ఇన్ చార్జీలతో ఇంకెనాళ్లు?

ఇన్ చార్జీలతో ఇంకెనాళ్లు?
  •     ఒక్కో ఎంఈవోకు నాలుగేసి మండలాలు
  •     టీచర్లు, ఎంఈవోల కొరత తీర్చని సర్కార్ 
  •     జిల్లాలో కుంటుపడుతున్న విద్యావ్యవస్థ

మందమర్రి,వెలుగు: సర్కార్​ బడులపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఏళ్లకేళ్లుగా ఇన్​చార్జీలతో నెట్టుకొస్తుండడంతో చదువు కుంటుపడుతోంది. మంచిర్యాల జిల్లాలో టీచర్లు, ఎంఈవోల కొరత వేధిస్తోంది. 510 ప్రైమరీ, 96 యూపీఎస్​, 108 హైస్కూళ్లు ఉండగా..51 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 2,863 మంది టీచర్లకు గాను 2,391 మంది మాత్రమే ఉన్నారు. పలువురు టీచర్లు రిటైర్​ కావడం.. ఆరేళ్లుగా నియామకాలు లేకపోవడంతో 472  టీచర్ ​పోస్టులు ఖాళీగా ఉన్నాయి. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూస్తున్నామని ఆఫీసర్లు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం విద్యార్థులకు పూర్తిస్థాయి పాఠాలు అందడంలేదు. సమయానికి సిలబస్​ పూర్తికావడంలేదు.

ఒక్కొక్కరికి  నాలుగేసి మండలాలు..

జిల్లాలో 2005 సంవత్సరం నుంచి రెగ్యులర్ ఎంఈవోలను నియమించలేదు.  దీంతో  18 మండలాల్లో ఒక్కరు కూడా రెగ్యులర్ ఎంఈవో  లేరు. అన్ని మండలాలకు కలిపి ఏడుగురు సీనియర్ గెజిటెడ్ హెచ్ఎంలు ఇన్​చార్జి ఎంఈవోలుగా వ్యవహరిస్తున్నారు. ఒక్కొక్కరు మూడు నుంచి నాలుగు మండలాల బాధ్యతలు చూస్తున్నారు. ఆయా మండలాల పరిధిలోని కనీసం 40 స్కూళ్లను పర్యవేక్షిస్తున్నారు. మందమర్రి మండలం పొన్నారం జడ్పీ హైస్కూల్​లో  పీజీ హెచ్ఎంగా పనిచేస్తున్న జాడి పోచయ్యను మందమర్రి, హాజీపూర్, మంచిర్యాల, నస్పూర్ మండలాల ఇన్​చార్జి ఎంఈవోగా బాధ్యతలు అప్పగించారు. భీమిని జిల్లా పరిషత్​హైస్కూల్​హెచ్​ఎంకు భీమిని, నెన్నెల, కన్నెపల్లి, బెల్లంపలి మండలాల బాధ్యతలు అప్పగించారు. చెన్నూరు మండలం కిష్టంపేట జడ్పీ హైస్కూల్​హెచ్ఎంకు చెన్నూరు, భీమారం, జైపూర్ మండలాల ఇన్​చార్జి ఎంఈవోగా వ్యవహరిస్తున్నారు. జన్నారం జడ్పీ హైస్కూల్ ​హెచ్ఎం జన్నారం, దండేపల్లి మండలాలు, వేమనపల్లి హైస్కూల్ హెచ్​ఎం వేమనపల్లి, కోటపల్లి మండలాలకు, తాండూరు మండలం తంగేళ్లపల్లి జడ్పీ స్కూల్ హెచ్ఎం తాండూరు మండల ఇన్​చార్జి ఎంఈవోగా వ్యవహరిస్తున్నారు. లక్సెట్టిపేట మండలం ఇటిక్యాల హైస్కూల్ హెచ్ఎం దండేపల్లి, లక్సెట్టిపేట మండలాలకు ఎంఈవోగా కొనసాగుతున్నారు. కాసిపేట మండలం ధర్మరావుపేట జడ్పీ హైస్కూల్ హెచ్ఎం దామోదర్​రావు జిల్లా పరీక్షల అడిషనల్ కమిషనర్​గా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో నిర్వహించే ప్రతీ ఎగ్జామ్ నిర్వహణ బాధ్యత ఆయననే చూస్తున్నారు. దీంతో మిగతా పనులు పర్యవేక్షించలేకపోతున్నారు. 

రెగ్యులర్ బాధ్యులేరి?

జిల్లాలో కేవలం ఏడుగురు గెజిటెడ్ హెచ్ఎంలను ఇన్​చార్జి ఎంఈవోలుగా నియమించారు. హోదాహెచ్ఎం అయినా పనులు మాత్రం శక్తికి మించి ఎంఈవో బాధ్యతలతో పలువురు ఇబ్బంది పడుతున్నారు. పనిభారం, ఒత్తిళ్లు, పెరిగిన బాధ్యతలు,  దూర ప్రాంతం వంటి సమస్యలు వెంటాడుతున్నాయి. దీంతో ఏడుగురిలో కొందరు ఇన్​చార్జి బాధ్యతల నుంచి తప్పుకోవాలని చూస్తున్నారు. ఇటీవల రెండు మండలాలకు ఏంఈవోగా పనిచేసిన హెచ్ఎం పనిభారం మోయలేక డ్యూటీల నుంచి తప్పుకుంటానని చెప్పడంతో ఒకటి మాత్రమే కేటాయించారు. ఇన్​చార్జిగా పనిచేసినా వచ్చిన కొత్త గుర్తింపు ఏమీలేదని వాపోతున్నారు. పనిభారం, ఒత్తిళ్లు, కిందిస్థాయిలో సరియైన స్టాఫ్ లేకపోవడంతో గతంలో స్కూల్​లోనే  హెచ్ఎంగా కొనసాగేందుకు ఆసక్తి చూపుతున్నారు. 

పనులన్నీ ఇన్​చార్జీలతోనే...

ఇన్ చార్జి ఎంఈవోలు అన్ని పనులు చేసుకోవాల్సి వస్తోంది. నిత్యం విద్యాశాఖ మీటింగ్​లు, నిరంతరం టీచర్స్​తో జూమ్ మీటింగ్​లు, పనిచేస్తున్న స్కూల్ నిర్వహణ, విద్యాశాఖ కార్యక్రమాల అమలు,  జిల్లా, రాష్ట్ర స్థాయి ఆఫీసర్లు అడిగే డాటా వివరాలు సేకరించడం, మన ఊరు.. మనబడి రివ్యూలు, పనుల పర్యవేక్షణ, బడుల నిర్వహణ తదితర అంశాలను పూర్తి స్థాయిలో చేయాల్సి ఉంటుంది. ఇటీవల ప్రభుత్వం సర్కార్ మన ఊరు మన బడి.. -మన బస్తీ మన బడి కార్యక్రమాలు చేపట్టింది. స్కూళ్లలో స్టూడెంట్ల సౌలత్​లు, మౌలిక వసతుల కల్పన కోసం అదనపు క్లాస్ రూమ్స్, వర్క్​షాప్ ​నిర్వహణ, ఇతర రిపేర్లు చేపట్టింది.  తొలివిడతలో ఎంపిక చేసిన  వాటిలో పనులు చేయించడం పీజీ హెచ్ఎంలకు కష్టంగా మారింది. పనుల నివేదికలు తయారు చేయడం... సక్రమంగా పనులు చేయడం తలకుమించి భారమవుతుందని ఇన్​చార్జి ఎంఈవోలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఎంఈవోలకు సహాయపడేందుకు ప్రతీ మండల పరిధిలో సుమారు ముగ్గురు సీఆర్పీలు, ఒక్కొక్కరి చొప్పున ఎంఐఎస్, సీసీవో, మెసెంజర్లు, ఐఈఆర్ పీ ఉండాల్సి ఉన్నా.. మొత్తం 141 మందికి 102 మంది మాత్రమే ఉన్నారు.