సివిల్​ హాస్పిటల్ లో సమస్యలపై చర్చ కరువు

సివిల్​ హాస్పిటల్ లో సమస్యలపై చర్చ కరువు
  • సివిల్ హాస్పిటల్ లో అధికారులు, సిబ్బంది ఇష్టారాజ్యం 
  • మీటింగ్​జరగకున్నా పట్టించుకోని  ప్రజాప్రతినిధులు 

కరీంనగర్, వెలుగు:  కరీంనగర్​ జిల్లాలో ఏడాదిగా హాస్పిటల్ డెవలప్ మెంట్ సొసైటీ(హెచ్​డీఎస్) మీటింగ్​​జరగడం లేదు. జిల్లాలో వైరల్ ఫీవర్లు, డెంగీ, టైఫాయిడ్, మలేరియా.. తదితర సీజనల్ జబ్బులు విజృంభిస్తున్నా హాస్పిటల్​ అభివృద్ధిపై చర్చించేందుకు మీటింగ్​లు ఏర్పాటు చేయడంలేదు. ప్రతి మూడు నెలలకొకసారి హెచ్​డీఎస్ మీటింగ్​ జరగాల్సి ఉన్నా ఆ ఊసే ఎత్తడంలేదు. మీటింగ్ పెడితే ఎక్కడ అభివృద్ధిపై చర్చ జరుగుతుందోననే అభద్రతా భావంతోనే ఏర్పాటు చేయడం లేదనే ఆరోపణలున్నాయి. ప్రజాప్రతినిధులు సైతం పట్టనట్లుగా ఉండటంతో అధికారులు, సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. 

మెయింటనెన్స్ లేదు.. సౌలత్ లు లేవు

ఉమ్మడి జిల్లాతో పాటు ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల నుంచి వచ్చే పేషెంట్లకు కరీంనగర్ సివిల్​హాస్పిటల్​సేవలందిస్తోంది. లక్షలు ఖర్చు చేస్తున్నా హాస్పిటల్ లో శానిటరీ మెయింటనెన్స్​సరిగా లేదు. బాత్ రూమ్ లు సరిగా క్లీన్ చేయకపోవడంతో కంపు కొడుతుండగా.. డోర్లు కూడా లేకపోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు.  ఫ్యాన్లు, లైట్లు అవి ఎప్పుడు పనిచేస్తాయో వాటికే తెలియాలి. నల్లాలు విరిగిపోయాయి. రూ.10లక్షలతో నిర్మించిన మార్చురీని నేటికీ ఓపెన్​చేయలేదు. కొద్ది రోజుల కిందట పెదవికి దెబ్బ తగిలి వస్తే వార్డ్ బాయ్ ఒకరు పెదవికి కుట్లు వేయాల్సింది పోయి కంటికి వేశాడు..  సదరు వార్డుబాయ్‌‌‌‌ గతంలో కూడా చాలా సార్లు మద్యం మత్తులో ఇలాంటి పనులే చేసినా అధికారులు పట్టించుకోలేదు. ఇక మాతా శిశు సంరక్షణ విభాగంలో కాన్పులకు వచ్చిన వారిని సిబ్బంది పైసలకు పీడిస్తున్నారు. శిశువులను చూయించాలన్నా, బెడ్ షీట్లు మార్చాలన్నా పైసలు ఇయ్యాల్సిందే. ఇలాంటివి ఆఫీసర్ల దృష్టికి వెళ్లినా నిలువు దోపిడీకి అడ్డుకట్ట పడటం లేదు. డాక్టర్లు సైతం సమయపాలన పాటించకపోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు.  

హెచ్ డీఎఫ్ నిధులపై పర్యవేక్షణేది..?   

హాస్పిటల్ డెవలప్ మెంట్ కోసం ఖర్చు చేయాల్సిన ఫండ్స్ పై పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టారీతిగా ఖర్చు చేస్తున్నారు. హెచ్​డీఎఫ్​ అకౌంట్​లో ప్రతి నెలా రూ.2లక్షలకు పైగా జమ అవుతాయి. వీటిలో సగ భాగం ఐదుగురు పీఆర్వోల జీతాలకే పోతున్నాయి. ఇక మిగిలిన రూ.లక్షతో ఎమర్జెన్సీ మందుల కొనుగోలు పేరుతో స్వాహా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.  ఒకవేళ మందులు కొంటే వాటికి సంబంధించి ఎలాంటి బిల్లులు, పత్రాలు ఉండటం లేదు.  ఎమర్జెన్సీ టైంలో రోగులను ఇతర హాస్పిటల్స్ కు తరలించడానికి, ఎమర్జెన్సీ సర్వీసులకు డీజిల్ వాడకం తప్పనిసరి. ఇలా డీజిల్ మీద సుమారు  రూ. 20వేల నుంచి రూ. 30 వేల వరకు నిధులను ఖర్చు చేస్తున్నారు. ఇవి సక్రమంగానే వాహనాలకు వెళ్తున్నాయా.. పక్కదారి పడుతున్నాయా అనే సందేహాలు వస్తున్నాయి. మాతా శిశు సంరక్షణ కేంద్రంలో మెరుగైన సౌకర్యాలను కోరుకునే వారి కోసం పేయింగ్ రూమ్ లను నిర్మించారు.  వీటి  రెంట్ రూ.500 ఉంటుంది. అన్ని రూమ్ ల నుంచి వచ్చే అమౌంట్ ను హెచ్ డీఎఫ్ ఖాతాలో జమ చేసి, హాస్పిటల్ లో ఏదైనా పనుల కోసం వాడుకోవచ్చు. కానీ అలాంటిదేమీ కనిపించడం లేదు. ఈ ఫండ్స్​ పై పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తే ఇందులోని అవకతవకలు బయటపడతాయి. 

పాలన గాడి తప్పింది... 

హాస్పిటల్ డెవలప్ మెంట్ సొసైటీకి చైర్మన్ గా జడ్పీ చైర్మన్​/ చైర్​పర్సన్ వ్యవహరిస్తారు.  గతంలో మీటింగ్ లు  బాగానే నిర్వహించినా.. ఈ ఏడాది అసలే  మీటింగ్ లు నిర్వహించలేదు. దీంతో హాస్పిటల్ పాలన గాడి తప్పింది.  మూడు నెలలకొకసారి మీటింగ్ జరగాల్సి ఉండగా.. ఈ మీటింగ్ లలో రోగుల అవస్థలు.. సౌకర్యాలపై సభ్యులు ప్రశ్నిస్తారనే నిర్వహించడం లేదన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు రెగ్యులర్ గా మీటింగ్ లు ఏర్పాటు చేసి హాస్పిటల్​ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలనే డిమాండ్​ వినిపిస్తోంది. 

త్వరలో మీటింగ్ నిర్వహిస్తాం

ప్రతి  మూడు నెలలకొకసారి మీటింగ్ జరగాలి. కానీ మీటింగ్ టైంలో ప్రజా ప్రతినిధులకు బిజీ షెడ్యూల్ ఉంటోంది. మాకూ ఇతరత్రా మీటింగ్ లు, రివ్యూలు  కూడా ఉంటున్నాయి. దీంతో మీటింగ్ నిర్వహణ వాయిదా పడుతోంది. ఎప్పటికప్పుడు కలెక్టర్, జడ్పీ ఛైర్ పర్సన్ లను కలిసి హాస్పిటల్ సమస్యలు చెబుతున్నాం. త్వరలోనే మీటింగ్ కూడా నిర్వహిస్తాం.

-రత్నమాల, సూపరింటెండెంట్, సివిల్ హాస్పిటల్