ప్రాంక్ వీడియోలతో పరేషాన్ చేస్తున్రు

ప్రాంక్ వీడియోలతో పరేషాన్ చేస్తున్రు

ఓ  పెద్దాయన కూరగాయల సంచితో నడుచుకుంటూ వెళ్తున్నాడు. నిర్మానుష్యంగా ఉన్న ఆ వీధిలోకి ఎక్కడి నుంచో హఠాత్తుగా నలుగురు కుర్రాళ్లు వచ్చారు. వాళ్లలో వాళ్లు గొడవపడి హఠాత్తుగా వాళ్లలో ఒకర్ని కత్తితో  పొడిచేశారు. ఇది చూసి కంగారుపడిన పెద్దాయన కూరగాయల సంచి వదిలేసి అటు నుంచి అటే వెనక్కి పరుగుతీశాడు. ఇదంతా దూరంగా ఓ కెమెరా షూటింగ్​ చేస్తోంది. అంటే ఇదేదో సినిమా షూటింగ్​ అనుకునేరు. కానేకాదు ‘ప్రాంక్​’ల పేరుతో ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతున్న తతంగం.

సరదా మాటలు, నవ్వించే రాతలు, గీతలు, చిలిపి చేష్టలు.. చక్కటి హాస్యానికి చిరునామాలు. వీటిలో ఏ ఒక్కటి గతి తప్పినా అపహాస్యమే. జోక్స్​ వేయడం, నవ్వించేలా కార్టూన్స్​/క్యారికేచర్స్​ గీయడం అంత ఈజీ  కాదు. ఇక చిలిపి చేష్టల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.  లేకపోతే పరిస్థితులు గందరగోళంగా తయారవుతాయి. కాలం మారింది. టెక్నాలజీ తోడయ్యాక తిట్లు/బూతులు, శరీరాన్ని లక్ష్యంగా చేసుకొని హాస్యం వెగటు పుట్టించేలా తయారైంది. ఇందులో ‘ప్రాంక్’ పేరుతో జరిగేవి మనుషుల్ని ఇబ్బంది పెట్టేవిగా ఉంటున్నాయి. అయితే వీటినీ ఎంజాయ్​ చేస్తున్నవాళ్లూ ఉన్నారు. అందుకే ప్రపంచమంతా ప్రాంక్​ల గోల తారస్థాయికి చేరింది. కొన్ని దేశాల్లో ఏకంగా ‘ప్రాంక్​’ వీడియోలు సీరియల్స్, సిరీస్​లుగా టీవీలు, యూట్యూబ్​ల్లో కూడా టెలికాస్ట్​ అవుతున్నాయి. మనదేశంలో టీవీల వరకూ చేరనప్పటికీ యూట్యూబ్​లో ప్రాంక్​ వీడియోలు ఎక్కువగానే ఉన్నాయి. వస్తున్నాయి కూడా. ఈ మధ్య ప్రాంక్‌ వీడియోలపైన వివాదాలు మరీ ఎక్కువయ్యాయి. టీవీ ఛానెళ్లలో కూడా వీటిపై డిబేట్లు జరిగాయి. ఓ సినిమా ప్రమోషన్‌లో భాగంగా హీరో విశ్వక్సేన్‌ ప్రాంక్ చేయడంతో... దానిమీద కేసు కూడా నమోదైంది. ఆ తర్వాత... ప్రాంక్‌ వీడియోలు చేసే శ్రీకాంత్‌ అనే యూట్యూబర్‌‌ని నటి కరాటె కళ్యాణి కొట్టిన వివాదం పోలీస్‌స్టేషన్‌లో కేసుల వరకు వెళ్లింది. ఇవే కాదు.. ఇదివరకు కూడా ఇలా బోల్తా కొట్టిన ప్రాంక్‌ వీడియోలు బోలెడు ఉన్నాయి.  

జకాస్​తో మొదలై...

ప్రాంక్​ వీడియోలను మొదట తెచ్చింది జకాస్. ఇది అమెరికాలో రియాలిటీ కామెడీ షో.  దీని రూపకర్తలు జెఫ్​ ట్రెమైన్​, స్పైక్​ జాంజ్​, జానీ నాక్స్​విల్లీ. అక్టోబర్​ 2000 నుంచి ఆగస్టు 2001 మధ్య మూడు సీజన్లలో ఈ షో టీవీలో ప్రసారమైంది. ఇందులో తొమ్మిది మంది ప్రధాన పాత్రధారులు ఉండేవాళ్లు. వీళ్లంతా ఒకళ్ల మీద మరొకరు లేదా జనాల మధ్యలో కొన్ని రకాల స్టంట్లు, ప్రాంక్​లు చేసేవాళ్లు. అయితే, సమాజంలో అసభ్యత, ప్రమాదకర ప్రవర్తన  ప్రేరేపించేలా ఈ షో ఉందని విమర్శలు రావడంతో 2002లో టెలికాస్ట్​ చేయడం ఆపేశారు. 

 

యూట్యూబ్​ అందుకుంది

విమర్శలతో జకాస్​ ఆగిపోయిన చాలా ఏండ్లకు జెస్సీ వెల్లెన్స్​ తన గర్ల్​ఫ్రెండ్​ జియానా స్మిత్​తో కలసి ‘ప్రాంక్​’ వీడియోలను మళ్ళీ మొదలుపెట్టాడు.  వీళ్లిద్దరూ వాళ్లలో వాళ్లే తగవుపడుతున్నట్లు, ప్రమాదకర పందాలు వేసుకుంటున్నట్లు.. రకరకాల వీడియోలు నిజమని నమ్మేలా తీసి వెబ్​సైట్లలో పెట్టడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ప్రాంక్ వర్సెస్ ​ప్రాంక్​ పేరుతో యూట్యూబ్​లో ఛానెల్​ క్రియేట్​ చేశారు. అందులో వీడియోలు ఉంచేవాళ్లు. వీటిని చూసే వాళ్ల సంఖ్య బాగా ఉండడంతో వెల్లెన్స్​, స్మిత్​ను యూట్యూబ్​ కాంటాక్ట్​ చేసింది. వాళ్లతో కలసి ‘ప్రాంక్​ అకాడమీ’ ద్వారా  ​కొన్ని ప్రాంక్​ వీడియోలు చేసింది. ఓ వ్లాగర్​​ వంట చేస్తుండగా మంటలు చెలరేగి అక్కడి ఓ మహిళా సిబ్బందికి అంటుకోవడాన్ని మొదటి ఎపిసోడ్​గా చేసింది. ఈ వీడియోను లక్షల మంది చూశారు. అదే టైమ్​లో అట్వుడ్​,​ రోడీ, విటలీ బృందం భయంకరమైన ప్రాంక్​ వీడియోలు తీసింది. ‘నేచురల్​ బోర్న్​ ప్రాంక్​స్టర్స్​’  పేరుతో వీళ్లు చేసిన వీడియోలు భయంకరంగా ఉన్నాయని అమెరికాలో న్యూస్​ పేపర్స్​ మొదటి పేజీ వార్తలుగా వేశాయి. ముఖ్యంగా అట్వుడ్​.. భార్య ఎదురుగానే కుమారుడిని చంపుతున్నట్లు తీసిన ​ వీడియో తీవ్ర విమర్శల పాలైంది. అయినప్పటికీ అట్వుడ్​ ప్రాంక్​లు తీయడం ఆపలేదు. అయితే, 2019 నుంచి అతని ఛానెల్​లో వీడియోలు రావడం ఆగిపోయాయి. ఎదుటివారి భయం, అమాయకత్వం, ఇబ్బంది వంటి వాటిని ఆసరాగా చేసుకొని ప్రాంక్​ల పేరుతో  వీడియోలు తీయడం మంచిది కాదు.  ఏ రకంగానూ ఇబ్బంది  పెట్టని మాటలు, చేతలతో నవ్వించినప్పుడే హాస్యం అపహాస్యం కాకుండా ఉంటుంది.               

వివాదాస్పదం సామ్​ పెప్పర్​

ప్రాంక్​ల చరిత్రలోనే అత్యంత వివాదాస్పదమైనవి సామ్​ పెప్పర్​ తీసిన వీడియోలు. ఇంగ్లాండ్​కు చెందిన పెప్పర్ ప్రాంక్​ వీడియోలు తీయడంలో దిట్ట. ప్రాంక్​స్టర్​గా, టిక్​టాకర్​గా చాలా ఫేమస్.  2010లో యూబ్యూబ్​లో సొంత ఛానెల్​ ప్రారంభించాడు. దీనికి సుమారు 20లక్షలకు పైగా సబ్​స్ర్కైబర్లు ఉన్నారు. ఈ ఛానెల్​లో సామ్​​ ఉంచిన ప్రాంక్​ వీడియోల్లో రెండు తీవ్ర దుమారం సృష్టించాయి. వాటిలో మొదటిది.. రోడ్డు మీద వెళ్తున్న మహిళలు, అమ్మాయిల వెనక భాగంపై తట్టి.. తాను వెళ్లాల్సిన రూట్​ అడుగుతూ చేసిన ‘‘ఫేక్​ హ్యాండ్​ యాస్​ పించ్​ ప్రాంక్​’’.  రెండోది.. ఒక స్నేహితుడిని మరొక స్నేహితుడి ఎదురుగా  తుపాకీతో  కాల్చి చంపుతున్నట్లు తీసిన ‘‘కిల్లింగ్​ బెస్ట్​ ఫ్రెండ్​ ప్రాంక్​’’.  మొదటి వీడియో మహిళలను లైంగిక హింసకు గురిచేస్తున్నట్లు ఉంది. దాన్ని వెంటనే యూట్యూబ్​ నుంచి తీసేసి, సామ్​​ను శిక్షించాలంటూ లక్షకు పైగా సంతకాలు సేకరించి మరీ ఫిర్యాదు చేశారు.  అయితే, మొదట ఈ రెండు వీడియోల్లో తప్పేంలేదని మాట్లాడిన సామ్​..​ ఆ తర్వాత వాటిని యూట్యూబ్​ నుంచి తొలగించాడు. అంతేకాదు, క్షమాపణలు చెప్తూ మరో వీడియోను యూట్యూబ్​లో ఉంచాడు.