ఉగ్రవాద అనుకూల దేశాలపై ప్రపంచం ఒత్తిడి తేవాలి : మోడీ

ఉగ్రవాద అనుకూల దేశాలపై ప్రపంచం ఒత్తిడి తేవాలి : మోడీ

ప్రధానమంత్రి నరేంద్రమోడీ, సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ ఈ ఉదయం ప్రత్యేకంగా సమావేశమైన ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. మీటింగ్ లో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఆ తర్వాత ఉమ్మడిగా ప్రకటన చేశారు.  రెండు దేశాల మధ్య తీసుకున్న ఒప్పందాలకు సంబంధించిన అంగీకార పత్రాలను అధికారులు… మోడీ, సల్మాన్ ల సమక్షంలో మార్చుకున్నారు.

ప్రధానమంత్రి మోడీ మాట్లాడుతూ“ఇండియాకు  అత్యంత విలువైన వ్యూహాత్మక భాగస్వాముల్లో సౌదీ అరేబియా ఒకటి. రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అయ్యాయి. ఇండియాలో మౌలిక వసతుల కల్పనలో సౌదీ అరేబియా పెడుతున్న పెట్టుబడులను స్వాగతిస్తున్నాం. అంతర్జాతీయ సౌరశక్తి కూటమిలో సౌదీ అరేబియా చేరడాన్ని స్వాగతిస్తున్నాం. రక్షణ రంగంలో సహకారాన్ని మరింత పెంపొందించే చర్యలపై చర్చించాం” అన్నారు.

ఉగ్రవాదంపై మాట్లాడిన మోడీ “పదేపదే ప్రపంచవేదికలపై దేనిపైన మేం చెబుతూ వచ్చామో.. అదే ఉగ్రదాడి పుల్వామాలో జరిగింది. ఉగ్రవాదానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న దేశాలపై.. సాధ్యమైనంత ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందని మేం అంగీకరించాం” అని అన్నారు.

సౌదీ యువరాజు సల్మాన్ మాట్లాడుతూ.. “తీవ్రవాదం, ఉగ్రవాదం గురించి మేం ఆందోళన చెందుతున్నాం. మా స్నేహపూర్వక దేశమైన ఇండియాకు ముందుండి అన్ని రకాల సాయం అందిస్తాం. ఇంటలిజెన్స్ సమాచారం అందిస్తాం. భావితరాలకు మంచి భవిష్యత్తు అందించేందుకు మేం కలిసి పనిచేస్తాం” అని అన్నారు.