సౌలత్​లు సక్కగ లేక స్టూడెంట్స్​అవస్థలు పడుతుండ్రు

సౌలత్​లు సక్కగ లేక స్టూడెంట్స్​అవస్థలు పడుతుండ్రు

తెలంగాణ వస్తే విద్యారంగంలో పెనుమార్పుల వస్తాయని, కేజీ టు పీజీ వరకు ఉచిత నాణ్యమైన విద్య అందిస్తామని ప్రగల్భాలు పలికిన నేతలు, స్వరాష్ట్రం సాధించి ఎనిమిదేండ్లు దాటినా.. విద్యా రంగాన్ని పట్టించుకోవడం లేదు. మొన్నటి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో తెలంగాణ ప్రజలందరూ కడుపు నిండా తిని, కంటి నిండా నిద్రపోతున్నారని రాష్ట్ర సీఎం కేసీఆర్​ అన్నారు. కానీ వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులు ఇదేమి అన్నం రామచంద్రా! అంటూ ఇబ్బంది పడుతున్నారు. గురుకులాల్లో సౌలత్​లు సక్కగ లేక స్టూడెంట్స్​అవస్థలు పడుతున్నారు.

ఈ సంవత్సరం నుంచి ఇంగ్లిష్​మీడియం బోధన ప్రారంభించినా.. ఎక్కడా ఆశించిన స్థాయిలో సాగడం లేదు. 2020 నూతన జాతీయ విద్య విధానం అమల్లోకి వచ్చిన తరువాత మూడేండ్లకు పైబడిన పిల్లలకు అడ్మిషన్ ఇచ్చి కేజీ తరగతులు ప్రారంభించే అవకాశం వచ్చింది. కానీ రాష్ట్రంలో నూతన జాతీయ విద్యావిధానం అమలు జాడే లేదు. పలు రాష్ట్రాలు అంగన్​వాడీలను, ప్రాథమిక పాఠశాలను అనుసంధానం చేసి, కేజీ తరగతులు ప్రారంభిస్తున్నా, మన సర్కారు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.

ఖాళీలు ఎన్నడు నింపుతరు?

18 వేలకు పైగా ఉన్న ప్రైమరీ స్కూళ్లు, 3 వేలకు పైగా ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలు, 4 వేలకు పైగా ఉన్న హైస్కూళ్ల నిర్వహణ విషయాన్ని పరిశీలిస్తే కీలక పోస్టులన్నీ ఖాళీగానే ఉన్నాయని తెలుస్తున్నది. పర్యవేక్షణ పోస్టులైన ఎంఈవో పోస్టులు, డిప్యూటీ ఈవో పోస్టులు 95 శాతం ఖాళీగా ఉన్నాయి. స్వరాష్ట్రంలో వీటి రిక్రూట్​మెంటే జరగలేదంటే అతిశయోక్తి కాదు. గెజిటెడ్​హెచ్ఎంల పోస్టులు 50 శాతం ఖాళీగా ఉన్నాయి. ఇవి పోనూ సబ్జెక్టు టీచర్ల కొరత తీవ్రంగా ఉంది. ఇట్లా అన్ని ఖాళీలు కలుపుకొని దాదాపు 30 వేల పోస్టులు నింపాల్సి ఉన్నా సర్కారు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.

సిబ్బంది కొరత ఇట్లుంటే.. సౌలత్ ల కల్పన ఇంకో సమస్య. సర్కారు బడుల్లో సౌలత్​ల కల్పనకు ప్రభుత్వం మన ఊరు – మన బడి కార్యక్రమం చేపట్టినా.. ఎక్కడా ఆశించిన స్థాయిలో మౌలిక వసతులు మెరుగుపడలేదు. చాలా బడుల్లో క్లాస్​రూమ్​లు లేవు, కొన్ని చోట్ల ఉన్నా, శిథిలావస్థలో ఉన్నాయి. బడుల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా తయారైంది. పారిశుద్ధ్య నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం ఆయా గ్రామ పంచాయతీలకు అప్పగించడం వల్ల పాఠశాలలో శుభ్రం చేసే ప్రక్రియ సరిగా జరగడం లేదు. ప్రత్యేకంగా స్వీపర్లు గానీ, నాలుగో తరగతి సిబ్బందిని గానీ నియమించడం ప్రభుత్వం పూర్తిగా నిలిపివేసింది.

మధ్యాహ్నభోజన పథకం కూడా అంతంత మాత్రంగానే అమలవుతున్నది. చాలా బడుల్లో తాగునీటి వసతి లేదు. కిచెన్ షెడ్లు, టాయిలెట్ల నిర్వహణ సరిగా జరగడం లేదు. రాష్ట్ర సాధనకు ముందు అన్ని హైస్కూల్స్, కొన్ని ప్రాథమికోన్నత పాఠశాలల్లో కంప్యూటర్ తరగతుల నిర్వహణ జరిగేది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆ ఊసే లేదు. అకడమిక్​ఇయర్​మొదలై త్రైమాసికం పూర్తి అవుతున్నా.. 40 శాతం పుస్తకాలు విద్యార్థులకు అందలేదు. ఉచితంగా అందించే రెండు జతల దుస్తులు కూడా ఇంకా పూర్తి స్థాయిలో పిల్లలకు అందకపోవడం తెలంగాణలో విద్యారంగంపై ప్రభుత్వ చిత్తశుద్ధిని తెలియజేస్తుంది. 

ఉన్నత విద్య ఆగమాగం

రాష్ట్రంలో ఇంటర్, డిగ్రీ సహా యూనివర్సిటీ విద్య కూడా గందరగోళంగా ఉన్నది. ఇంటర్​ కాలేజీలు దయనీయ స్థితిలో ఉన్నాయి. జూనియర్ లెక్చరర్ల నియామకం సర్వీసు నిబంధనలతో ముడిపడి ఉన్నందున ఏండ్లుగా జేఎల్​రిక్రూట్​మెంటే లేదు. డిగ్రీ కాలేజీలదీ ఇలాంటి పరిస్థితే. యూనివర్సిటీల్లో ఎనిమిదేండ్లుగా వీసీల నియామకం జరగడం లేదు. దాదాపు 90 శాతం ప్రొఫెసర్ల పోస్టులన్నీ ఖాళీగానే ఉన్నాయి. తాత్కాలిక, గెస్ట్​లెక్చరర్లు, ప్రొఫెసర్లతోనే కాలం వెళ్లదీస్తున్న పరిస్థితి. బాసర ట్రిపుల్​ఐటీలో కనీస సౌలత్​ల కల్పన కోసం విద్యార్థులు ఎండా వానలను లెక్కచేయకుండా ఉద్యమం చేసిన తీరు రాష్ట్రాన్ని కదిలించింది. కానీ సర్కారు మాత్రం స్పందించడం లేదు. 

పదోన్నతులు, బదిలీలు ఏమాయె!

విద్యారంగంలో ఖాళీలను భర్తీ చేయాలంటే పదోన్నతులు చేపట్టడం తప్పనిసరి. పదోన్నతులు చెపట్టడం వల్ల టీచర్లకు లాభం జరుగుతుందనే విషయం కంటే విద్యా వ్యవస్థలో పర్యవేక్షణ పెరగడం, మంచి విద్యాబోధన జరిగి విద్యా వ్యవస్థ గాడినపడుతుందని చెప్పొచ్చు. 8 ఏండ్లుగా పదోన్నతులు లేకపోవడానికి సర్వీసు నిబంధనల సమస్య న్యాయస్థానాలల్లో ఉన్నదనే కారణం చెప్తున్న ప్రభుత్వం, 2016లో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 2017లో రాష్ట్రపతి ఉత్తర్వులు పొందినప్పటికీ సకాలంలో స్పందించలేదు.

దీని వల్ల మళ్లీ సర్వీసు రూల్స్ వ్యతిరేకించే టీచర్లు హైకోర్టును ఆశ్రయించడం, హైకోర్టు సర్వీసు రూల్స్ పై అభ్యంతరం తెలుపగా ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడం జరిగాయి. పదోన్నతులు, బదిలీల విషయంలో ఉపాధ్యాయ సంఘాలు విద్యామంత్రికి ప్రాతినిధ్యం చేసి ఇదిగో వేసవి సెలవుల్లో, దసరా సెలవుల్లో జరుగుతాయి అని ఊరడిస్తున్నారే తప్ప పదోన్నతులు జరిపే ఆలోచన చేయడం లేదు. ఉపాధ్యాయ సంంఘాలు అన్ని ఐక్య ఉద్యమకార్యచణ రూపొందిస్తే గానీ విద్యారంగ సమస్యలు పరిష్కారమయ్యేలా లేవు. సంఘాలన్ని ఏకమై కొట్లాడితేనే విద్యావ్యవస్థ మెరుగుపడుతుంది.

నిధుల సమస్య

ప్రభుత్వ బడులు, గురుకులాల్లో సమస్యలు రావడానికి ముఖ్య కారణం నిధులు లేమి. చాలా గురుకులాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. సర్వశిక్ష అభియాన్ నుంచి కేంద్రం త్రైమాసికంగా విడుదల చేసే నిధుల్లో 60 శాతం కేంద్ర వాటా అయితే, 40 శాతం రాష్ట్ర వాట, రాష్ట్ర వాటా కేంద్రం నిధులకు కలిపితేనే వాడుకునే అవకాశం ఉన్నందున రాష్ట్రం 40 శాతం నిధులను సకాలంలో అందుబాటులోకి తేకపోవడం వల్ల కేంద్ర వాటా వాడుకోలేని పరిస్థితి ఉన్నది. ‘మనఊరు- – మనబడి’ పథకాన్ని ప్రవేశపెట్టి నిధులు మంజూరు చేయడంలో సర్కారు జాప్యం చేస్తున్నది. పైగా దాతలు ముందుకు రావాలని కోరుతున్నది. ఏటా విద్యారంగానికి బడ్జెట్​కేటాయింపులు కూడా తగ్గిస్తూ వస్తున్నది. -పులి సరోత్తం రెడ్డి, ఎనలిస్ట్