప్రజా’ అనే మాట వాడుకలోకి వచ్చింది. ప్రజలను పరిపాలించే రాజు ప్రజలను కన్నబిడ్డలుగా భావిస్తే, ఆ రాజుకి కష్టం వచ్చినప్పుడు ప్రజలంతా ముందు నిలబడి తమ ప్రభువును రక్షించుకుంటారు. అదే రాజు తన ప్రజలను పీడిస్తుంటే, ఆ ప్రభువు మీద తిరుగుబాటు చేస్తారని చరిత్ర చెప్తోంది. ఈ విషయాన్ని శ్రీకృష్ణదేవరాయలు తన ఆముక్త మాల్యదలో స్పష్టంగా వివరించాడు.
- డా. వైజయంతి పురాణపండ
ఫోన్: 80085 51232