కరోనా తర్వాత హైర్​ చేస్కున్న ఎంప్లాయ్స్ పై IT కంపెనీల ఫోకస్

కరోనా తర్వాత హైర్​ చేస్కున్న ఎంప్లాయ్స్ పై IT కంపెనీల ఫోకస్

ఫేకో.. కాదో తేలుస్తున్నరు
కరోనా తర్వాత హైర్​ చేస్కున్న ఎంప్లాయ్స్ పై ఐటీ కంపెనీల ఫోకస్

హైదరాబాద్, వెలుగు : ఐటీ కంపెనీల్లో ఉద్యోగాల కోసం ఎప్పుడూ పోటీ ఉంటుంది. జాబ్ ​వస్తే ప్యాకేజీలు లక్షల్లో ఉంటాయి. ఈ క్రమంలోనే ఐటీ ఎంప్లాయ్​గా సెటిల్​అవ్వాలని ఎంతో మంది ప్రయత్నిస్తుంటారు. కరోనాకు ముందు ఇంటర్వ్యూలన్నీ ఆఫీసుల్లో ఫిజికల్ గా జరిగేవి. లాక్​డౌన్​పెట్టాక వర్క్​ఫ్రమ్ హోమ్ చేసే వెసులుబాటు ఇవ్వడంతో అంతా ఇండ్ల నుంచి పనిచేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు అన్ని కంపెనీలు తమకు కావాల్సిన మ్యాన్ ​పవర్​ను వర్చువల్​గానే రిక్రూట్​చేసుకుంటున్నాయి. ఇదే అదునుగా వేల మంది బ్యాక్​డోర్, ఫేక్​సర్టిఫికెట్లు, ఫేక్​ఎక్స్​పీరియన్స్ తో జాబ్స్​పొందారు.

డిగ్రీలు, వర్కింగ్​ఎక్స్​పీరియన్స్​లేకుండానే తెలిసిన వాళ్ల ద్వారా ఇంటర్వ్యూలు చేయించుకుని ఏదోక కంపెనీల్లో దూరిపోయారు. ఎలాగో వర్క్​ఫ్రమ్​హోమ్ నడుస్తుండడంతో అప్పటికే ఆ డొమైన్​పై పనిచేస్తున్నవారికి శాలరీలో కొంత ఇచ్చి మేనేజ్​చేస్తున్నారు. బ్యాక్ డోర్ నుంచి కూడా ఎక్కువ మందే జాయిన్​అయ్యారు. ఇప్పుడిప్పుడే కంపెనీలు పూర్తిస్థాయిలో ఓపెన్​అవుతున్నాయి. ఫేక్​వ్యవహారాన్ని ఆలస్యంగా గుర్తించిన మేనేజ్​మెంట్లు కరోనా తర్వాత చేరిన వారిపై స్పెషల్ ఫోకస్ పెట్టాయి. థర్డ్ పార్టీ కంపెనీలతో సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ చేయిస్తున్నాయి. ఫేక్​అని తేలితే ఉన్న పళంగా తొలగిస్తున్నాయి. ఇప్పటికే ఇలా చాలా మంది జాబ్స్​ కోల్పోయారు. 

విపరీతంగా హైర్​ చేసుకున్నరు
లాక్ డౌన్ తర్వాత ఐటీ కంపెనీలకు అధిక సంఖ్యలో ప్రాజెక్టులు వచ్చాయి. ఈ క్రమంలో విపరీతంగా ఎంప్లాయ్స్​ను హైర్ చేసుకున్నాయి. ఇదే అదునుగా కొందరు కన్సల్టెన్సీల ద్వారా జాబ్స్ ​పొందారు. వందలాది మంది ప్రాక్సీ(ఎక్స్‌‌పీరియన్స్ ఉన్న ఎంప్లాయ్​ఆన్సర్లు చెబుతుండగా, క్యాండిడేట్ వర్చువల్​గా స్క్రీన్ ​ముందు కూర్చుని తల ఊపుతూ చెబుతున్నట్లు నటించడం) ద్వారా ఐటీ కంపెనీల్లో దూరిపోయారు. ఇంటర్వ్యూ అయిపోయాక సెలక్ట్​అయితే, చేసిన పెట్టిన వ్యక్తికి క్యాండిడేట్​ఒకట్రొండు నెలల శాలరీ ఇచ్చారు. మరోవైపు కన్సల్టెన్సీలు, హెచ్ఆర్​లు టైఅప్ ​అయి క్యాండిడేట్లను హైర్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఇలాంటి వారందరినీ మేనేజ్​మెంట్లు గుర్తించే పనిలో పడ్డాయి. ప్రతిఒక్కరి బ్యాక్ గ్రౌండ్​ను  వెరిఫై చేయిస్తున్నాయి. ఎంప్లాయ్​ఎడ్యుకేషన్, గతంలో పని చేసినట్లు పెట్టిన ఎక్స్​పీరియన్స్​నిజమా, కాదా అని క్రాస్ చెక్ చేయిస్తున్నాయి. కొన్ని కంపెనీలైతే 2, 3 పద్ధతుల్లో ఈ ప్రాసెస్​ను కొనసాగిస్తున్నాయి.

నోటీస్​ పీరియడ్​ ఇచ్చి టర్మినేట్​
కొన్నిరోజుల నుంచి బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్​కు సంబంధించిన ఇష్యూ నడుస్తోంది. మా టీం లీడర్, మేనేజర్ల ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ తెలిసింది. మేనేజ్​మెంట్​కు ఏ మాత్రం డౌట్​ వచ్చినా వెంటనే నోటీస్ ​పీరియడ్ ఇష్యూ చేసి టర్మినేట్ చేసేస్తున్నారు. 
- మమత, ఐటీ ఎంప్లాయ్, ఉప్పల్

కొంత మందిని తీసేశారు
ఫ్రెషర్లతో పాటు సీనియర్ల గురించి కూడా తెలుసుకుంటున్నారు. మా టీంలో దీనికి సంబంధించిన చర్చ జరుగుతోంది. ఇప్పటికే కొంతమందిని టర్మినేట్ చేశారని తెలిసింది. బ్యాక్ డోర్ నుంచి వచ్చినవారే కాకుండా ప్రస్తుతం ఎంప్లాయ్స్​అందరూ భయంతో ఉన్నారు.
- అర్జున్, ఐటీ ఎంప్లాయ్, కొండాపూర్

ఇప్పుడిదే హాట్​ టాపిక్ 
ఐటీ సెక్టార్​లో ప్రస్తుతం బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ హాట్ టాపిక్​గా మారింది. ఫేక్ క్యాండిడేట్లు గతంలో 6 శాతం ఉంటే ఇప్పుడు 10 శాతానికి పైగా ఉన్నారని ఐటీ కంపెనీల్లోని సీనియర్ ఎంప్లాయ్స్ చెబుతున్నారు. ఆశించిన స్థాయిలో వర్క్ లేకపోవడం, ప్రాజెక్టులు ఇన్ టైంలో కంప్లీట్ కాకపోతుండడం ఫేక్ ​ఎంప్లాయ్స్​పెరిగిపోవడానికి కారణమని తెలుస్తోంది. ఇప్పటికే కాగ్నిజెంట్, విప్రో, డెలాయిట్ వంటి ఎంఎన్‌‌సీలు ఎంప్లాయ్స్​ రియలా? ఫేకా? తెలుసుకునే పనిలో పడ్డాయి. సోషల్‌‌మీడియాలోనూ దీనికి సంబంధించిన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఫేక్ సర్టిఫికెట్లు, బ్యాక్​డోర్​ద్వారా జాబ్​పొందిన వారందరూ ఆందోళనలో ఉన్నారు. మరోవైపు దొరికిన వారికి  హెల్ప్ చేసిన హెచ్ఆర్​లు, ఇతర ఎంప్లాయీస్​ను మేనేజ్​మెంట్లు ఫైర్ చేస్తున్నాయి.