గుడ్డంత శ్రేష్టమైన ఆహారం మరొకటి లేదు

గుడ్డంత శ్రేష్టమైన ఆహారం మరొకటి లేదు

హైదరాబాద్​: అసలు గుడ్డంత శ్రేష్టమైన ఆహారం మరొకటి లేదని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. పోషణలో తల్లి పాల తర్వాత స్థానం గుడ్డుదే. గుడ్డు అనేక విటమిన్లు, మినరల్స్ తో నిండిన సూపర్ ఫుడ్డు.  గుడ్డులో పొటాషియం, ఐరన్, జింక్, విటమిన్ ఇ, ఫొల్లేట్లు పుష్కలంగా ఉన్నాయి . అధ్యయనాలు, పరిశోధనల ప్రకారం, ప్రతి గుడ్డులో 6 గ్రాముల ప్రోటీన్లు,  78 కాలరీల  శక్తి  ఉంటాయి. నిజానికి గుడ్డు అనేక పోషకాల మిళితం. ఇందులో శరీరానికి అవసరమయిన అన్ని కీలకమైన విటమిన్లు, ఖనిజాలు,  అన్సాచ్యురేటెడ్     కొవ్వులు, మాంసకృత్తులు లభిస్తాయి. తెల్ల సొనలో  అల్బుమిన్  పుష్కలంగా  ఉంటుంది. ఇది ప్రోటీనులకు ఒక అద్భుతమైన మూలం. కండరాలను బలోపేతం చేసుకోవడానికి ఇది అద్భుతంగా సహాయపడుతుంది.  తెల్ల సొన వల్ల మహిళలకు అవసరం అయ్యే కాల్షియం పుష్కలంగా అందుతుంది. ముఖ్యంగా, మహిళల్లో ఎముకల ఆరోగ్యానికి, ఆస్టియోపొరోసిస్ ను దూరంగా ఉంచడానికి  సహాయపడుతుంది. గుడ్డులోని తెల్లసొనలో హిస్టోడిన్‌‌, పచ్చసొనలో జింక్‌‌, కోలీన్‌‌, అయోడిన్‌‌, లినోలిక్‌‌ ఆసిడ్‌‌ ఉంటాయి. వీటితో కొత్త మేధస్సు కణాలు ఎప్పటికప్పుడు ఉత్పత్తి అవుతుంటాయి. గుడ్లలో చెడు కొలెస్ట్రాల్ ఉండదు. గుడ్డులోని పచ్చసొన గర్భిణీ స్త్రీలకు,  పిల్లలకు చాలా ఆరోగ్యకరం. గుడ్డులోని పచ్చసొనలో శరీర సౌష్టవాన్ని కాపాడే విటమిన్‌‌-డి, అనవసరమైన కొవ్వును కరిచే కోలీన్‌‌, సెలీనియం, బి12 పుష్కలంగా ఉంటాయి. వారానికి మూడు సార్లు, రెండు గుడ్ల చొప్పున బ్రేక్‌‌ఫాస్ట్‌‌గా తీసుకుంటే ఊబకాయం, గుండె జబ్బులు తగ్గుతాయని  పరిశోధనలు చెబుతున్నాయి.

ప్రతి వ్యక్తి సంవత్సరానికి కనీసం 180 గుడ్లు తినాలని మన దేశపు జాతీయ పోషణ సంస్థ (నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ న్యూట్రిషన్​) సూచించింది. కాని, మన  దేశంలో  సగటు వినియోగం 70 గుడ్లు మాత్రమే ఉంటోంది.   ఇతర దేశాలతో పోల్చుకుంటే, భారత్ లో తలసరి గుడ్ల వినియోగం బాగా పెరగాలి. మెక్సికో, జపాన్, కొలంబియా లాంటి దేశాల్లో తలసరి వినియోగం 340 గుడ్లవరకు  ఉంది. గుడ్ల వినియోగంలో, ప్రపంచంలో మన ర్యాంకు 114. ఇది చాలా తక్కువ. ఈ విషయం గుర్తించిన మన ప్రభుత్వాలు కూడ, విద్యార్దులకు, గర్భిణి స్త్రీలకు, మధ్యాహ్న  భోజనం లాంటి పథకాల్లో గుడ్లను అందించి,  పోషకాహార లోపం తలెత్తకుండా చూస్తున్నాయి. 

‑ సురేష్ చిట్టూరి,   ప్రెసిడెంట్  - అంతర్జాతీయ ఎగ్ కమిషన్